/rtv/media/media_files/2026/06/05/fotojet-2026-06-05-11-36-39.jpg)
Government Doctors Strike
Government Doctors Strike : తెలంగాణలో ప్రభుత్వ వైద్యుల బదిలీల వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నెం. 38 నిబంధనలను అధికారులు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారంటూ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) ఆందోళన బాట పట్టింది. ఈ క్రమంలోనే అసోసియేషన్ పిలుపు మేరకు శుక్రవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు విధులను బహిష్కరించి ఆకస్మిక సమ్మెకు దిగారు. బదిలీల్లో పారదర్శకత పాటించాలంటూ వైద్యుల సంఘం విధించిన గడువుపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని సంఘం నేతలు స్పష్టం చేశారు.
వైద్యుల ఆకస్మిక సమ్మె ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ వంటి ప్రధాన బోధనాసుపత్రులతో పాటు అన్ని జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో అత్యంత కీలకమైన ఔట్ పేషెంట్ (OP) సేవలను వైద్యులు పూర్తిగా నిలిపివేశారు. ఉదయం నుంచే చికిత్స కోసం ఆసుపత్రులకు క్యూ కట్టిన వేలాది మంది పేద రోగులు, మహిళలు, వృద్ధులు ఓపీ స్లిప్పులు దొరక్క, డాక్టర్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, మానవీయ కోణాన్ని పరిగణనలోకి తీసుకుని కేవలం అత్యవసర సేవలు (Emergency Services), ఇన్‌పేషెంట్ (IP) సేవలను మాత్రమే యథావిధిగా కొనసాగిస్తున్నట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రుల ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైద్యులు పెద్ద పెట్టున నిరసనలు తెలుపుతున్నారు.
ఈ ఉద్యమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 5 వేల మంది ప్రభుత్వ వైద్యులు పాల్గొంటున్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. బదిలీల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. జీఓ 38 మార్గదర్శకాలు పూర్తిగా అమలయ్యే వరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్లో ఎవరూ బదిలీ ఆప్షన్ ఫారాలు (Option Forms) సమర్పించబోరని టీజీజీడీఏ కేంద్ర కార్యవర్గం ఒక ప్రకటనలో తేల్చి చెప్పింది. వివిధ వైద్య సంఘాల ప్రతినిధులు కూడా ఈ ఆందోళనకు మద్దతు పలుకుతూ, ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం 2026 ఏప్రిల్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలను పారదర్శకంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు ఈ జీఓ 38 (GO 38) మార్గదర్శకాలను తీసుకొచ్చింది. రాజకీయ లేదా ఇతర బాహ్య ఒత్తిళ్లకు తావులేకుండా నిర్దిష్ట సీనియారిటీ, తప్పనిసరి బదిలీ ప్రమాణాల ఆధారంగా బదిలీలు చేపట్టాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భార్యాభర్తలు ఒకే ప్రాంతంలో పనిచేసేలా ‘స్పౌస్ క్రైటీరియా’ (Spouse Criteria)కు, ఇతర ప్రాధాన్యతా ప్రమాణాలకు పెద్దపీట వేశారు. అలాగే నగర ప్రాంత పోస్టింగ్‌లు (ఫోకల్), గ్రామీణ లేదా దూర ప్రాంత పోస్టింగ్‌ల (నాన్-ఫోకల్) మధ్య సమతుల్యతను కాపాడేందుకు ప్రత్యేక నిబంధనలు పొందుపరిచారు. అయితే, ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో ఈ నిబంధనలను అధికారులు తుంగలో తొక్కుతున్నారనేది వైద్యుల ప్రధాన ఆరోపణ.
బదిలీల ప్రక్రియలో వంద శాతం జీఓ 38 నిబంధనలను యథాతథంగా అమలు చేయాలని టీజీజీడీఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరహరి, సెక్రటరీ జనరల్ డాక్టర్ లల్లు ప్రసాద్ రాథోడ్, సంఘం అధ్యక్షుడు డాక్టర్ రమేశ్ డిమాండ్ చేశారు. భార్యాభర్తల కేటాయింపులతో పాటు అసోసియేషన్ నాయకులకు నిబంధనల ప్రకారం బదిలీల నుండి మినహాయింపులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండివైఖరి వీడి వెంటనే తమతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో అత్యవసర సేవలను కూడా నిలిపివేసి ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వైద్యుల సంఘం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Follow Us