/rtv/media/media_files/2025/09/16/acb-2025-09-16-15-07-01.jpg)
ACB raids
Anti Corruption Bureau: పెద్దపల్లి జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. జిల్లాలోని మంథని నియోజకవర్గ కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా సాగుతున్న అవినీతి భాగోతాన్ని ఏసీబీ అధికారులు గుట్టురట్టు చేశారు.
స్థానిక రైతులు ఇచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మంథని మండలానికి చెందిన కన్నూరి బాపు అనే రైతు తన భూమి రిజిస్ట్రేషన్ కోసం మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లాడు. అయితే అన్ని సక్రమంగా ఉన్నప్పటికీ అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్ ఎండీ రషీద్ భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే రూ.16,500ల లంచం ఇవ్వాల్చిందేనని డిమాండ్ చేశాడు. అయితే తన భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి అన్ని సక్రమంగా ఉన్నప్పుడు అతనికి లంచం ఎందుకు ఇవ్వాలని ఆలోచించిన రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు రైతు బాపు.. రషీద్ అడిగిన లంచం ఇవ్వడానికి అంగీకరించినట్లు నటించారు. ఈ మేరకు లంచం ఇచ్చేందుకు వెళ్లాడు. అదే సమయంలో అప్పటికే అక్కడే ఉన్న ఏసీబీ అధికారులు.. లంచం తీసుకుంటుండగా రషీద్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
అంతటితో ఆగకుండా రిజిస్ట్రేషన్ కార్యాలయం తలుపులు మూసేసిన ఏసీబీ అధికారులు కార్యాలయంలో ముమ్మరంగా సోదాలు నిర్వహించారు. డాక్యుమెంట్ రైటర్ రషీద్‌తో పాటు కార్యాలయంలోని ఇతర సిబ్బందికి ఈ అవినీతితో ఎలాంటి సంబంధం ఉందనే కోణంలో ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. రషీద్ వద్ద నుంచి లంచం సొమ్ము రూ.16,500లను అధికారులు స్వాధీనం చేసుకుని అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా, ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయడానికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఎలాంటి భయం అవసరం లేకుండా ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో గత కొంతకాలంగా పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నట్లు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
Follow Us