/rtv/media/media_files/2026/05/18/n-ramchandrarao-2026-05-18-13-42-11.jpg)
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడి కేసుపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు స్పందించారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఒకవేళ బండి సంజయ్ తప్పు చేసి ఉంటే కచ్చితంగా బీజేపీ ఆయనపై చర్యలు తీసుకునేదని, కానీ ఇక్కడ తప్పు చేసింది ఆయన కుటుంబ సభ్యులని పేర్కొన్నారు. చట్ట ప్రకారం ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది ఎవరికైనా ఉండే హక్కు అని ఆయన గుర్తుచేశారు. బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్‌లో ఉన్నప్పటికీ, చట్టాన్ని గౌరవిస్తూ ఆయన పోలీసులకు లొంగిపోయారని రామచంద్రరావు వివరించారు.
అయితే ఈ వ్యవహారంలో బీఆర్‌ఎస్ పార్టీకి, ముఖ్యంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వేరే పని ఏమీ లేనట్టు కేవలం బండి సంజయ్‌ను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి మరీ బండి సంజయ్‌కు, ఆయన కొడుకుకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకోసం బీఆర్‌ఎస్ పార్టీ తమకు అనుకూలంగా ఉన్న మీడియాను, సోషల్ మీడియా నెట్‌వర్క్‌ను వాడుకుంటోందని రామచంద్రరావు విమర్శించారు.
మీ పదవులకు రాజీనామా చేశారా
ఇదే సమయంలో బీఆర్‌ఎస్ అగ్ర నాయకత్వంపై రామచంద్రరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో కాళేశ్వరం కేసు వచ్చినప్పుడు మీరెందుకు కోర్టులకు వెళ్లారని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత జైలుకు వెళ్లినప్పుడు కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ తమ పదవులకు రాజీనామా చేశారా అని నిలదీశారు. కవిత కూడా మీ కుటుంబ సభ్యురాలే కదా అని గుర్తుచేశారు. మీ ఇంటి ఆడపడుచు తప్పు చేసినప్పుడు మీరెందుకు రాజీనామా చేయలేదని, మరి ఇప్పుడు మా మంత్రి) తప్పు చేస్తే మాదే బాధ్యత అన్నట్టుగా ఎలా మాట్లాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజకీయ స్వార్థం కోసం బీఆర్‌ఎస్ నేతలు బండి సంజయ్ కుటుంబాన్నే కాకుండా, ఆఖరికి ఈ కేసులో ఉన్న మైనర్ కుటుంబాన్ని కూడా రోడ్డు మీదకు లాగారని రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక కుటుంబాన్ని పట్టుకుని ఇంత నీచంగా రాజకీయాలకు వాడుకుంటున్న మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎవరూ నమ్మరంటూ ఆయన బీఆర్‌ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
Follow Us