CM Revanth Reddy : కేటీఆర్ సైగలు చేస్తే కిషన్ రెడ్డి డాన్సులు చేస్తుండు : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు.

New Update
cm revanth

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేశారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, రాష్ట్ర అభివృద్ధికి ఆయన పెద్ద అడ్డంకిగా మారారని ఆరోపించారు. ప్రాజెక్టుల పురోగతి గురించి తాను కిషన్ రెడ్డిని పదిసార్లు అడిగానని, అయినా ఆయన నుంచి ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ఒక్క లేఖ అయినా రాశారా అని ప్రశ్నించిన సీఎం, రాష్ట్రానికి రావలసిన ఐఎఫ్‌ఎస్‌సీ అప్పులను కూడా ఆయనే అడ్డుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడని కిషన్ రెడ్డి వెంటనే తన మంత్రి పదవికి రాజీనామా చేసి, పని చేసే వేరే ఎవరికైనా ఆ పదవిని అప్పగించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా బిఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్న లోపాయికారీ బంధాన్ని రేవంత్ రెడ్డి ఎండగట్టారు. అక్కడ కేటీఆర్ సైగ చేస్తే, ఇక్కడ కిషన్ రెడ్డి డాన్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ చెప్పిన మాటలు వింటూ కిషన్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులను కావాలనే ఆపుతున్నారని, రాష్ట్రంలో ప్రాజెక్టుల ఆలస్యానికి కిషన్ రెడ్డే పూర్తి కారణమని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు రాష్ట్రం కోసం అస్సలు పనిచేయడం లేదని విమర్శించారు. మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోననే కుళ్లుతో, సొంత పార్టీ వాడైనప్పటికీ అక్కడ మెట్రో రైల్ ప్రాజెక్టును బీజేపీ నేతలే అడ్డుకున్నారని ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

ఎలాంటి ఇబ్బంది లేదు

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆయనకు నచ్చినట్టు ఆయన ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవచ్చని చెప్పారు. గతంలో కేవలం శాంతిభద్రతల సమస్య వస్తుందనే కారణంతోనే కొన్ని అనుమతులు నిరాకరించాల్సి వచ్చిందని వివరించారు. పవన్ అడిగిన ప్రశ్నలకు తమ ప్రభుత్వ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే తగిన సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. ఇదే సమయంలో ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సభలకు పవన్ కళ్యాణ్ అనుమతి ఇవ్వడం లేదనే విషయాన్ని కూడా ఆయన ఆరోపించారు. 

 మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌పై ఎలాంటి కేసులు లేకపోయినా, లేని కేసును సృష్టించి రిటర్నింగ్ అధికారి తప్పుగా ఆమె నామినేషన్‌ను తిరస్కరించారని సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట ఓట్ల చోరీకి పాల్పడిన బీజేపీ, ఇప్పుడు సీట్ల చోరీకి తెరలేపిందని, మధ్యప్రదేశ్‌లో మూడవ అభ్యర్థిని రంగంలోకి దించడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఎంపీల విలీనం అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదని, కేవలం పార్టీల విలీనం గురించి మాత్రమే రాజ్యాంగంలో ప్రస్తావన ఉందని ఆయన చట్టపరమైన అంశాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేతలు ఎవరూ అధికారికంగా కాంగ్రెస్‌లో చేరలేదని కూడా ఆయన ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

ఇక  కేబినెట్ విస్తరణపై వస్తున్న వార్తలను సీఎం కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో కేబినెట్ విస్తరణ గురించి తాను ఎలాంటి చర్చలు జరపలేదని చెప్పారు. తమ పార్టీలో మంత్రి పదవులకు 66 మంది ఎమ్మెల్యేలు అర్హులైనప్పటికీ, రాజ్యాంగ నియమాల ప్రకారం 17 మందికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. రకరకాల సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను బట్టి కేబినెట్ ఎంపిక జరుగుతుందని, మా ఎమ్మెల్యేలు ఎవరైనా రాహుల్ గాంధీని కలవొచ్చని, దానికి ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. చివరగా హైడ్రా వివాదంపై స్పందిస్తూ, తాను కేవలం హైడ్రా పనితీరు, దాని ప్రాధాన్యత గురించి మాత్రమే మాట్లాడానని, అంతేకానీ హిట్లర్ గొప్పవాడని గానీ, ఆయన తనకు రోల్ మోడల్ అని గానీ తాను ఎక్కడా అనలేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 

Advertisment
తాజా కథనాలు