రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. ఇందిరమ్మ ఇళ్ల అర్హులను తేల్చనున్న యాప్

తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుదారుల్లో ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరు కాదు ? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారానే లబ్ధిదారులను ఎంపిక జరగనుంది.

New Update
Revanth indiramma

తెలంగాణలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. దరఖాస్తుదారుల్లో ఈ పథకానికి ఎవరు అర్హులు ? ఎవరు కాదు ? అనే విషయాన్ని తేల్చేందుకు ఓ యాప్ అందుబాటులోకి వచ్చింది. అర్హత ఉన్నవారికే మాత్రమే దరఖాస్తు ప్రాసెస్ ముందుకు సాగుతుంది లేదంటే డిలీట్ అవుతుంది. త్వరలోనే ఈ యాప్ ఆధారంగా అధికారులు దీనిపై సర్వేను ప్రారంభించబోతున్నారు. అయితే ఇది రాష్ట్ర సర్కార్ రూపొందించిన యాప్ కాదు. కేంద్ర ప్రభుత్వమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం దీన్ని తయారు చేసింది. ఈ యాప్‌నే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కూడా వినియోగించనున్నారు. 

మొదటి దశలో 4.16 లక్షల ఇళ్లు

అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున.. తెలంగాణ వ్యాప్తంగా 4.16 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటిదశలో నిర్మించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది చివర్లో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో స్వీకరించిన అప్లికేషన్ల ఆధారంగా ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులను గుర్తించనున్నారు. ఇటీవలే ఇందిరమ్మ కమిటీ గైడ్‌లైన్స్‌ను కూడా ప్రభుత్వ విడుదల చేసింది. గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. అయితే ఈ కమిటీ సభ్యులు ఇందిరమ్మ పథకానికి నిజమైన అర్హులెవ్వరో తేల్చాల్సి ఉంటుంది. 

Also read: కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ వద్ద రిపోర్టు.. వాళ్లపై సీరియస్

యాప్ రూపొందించిన కేంద్రం

నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కేంద్రం.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఇందుకోసమే ఓ యాప్‌ను తయారు చేసింది. ఇందులో ప్రభుత్వ ఇళ్లకు అర్హత పొందాలంటే దానికి కావాల్సిన అర్హతలను ఫీడ్ చేసి ఉంచారు. ఇవే రూల్స్‌ను రాష్ట్రాలు కూడా పాటించాలని.. అప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు పొందేందుకు అర్హత ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో పీఎంఏవై నిధులు పొందాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్.. ఈ రూల్స్‌ను కచ్చితంగా పాటించాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన యాప్ ద్వారానే ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను చేపట్టబోతోంది.  

ప్రజాపాలన, ఇతర పద్ధతుల్లో అధికారులకు అందించిన దరఖాస్తులను ఈ యాప్‌లో ఇప్పుడు ఫీడ్ చేస్తారు. ఆ తర్వాత ఆ యాప్ దరఖాస్తుదారుడికి అర్హత ఉందా లేదా అనేది తేలుస్తుంది. అర్హత ఉన్న దరఖాస్తుదారులనే రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రత్యక్షంగా చూసి అర్హతను పరిశీలిస్తారు. అర్హుల లిస్ట్ సిద్ధమైన తర్వాత ఆ వివరాలు యాప్‌ ఆధారంగా కేంద్రం వద్ద ఉంచుతారు. కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా వాటిని పరిశీలిస్తారు.

Also Read: భారత్‌ సెక్యూలర్ దేశంగా ఉండొద్దని కోరుతున్నారా ?.. పిటిషినర్లకు సుప్రీం చురకలు

 ఇక్కడ మరో విషయం ఏంటంటే కేంద్రం.. కేవలం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన యాప్‌ను మాత్రమే రూపొందించింది. దీన్ని తెలంగాణ ప్రభుత్వం వాడుకోనుంది. అయితే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన లబ్ధిదారుల కోసం రాష్ట్ర సర్కార్.. మరో యాప్‌ను రూపొందిస్తోంది. దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ యాప్‌తో కూడా అనుసంధానిస్తారు. ఈ రెండు యాప్‌ల వివరాలు కేంద్రం ముందు ఎప్పటికప్పుడు ప్రత్యక్షమవుతాయి. దీని ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు