దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న ఎన్నికలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ ఎవరు గెలుస్తారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు తగ్గినా.. ఆ తర్వాత జరిగిన పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో భారీ విజయం సాధించడంతో ఆ పార్టీ దూకుడు మీద ఉంది. ఇదే ఊపులో హస్తిన అసెంబ్లీపై కాషాయ జెండా ఎగుర వేస్తామని కమలం నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో, బీజేపీ వైఖరిలో తీవ్ర మార్పులు వచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం సాగుతోంది
కవిత లిక్కర్ స్కాంకు లింకు..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవల్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా ఈ స్కామ్ వ్యవహారంపై కేంద్రం చర్యలు ఉంటాయని తెలుస్తోంది. ఒక వేళ కేజ్రీవాల్ మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్రం దూకుడు కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. ఒక వేళ కేజ్రీవాల్ అధికారానికి దూరమైనా.. లేక తక్కువ మెజార్టీతో అధికారంలోకి వచ్చినా.. కేజ్రీవాల్ మళ్లీ జైలుకు ఖాయమన్న చర్చ సాగుతోంది. కేజ్రీవాల్ జైలుకు వెళ్లాల్సి వస్తే కవిత కూడా మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందన్న టెన్షన్ బీఆర్ఎస్ నేతల్లో వ్యక్తం అవుతోంది.
ఢిల్లీలో బీజేపీ గెలిస్తే చంద్రబాబుకు కష్టమే?
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. దీంతో నితీష్ కుమార్, చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు. దీంతో వీరికి ప్రియార్టీ హస్తినాలో బాగా పెరిగిపోయింది. అయితే.. మహారాష్ట్ర, హర్యానాలో విక్టరీతో దూకుడు మీద ఉన్న బీజేపీ మిత్రపక్షాలపై మళ్లీ ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోందన్న చర్చ ఉంది. ఢిల్లీలోనూ మహారాష్ట్ర తరహా విజయం సాధిస్తే చంద్రబాబుకు ఇంపార్టెన్స్ తగ్గే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
ఢిల్లీలో గెలిస్తే తెలంగాణలో ఆగరు..
గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అధికార కాంగ్రెస్ తో పోటీ పడి 8 సీట్లను దక్కించుకుంది బీజేపీ. అయితే.. ఆ ఊపు ప్రస్తుతం చల్లారింది. కానీ పార్టీలో అధ్యక్ష మార్పు ఈ వారం, పది రోజుల్లో ఉండనుంది. అనంతరం స్థానిక ఎన్నికలకు కొత్త చీఫ్ నేతృత్వంలో వెళ్లడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఒక వేళ ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాగిస్తే శ్రేణులు మరింత జోష్ తో స్థానిక ఎన్నికల్లో తలపడతారన్న చర్చ సాగుతోంది.
ట్యాక్స్ తగ్గింపు.. ఢిల్లీలో టెస్టింగ్..
EWS రిజర్వేషన్లతో ఓ వర్గం ఓట్లను బీజేపీ గంప గుత్తగా తన వైపు తిప్పుకుందన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు రూ.12 లక్షల వరకు ఆదాయంపై ట్యాక్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో మధ్యతరగతి వర్గాల ఓటర్లు బీజేపీకి దగ్గర అవుతారన్న చర్చ సాగుతోంది. ఢిల్లీలో మెజార్టీ ఓటర్లు మధ్యతరగతికి చెందిన వారే ఉంటారు. దీంతో మోదీ వేసిన ఈ ట్యాక్స్ మంత్రంతో వారంతా బీజేపీకి జై కొడతారన్న అభిప్రాయం ఉంది. దేశ వ్యాప్తంగా ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం బాగా పని చేస్తుందని.. మోదీపై ఓట్ల వర్షం కురిపిస్తుందన్న అభిప్రాయం ఉంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు పని చేస్తుందన్నది ఢిల్లీ ఎన్నికల్లో తేలనుంది.
బయటకు వస్తున్న సర్వేలు..
ఇదిలా ఉంటే.. ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి పలు స్థానిక సంస్థలు నిర్వహించిన ప్రీ పోల్ సర్వేల అంచనాలు బయటపడుతున్నాయి. ఫలోడి సత్తా బజార్ అనే స్థానిక సర్వే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై అంచనాలు వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీయే ఎన్నికల రేసులో ముందున్నప్పటికీ.. 2015, 2020లో వచ్చిన సీట్ల కంటే తక్కువ వస్తాయని వెల్లడించింది.
పెరగనున్న బీజేపీ బలం
ఆమ్ ఆద్మీ పార్టీకి ఈసారి ఎన్నికల్లో 38 నుంచి 40 సీట్లు వస్తాయని చెప్పింది. ఇంతకు ముందు 37-39 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. పోలింగ్‌కు ముందు సీట్ల సంఖ్య కాస్త పెరిగినట్లు పేర్కొంది. ఇక బీజేపీకి ఇంతకు ముందు 31-33 సీట్లు వస్తాయని అంచనా వేయగా.. ఇప్పుడు 30 నుంచి32 సీట్లు వస్తాయని తెలిపింది. 2015, 2020 ఎన్నికలతో పోల్చుకుంటే బీజేపీ బలమైన ప్రత్యర్థి పార్టీగా మారినట్లు పేర్కొంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని ఫలోడి సత్తా బజార్ అంచనా వేసింది. ఇంతకుముందు 0-1 సీటు వస్తుందని చెప్పగా.. పోలింగ్‌కు ముందు ఒక్క సీటు కూడా రాదని తేల్చిచెప్పింది. మొత్తానికి ఫలోడి సత్తా బజార్ సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి విజయం సాధిస్తుందని అంచనా వేసింది. కానీ కొన్ని సవాళ్లు ఎదురుకావడం వల్ల పార్టీకి సీట్ల సంఖ్య తగ్గుతుందని పేర్కొంది.
ఆప్‌కు 50-55 సీట్లు
ఇక మరో స్థానిక ఎన్నికల సంస్థ వీప్రిసైడ్ కూడా ఢిల్లీ ఎన్నికలపై సర్వే చేసింది. ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీకి 50-55 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అలాగే బీజేపీకి 15 -20 సీట్లు వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా గెలవదని పేర్కొంది. మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని విప్రిసైడ్ సర్వేలో తేలింది.
దళితుల ఓట్లు ఆప్‌కే
మరోవైపు ఇటీవల 'నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ దళిత్ అండ్ ఆదివాసీ ఆర్గనైజేషన్' (NACDAOR) అలాగే 'ది కన్వర్జెంట్ మీడియా' సంయుక్తంగా జరిపిన సర్వేలో కీలక విషయాలు బయటపడ్డాయి. ఢిల్లీలో దళిత ఓట్లు ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీకే రానున్నాయని ఈ సర్వే వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. జనవరి 1 నుంచి జనవరి 15 వరకు ఈ రెండు సంస్థలు ఢిల్లీలో 6,256 మంది దళితులపై ఎన్నికల సర్వే నిర్వహించాయి. ఇందులో 2,574 మంది మహిళలు కూడా ఉన్నారు. అయితే ఈ సర్వేలో 44 శాతం మంది దళితులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేస్తామని చెప్పారు. 32 శాతం మంది బీజేపీకి, 21 శాతం మంది కాంగ్రెస్‌కు ఓటేస్తామని తెలిపారు. ఆప్‌కు 35 స్థానాల్లో దళితుల మెజార్టీ ఓట్లు ఆప్‌కు పడనున్నాయి.
ఇక బీజేపీకి 28 స్థానాల్లో, కాంగ్రెస్‌కు 7 స్థానాల్లో దళితుల మెజార్టీ ఓట్లు పడనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 12 ఎస్సీ రిజర్వుడ్ సీట్లు ఉండటం మరో విశేషం. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఇతర సామాజిక వర్గాల ఓట్లు కూడా కేజ్రీవాల్‌కే పడనున్నాయని పలువురు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి ఆప్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.
ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో జరగనున్న ఈ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలోకి రావాలంటే కనీసం 35 సీట్లు రావాలి. అయితే ఎన్నికలకు ముందు పలు స్థానిక సంస్థలు జరిపిన ప్రీ పోల్ సర్వేల్లో ఆమ్ ఆద్మీ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేయడం ఆసక్తికరంగా మారింది. ఇక పోలింగ్ రోజున ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. మరీ ఈసారి ఢిల్లీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 8 వరకు వేచి చూడాల్సిందే.