Fake IPS Officer : నకిలీ ఐపీఎస్ అధికారి ఘరానా మోసాలు: జైలు నుంచి రాగానే మళ్లీ కిడ్నాప్‌లు..

పోలీసు అధికారిగా చెలామణీ అవుతూ వ్యాపారులను కిడ్నాప్‌ చేసి డబ్బు వసూలుచేసే పాత నేరస్తుడు నాగరాజు రఘువర్మ మరోసారి పోలీసులకు చిక్కాడు. గతంలో చేసిన నేరాలకు జైలుపాలయిన నాగరాజు జైలు నుంచి రాగానే మళ్లీ చీకటి దందా మొదలుపెట్టాడు.

New Update
FotoJet - 2026-06-04T071349.834

Fake IPS officer scam

Fake IPS Officer : పోలీసు అధికారిగా చెలామణీ అవుతూ వ్యాపారులను కిడ్నాప్‌ చేసి డబ్బు వసూలుచేసే పాత నేరస్తుడు నాగరాజు రఘువర్మ మరోసారి పోలీసులకు చిక్కాడు. గతంలో చేసిన నేరాలకు జైలుపాలయిన నాగరాజు  జైలు నుంచి రాగానే మళ్లీ చీకటి దందా మొదలుపెట్టాడు. జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ వ్యాపారిని కిడ్నాప్‌ చేసి డబ్బు వసూలు చేసిన ఘటనలో తాజాగా పోలీసులకు అతనితో పాటు అతనికి సహాకరిస్తున్న ముఠాను పట్టుకున్నారు. డీసీపీ కోటిరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు.  

ఆంధ్రప్రదేశ్‌ పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామానికి చెందిన నాగరాజు రఘువర్మ (అలియాస్ కార్తికేయ, వంశీ) అనే వ్యక్తి ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి. 2016లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఇతడు, ఆర్మీ అధికారి కావాలనే లక్ష్యంతో హైదరాబాద్‌కు చేరుకుని కొంతకాలం డ్రైవర్‌గా పనిచేశాడు. అనంతరం సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో 2017, 2018 సంవత్సరాల్లో సనత్‌నగర్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆర్మీ ఉద్యోగానికి ఎంపికైనప్పటికీ, పోలీస్ వెరిఫికేషన్‌లో ఇతనిపై ఉన్న పాత దొంగతనం కేసులు బయటపడటంతో ఆర్మీ అవకాశం చేజారిపోయింది.

ఆర్మీ అవకాశం కోల్పోయిన తర్వాత నాగరాజు రూట్ మార్చి 'సూడో ఆర్మీ అధికారి' అవతారం ఎత్తాడు. తాను ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్నానని నమ్మిస్తూ పలువురికి ఉద్యోగాలిప్పిస్తానని మోసగించడం ప్రారంభించాడు. ఆ తర్వాత మరింత బరితెగించి 'నకిలీ ఐపీఎస్ అధికారి'గా మారి, సంపన్న వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాప్‌లకు తెరలేపాడు. బాధితులను నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి, రోజుల తరబడి బంధించి, భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే ఇతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్ రాష్ట్రాల్లో దాదాపు 12 క్రిమినల్ కేసులు, ఒక రౌడీషీట్ నమోదయ్యాయి. గతంలో రెండుసార్లు పీడీ యాక్ట్ (PD Act) కింద జైలుకు కూడా వెళ్లాడు.

చివరిసారిగా 2023లో సైబరాబాద్ పోలీసులకు చిక్కి జైలుకెళ్లిన నాగరాజు, అక్కడ పరిచయమైన పాత నేరస్థులతో కలిసి ఒక  ముఠాను తయారుచేశాడు. ఈ ముఠాలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన నేరస్థులతో పాటు స్థానిక పోలీస్ కానిస్టేబుల్ కూడా భాగస్వామి కావడం గమనార్హం. సదరు కానిస్టేబుల్ సహకారంతో ఆరుగురు సభ్యులతో కూడిన ఒక ప్రత్యేక "సూడో పోలీస్ వ్యవస్థ"ను ఏర్పాటు చేశాడు. కారు, వైర్‌లెస్ సెట్లు, పోలీస్ యూనిఫాంలు, తుపాకులు సమకూర్చుకుని అచ్చం నిజమైన పోలీస్ అధికారుల తరహాలోనే వీరు కిడ్నాప్‌లు, దందాలు సాగించడం మొదలుపెట్టారు. ఈ వ్యవహారం బయటపడ్డాక సదరు కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు విధుల నుంచి డిస్మిస్ చేశారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత ఈ ముఠా మే 18న హైదరాబాద్ లేక్‌బజార్ (జగద్గిరిగుట్ట పరిధి) లో కూకట్‌పల్లికి చెందిన కావూరి పూర్ణచంద్ర రావు (42) అనే వ్యాపారిని లక్ష్యంగా చేసుకుంది. ఆయన ద్విచక్రవాహనంపై వెళ్తుండగా కారుతో అడ్డగించి.. తాము 'హరియాణా పోలీసులు' అని, అక్కడ నమోదైన కేసులో నువ్వు నిందితుడివని బెదిరించి బలవంతంగా తమ నకిలీ పోలీస్ వాహనంలోకి ఎక్కించుకున్నారు. ఆయన మొబైల్ ఫోన్, డెబిట్ కార్డు, రూ. 1 లక్ష నగదు లాక్కున్నారు. అనంతరం ఆయనను సూర్యాపేటకు తరలించి, తీవ్రంగా హింసించి, భయపెట్టి ఆయన బ్యాంకు ఖాతాల నుంచి మరో రూ. 5.26 లక్షలు డ్రా చేయించుకుని నిర్జన ప్రదేశంలో వదిలేశారు.

తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పూర్ణచంద్ర రావు మే 20న జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి పర్యవేక్షణలో, కూకట్‌పల్లి సీసీఎస్, జగద్గిరిగుట్ట పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ) సాయంతో దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్థుల డేటాబేస్‌ను జల్లెడ పట్టి ప్రధాన సూత్రధారి నాగరాజు రఘువర్మతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన సత్యభాన్ సింగ్, హైదరాబాద్‌కు చెందిన నాగేంద్రవర్మ,  రాహుల్ (యశ్వంత్ సింగ్) లను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, ఈ కేసులో ప్రదీప్ కుమార్ మిశ్రా, సునీల్ కుమార్ అనే మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

అరెస్ట్ చేసిన నిందితుల నుంచి పోలీసులు భారీగా నకిలీ పోలీస్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వాటిలో రెండు తుపాకులు (ఒక ఎయిర్ పిస్టల్, ఒక కంట్రీమేడ్ పిస్టల్), పోలీస్ యూనిఫాంలు, బెల్టులు, పోలీస్ హోదాలను సూచించే స్టార్లు, గుర్తులు, వైర్‌లెస్ సెట్లు, హ్యాండ్‌కఫ్స్ (బేడీలు), ల్యాప్‌టాప్, వివిధ రకాల రబ్బర్ స్టాంపులు, లెటర్ ప్యాడ్‌లు, ఒక కారు, బైక్, 10 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ కోటిరెడ్డి బుధవారం నాటి విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా.. నకిలీ పోలీసుల పేరుతో జరిగే ఇలాంటి మోసపూరిత వసూళ్ల పట్ల ప్రజలు, వ్యాపారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Advertisment
తాజా కథనాలు