/rtv/media/media_files/2026/05/20/telangana-beer-2026-05-20-14-41-51.jpg)
Summer beer sales
Summer beer sales : రాష్ట్రంలో సూర్యుడు నిప్పులు చెరుగుతుంటే.. మందు బాబులు చల్లటి బీర్లతో 'చిల్' అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా గత 20 ఏళ్ల రికార్డులను బద్దలు కొడుతూ ఎండలు మండిపోతున్నాయి. దీంతో మద్యం ప్రియులు బీరు సేవించడానికి ఎండలను సాకుగా చూపుతున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా బీర్ల విక్రయాల్లో సరికొత్త రికార్డు నమోదైంది. గత ఏప్రిల్ నెలలోనే ఏకంగా 56.21 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే 21 శాతం అధికంగా సేల్స్ జరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ఈ నెలలో 20 రోజుల్లోనే 40 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ లెక్కన రోజుకు 24 లక్షల బీర్లు మనవాళ్లు తాగేస్తున్నారన్నమాట.
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదౌతున్నాయి. దీంతో బీర్ల విక్రయాలు అసాధారణంగా పెరిగాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో56.21 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి.ఈ ఏడాది జనవరిలో 34 లక్షలు, ఫిబ్రవరిలో 38 లక్షలు, మార్చిలో 50.78 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈనెల 20 రోజుల్లోనే 40లక్షల కేసుల బీర్లను అమ్మారు.గత ఏడాది మేలో 34 లక్షల కేసుల బీర్లు విక్రయిస్తే ఈ ఏడాది మేలో 20 రోజులకే 40 లక్షల కేసుల బీర్లు అమ్మినట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది మార్చిలో కేవలం 30.05 లక్షల కేసుల బీర్లు విక్రయించారు.కానీ, ఈ ఏడాది మాత్రం 50.78 లక్షల కేసుల బీర్లను విక్రయించారు. గత ఏడాదితో పోలిస్తే 68 శాతం ఎక్కువగా బీర్ల సేల్స్ పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి.
గత ఏడాది ఫిబ్రవరిలో 28 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగితే ఈ ఏడాదిలో 35 శాతం పైగా విక్రయాలు పెరిగాయి. వేసవిని దృష్టిలో ఉంచుకొని బీర్ల ఉత్పత్తిని 10 నుంచి 12 శాతం పెంచారు. సాధారణంగా 15 రోజులకు సరిపడ స్టాక్ ఉంటుంది. కానీ,ఈసారి మాత్రం 35 రోజులకు సరిపోను బీర్లు నిల్వ చేశారు. దీంతో మద్యం దుకాణాల్లో ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డులు కనిపించడం లేదు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ వంటి నగరాల్లో వీకెండ్ రోజుల్లో గతంతో పోలిస్తే ఎక్కువగా బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు 10 నుంచి 12 లక్షల బీర్ల బాటిల్స్ విక్రయిస్తుంటారు. అంటే నెలకు 25 నుంచి 30 లక్షల కేసుల బీర్లు అమ్ముడౌతున్నాయి. కానీ, ఏప్రిల్‌లో రోజుకు 22.75 లక్షల బాటిల్స్ విక్రయించారు. మే మాసంలో రోజుకు 24.10 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఏప్రిల్‌లో ఎక్సైజ్ శాఖకు రూ.3,272 కోట్ల ఆదాయం లభించింది. ఈ ఏడాది ఏప్రిల్‌కు అది రూ.3,618 పెరిగింది. ఈ నెలలో 20 రోజులకు గాను రూ. 1,895 కోట్ల ఆదాయం లభించింది.
Follow Us