/rtv/media/media_files/2026/02/13/fotojet-9-2026-02-13-21-49-07.jpg)
kothagudem corporation
Municipal Elections : కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం కాంగ్రెస్, సీపీఐ పట్టుబడుతున్నాయి. ఇక్కడ 60 స్థానాలకు గాను ఆ రెండు పార్టీలకు చెరి 22 స్థానాలు దక్కడంతో హంగ్ ఏర్పడింది. అయితే బీఆర్‌ఎస్ నుంచి 8 మందితో మరో 8 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాగా మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోవాలంటే31 మంది అభ్యర్థులు అవసరం అవుతారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ సీపీఐకి మద్దుతు ఇస్తామని ప్రకటించింది. అయితే సీపీఐతో పొత్తు వదులుకోలేని కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. అదే సమయంలో మేయర్ స్థానం కోసం పట్టుపడుతుంది.
కొత్తగూడెం మేయర్ స్థానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకునేది లేదని పార్టీ శ్రేణులు అంటున్నాయి.మేయర్ స్థానాన్ని వదులుకుంటే కొత్తగూడెంలో కాంగ్రెస్ భూస్థాపితం అయిపోతుందన్న భావనలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. దీంతో మేయర్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు మంత్రి పొంగులేటి మాస్టర్ స్కెచ్ వేస్తున్నారు. కొత్తగూడెం మేయర్ స్థానం ప్రాముఖ్యతను మంత్రి పొంగులేటి సీఎం రేవంత్ సహా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షీ నటరాజన్ , టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు వివరించారు. దీంతో కూనంనేనితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెఢ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంతనాలు జరుపుతున్నారు.తొలుత రాష్ట్రంలోని వేరొక మున్సిపాలిటీ చైర్మన్ స్థానం సీపీఐకి కేటాయించి కొత్తగూడెం మేయర్ స్థానం కాంగ్రెస్ కు చేకూరేలా సహకరించాలని ప్రతిపాదనను సీపీఐ ముందుంచింది కాంగ్రెస్ కానీ ఆ ప్రతిపాదనను సీపీఐ తిరస్కరించింది. కొత్తగూడెం మేయర్ స్థానాన్ని వదులుకునేది లేదని సీపీఐ తేల్చిచెప్పింది. దీంతో మేయర్ పీఠంపై సందిగ్ధత నెలకొంది.
క్యాంపులకు తరలిన అభ్యర్థులు
మేయర్ పీఠం రసకందాయంలో పడటంతో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఉండేందుకు తమపార్టీ అభ్యర్థులను సీపీఐ ఏపీలోని గుంటూరు రిసార్ట్ కు తరలించింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థులు మంత్రి పొంగులేటి ఏర్పాటు చేసిన హైదరాబాద్ లోని శిబిరానికి చేరుకున్నారు. కరీంనగర్ లోని ప్రత్యేక శిబిరంలో బీఆర్ఎస్ శ్రేణుల క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు.మేయర్ ఎన్నిక జరిగే వరకు అభ్యర్థులకు క్యాంప్ లోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల కుటుంబాలతో బేరసారాలకు తెరలేపారు.
తమపార్టీ అభ్యర్థులందరూ తమతోనే ఉన్నారని బీఆర్ఎస్ చెబుతుండగా బీఆర్ఎస్ నుంచి ఇద్దరితోపాటు నలుగురు ఇండిపెండెట్లు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ చెబుతోంది. సీపీఐ కూడా ఓఇద్దరు ఇండిపెండెట్ అభ్యర్థులు సహా గెలిచిన 22 మంది పార్టీ అభ్యర్థులు తమతోనే ఉన్నారంటుంది. దీంతో ఎవరూ ఎవరితో టచ్ లో ఉన్నారో తెలియక పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులందరూ తమతోనే ఉన్నారంటూ బీఆర్‌ఎస్ వీడియో ఫుటేజ్ విడుల చేసింది. దీంతో కొత్తగూడెం మేయర్ స్థానం చుట్టూ తెలంగాణ రాజకీయం తిరుగుతుంది.
Follow Us