Hyderabad : నకిలీ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్: హోటళ్లను బెదిరించి డబ్బులు వసూలు!

చేతిలో ఐడీ కార్డ్ లేదు.. ఒంట్లో ఫుడ్ సేఫ్టీ నాలెడ్జ్ లేదు.. కానీ హోటళ్లకు వెళ్లి కేసు పెడతా.. సీజ్ చేస్తా అంటూ కాసుల కక్కుర్తి పడ్డాడో కిలాడీ సెక్యూరిటీ గార్డు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అవతారమెత్తాడు.

New Update
arrest

చేతిలో ఐడీ కార్డ్ లేదు.. ఒంట్లో ఫుడ్ సేఫ్టీ నాలెడ్జ్ లేదు.. కానీ హోటళ్లకు వెళ్లి కేసు పెడతా.. సీజ్ చేస్తా అంటూ కాసుల కక్కుర్తి పడ్డాడో కిలాడీ సెక్యూరిటీ గార్డు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అవతారమెత్తి హోటల్ యజమానులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ అధికారి ఆట కట్టించారు ఎస్సార్ నగర్ పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రగడ్డ శాస్త్రినగర్‌కు చెందిన శ్రీనివాస్ (46) అనే వ్యక్తి ఓ చోట సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయితే, సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో అతను ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అవతారమెత్తాడు.

ఇటీవల ఎస్సార్‌నగర్‌లోని ఒక హోటల్‌కు వెళ్లిన శ్రీనివాస్.. తాను ఫుడ్ సేఫ్టీ అధికారినని హోటల్ యాజమాన్యానికి పరిచయం చేసుకున్నాడు. హోటల్‌లో కిచెన్ సరిగ్గా లేదని, పరిశుభ్రత లోపించిందని నమ్మబలికాడు. దీనిపై కేసు నమోదు చేసి, హోటల్‌కు నోటీసులు ఇస్తానని భయపెట్టాడు. ఆ తర్వాత రూ.10 వేలు ఇస్తే కేసు లేకుండా సర్దుబాటు చేస్తానని డీల్ మాట్లాడాడు. దాంతో భయపడిపోయిన హోటల్ మేనేజర్ సయ్యద్ అలీ ఆషర్ జాఫరీ.. అతని చేతిలో రూ.5 వేల నగదు పెట్టాడు. ఆ డబ్బులు తీసుకుని శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

మళ్లీ అదే హోటల్‌కు వచ్చి

అయితే, కొన్ని రోజుల తర్వాత శ్రీనివాస్ ఆశ చావక మళ్లీ అదే హోటల్‌కు వచ్చాడు. మరోసారి యజమాన్యాన్ని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈసారి హోటల్ సిబ్బందికి అతని ప్రవర్తనపై గట్టి అనుమానం వచ్చింది. నిజంగానే మా హోటల్‌లో లోపాలు ఉంటే మాకు అధికారికంగా నోటీసులు ఇవ్వండి.. అంతే కానీ మీకు పైసలు మాత్రం ఇవ్వమని సిబ్బంది కరాఖండిగా చెప్పారు. దాంతో పప్పులు ఉడకవని గ్రహించిన శ్రీనివాస్ అక్కడి నుంచి కాళ్లకు బుద్ధి చెప్పాడు.

వెంటనే హోటల్ మేనేజర్ ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిశితంగా విచారణ జరిపారు. శ్రీనివాస్ అసలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసరే కాదని, నకిలీ ఐడెంటిటీతో హోటళ్లను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నాడని తేల్చారు. నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

Advertisment
తాజా కథనాలు