KTR డైరెక్షన్‌లో కిషన్ రెడ్డి.. మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్షన్‌లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నాయని సీఎం ఆరోపించారు.

New Update
cm revanth reddy

మెట్రో రైలు విస్తరణ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీరును తప్పుబడుతూ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డైరెక్షన్‌లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నాయని సీఎం ఆరోపించారు. మెట్రో విస్తరణ జరగాల్సిన నియోజకవర్గాల్లో బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారని, అందుకే కావాలనే ఈ ప్రాజెక్టును తొక్కిపెడుతున్నారని మండిపడ్డారు.

మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు మొత్తం రూ. 40 వేల కోట్లు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వివరిస్తూ ఆయన కొన్ని కీలక గణాంకాలను బయటపెట్టారు.  రూ. 13 వేల 400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీతో, 20 ఏళ్ల కాలపరిమితికి తీసుకునేలా ఒప్పించామన్నారు. ఈ లోన్ బదిలీ కోసం డాక్యుమెంట్ ఫీజు కింద రూ. 48 కోట్లు, ఈక్విటీ కింద రూ. 1,400 కోట్లు కూడా ఇప్పటికే చెల్లించామని చెప్పుకొచ్చారు. సరిగ్గా లోన్ చేతికి వచ్చే సమయంలో కిషన్ రెడ్డి రంగంలోకి దిగి అడ్డుపడుతున్నారని సీఎం ఆరోపించారు. 

ఇంతవరకు అంతా సిద్ధం చేశాక IRFC లోన్ ఎందుకు ఇవ్వట్లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. లోన్ శాంక్షన్ కాకుండా ఆయనే అడ్డుకుంటున్నారా లేదా? దీనిపై బాధ్యతగా మాట్లాడుతారా? అని సీఎం ప్రశ్నించారు.

అభివృద్ధిని అడ్డుకుంటున్నారు 

కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి, కేసీఆర్‌కు లొంగిపోయి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గ్రాంట్ విడుదలకు ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సమయం ఉందన్న సీఎం.. నిధులు విడుదల అవుతాయా లేదా అనేది కిషన్ రెడ్డి స్పష్టం చేయాలన్నారు. ఒకవేళ రుణం ఇప్పించలేకపోతే, కనీసం NOC (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) అయినా ఇప్పించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి గనుక చొరవ తీసుకుని నిధులు ఇప్పించి, NOC తెస్తే.. ఆయనకు స్వయంగా శాలువా కప్పి సన్మానిస్తానని సీఎం ప్రకటించారు.

గతంలో కేసీఆర్ కిషన్ రెడ్డిని తిట్టినట్లు తాను ఎప్పుడూ తిట్టలేదని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి పట్ల నాకు పూర్తి గౌరవం ఉంది. నేను ఎప్పుడూ కేంద్రంతో సమన్వయం కోరుకుంటున్నాను. రాష్ట్ర సమస్యలపై మాట్లాడుదాం రమ్మంటే కిషన్ రెడ్డి మాత్రం కలవడానికి సమయం ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisment
తాజా కథనాలు