Exhibitors vs. Producers : రామ్‌చరణ్ పెద్ది మూవీకి బిగ్ షాక్..పర్సెంటేజ్‌ కావాలంటున్న ఎగ్జిబిటర్స్!

తెలంగాణ చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల యాజమాన్యాలు (ఎగ్జిబిటర్స్),నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. పెద్ది చిత్రం నుంచే ఇకపై రాష్ట్రంలో పర్సంటేజ్ (కలెక్షన్లలో వాటా) ప్రాతిపదికన మాత్రమే సినిమాలు ఆడిస్తామని ఎగ్జిబిటర్స్ తెగేసి చెప్పారు.

New Update
FotoJet - 2026-05-23T175931.931

Exhibitors vs Producers

Exhibitors vs. Producers : తెలంగాణ చలనచిత్ర పరిశ్రమలో థియేటర్ల యాజమాన్యాలు (ఎగ్జిబిటర్స్),నిర్మాతల మధ్య పర్సంటేజ్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో అత్యవసరంగా సమావేశమైన తెలంగాణ ఎగ్జిబిటర్లు.. ఇకపై రాష్ట్రంలో రెంటల్ (అద్దె) విధానానికి స్వస్తి పలికి, కేవలం పర్సంటేజ్ (కలెక్షన్లలో వాటా) ప్రాతిపదికన మాత్రమే సినిమాలు ఆడిస్తామని తెగేసి చెప్పారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో జూన్ 4న ప్రతిష్ఠాత్మకంగా విడుదల కాబోతున్న 'పెద్ది' సినిమా నుంచే ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని, నిర్మాతలు సంతకం చేసి హామీ ఇస్తేనే థియేటర్లు ఇస్తామని పీటముడి బిగించారు.

తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము ఈ సమస్యను గతంలో 'హరిహర వీరమల్లు' సినిమా విడుదల సమయంలోనే ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లామని గుర్తుచేశారు. అప్పట్లో రెండు నెలల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఏడాది గడిచినా ఎలాంటి పురోగతి లేదని వారు ఆరోపించారు. సమస్య పరిష్కారం కోసం నిర్మాతలు కావాలనే కాలయాపన చేస్తున్నారని, మొదట మూడు వారాల గడువు అని చెప్పి, ఇప్పుడు మళ్లీ ఇంకొక మూడు వారాలు వాయిదా వేస్తూ కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఛాంబర్ కమిటీ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఇది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కాదు, "గిల్డ్ ఫిల్మ్ ఛాంబర్" లా మారుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గత 10, 15 ఏళ్లతో పోలిస్తే ప్రస్తుతం థియేటర్ల వ్యాపారం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, దాదాపు 120 మందికి పైగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల యజమానులు దయనీయ స్థితిలో ఉన్నారని సుదర్శన్ థియేటర్ అధినేత బాలగోవింద్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎగ్జిబిటర్లకు కనీస రెవెన్యూ రావడం లేదని, కానీ నిర్మాతలకు మాత్రం థియేట్రికల్, డిజిటల్, శాటిలైట్, ఓటీటీ, ఆడియో వంటి సుమారు 14 రకాలుగా ఆదాయ మార్గాలు ఉన్నాయని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పర్సంటేజ్ విధానమే విజయవంతంగా నడుస్తోందని, ఇక్కడ మాత్రం పాతకాలపు రెంటల్ పద్ధతిని రుద్దుతున్నారని వారు ధ్వజమెత్తారు. థియేటర్ల గ్రేడింగ్‌ను వాటి సౌండ్ సిస్టమ్, ఏసీలను బట్టి కాకుండా, అక్కడ వచ్చే కలెక్షన్ల ఆధారంగానే చేయాలని డిమాండ్ చేశారు.

రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమాతో తమకు ఎలాంటి వ్యక్తిగత పగ లేదని, నిజానికి ఆ సినిమాను ఈ వివాదం నుంచి మినహాయించాలని అనుకున్నామని ఎగ్జిబిటర్లు స్పష్టం చేశారు. అయితే 'పెద్ది' లాంటి భారీ సినిమాను కూడా వదిలేస్తే, ఆ తర్వాత తమ సమస్యను నిర్మాతలు అస్సలు పట్టించుకోరనే భయంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైతే తామంతా కలిసి మెగాస్టార్ చిరంజీవి గారిని స్వయంగా కలుస్తామని, తమ ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లి పెద్దరికంతో సమస్య సద్దుమణిగేలా కృషి చేస్తామని ఎగ్జిబిటర్ల సంఘం నాయకులు ప్రకటించారు.

ఇదే సమావేశంలో టికెట్ రేట్ల పెంపుపై కూడా ఎగ్జిబిటర్లు కీలక విషయాలు వెల్లడించారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో 'పెద్ది' సినిమాకు రేట్ల పెంపు ఉండొచ్చేమో కానీ, తెలంగాణలో మాత్రం టికెట్ ధరలను పెంచవద్దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, అలాగే ఫిల్మ్ ఛాంబర్‌కు తాము ముందే లేఖలు రాసినట్లు తెలిపారు. టికెట్ రేట్లు విపరీతంగా పెంచి ప్రేక్షకుడిని థియేటర్లకు దూరం చేయవద్దని వారు కోరారు. ఒకవేళ ప్రభుత్వం గానీ, నిర్మాతలు గానీ టికెట్ ధరలు పెంచేలా నిర్ణయం తీసుకుంటే, అప్పుడు మార్కెట్‌లోని డిమాండ్, సప్లై ఆధారంగా ఎగ్జిబిటర్లుగా తాము కూడా తదుపరి చర్యలకు దిగుతామని హెచ్చరించారు.

ఈ కీలక పరిణామాల మధ్యే, ఇటీవల తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్ రావును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు మంత్రిగా పనిచేసిన స్వర్గీయ జువ్వాడి రత్నాకరరావు కుమారుడైన శేఖర్ రావు ఎన్నికతో ఛాంబర్‌లో నూతన ఉత్సాహం వచ్చింది. అయితే, జూన్ 4న 'పెద్ది' విడుదల తేదీ దగ్గరపడుతున్న తరుణంలో ఎగ్జిబిటర్లు పర్సంటేజ్ సిస్టమ్ కోసం పట్టుబట్టడం, నైజాం ఏరియాలో సినిమా ప్రదర్శన మరియు టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర సందిగ్ధతను రేకెత్తిస్తోంది. మరి కొత్త కమిటీ, నిర్మాతలు ఈ వివాదానికి ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.

Advertisment
తాజా కథనాలు