Ashureddy : హైకోర్టును ఆశ్రయించిన నటి ఆషురెడ్డి.. ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలంటూ...

ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను కొట్టివేయాలని కోరుతూ అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

New Update
Ashu Reddy

Ashu Reddy

Ashureddy : ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. పెళ్లి పేరుతో తనను, తన కుటుంబాన్ని నమ్మించి దాదాపు రూ. 9.83 కోట్లు మోసం చేసిందంటూ బాధితుడు ధర్మేంద్ర కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)ను కొట్టివేయాలని కోరుతూ అషురెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఈ కేసు వివరాల్లోకి వెళితే.. అషురెడ్డి, ధర్మేంద్ర వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, ఈ క్రమంలో ఇరు కుటుంబాలు కలిసి ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి వద్ద జాతకాలు కూడా చూపించుకున్నట్లు సమాచారం. అయితే పెళ్లి సాకుతో అషురెడ్డి తన వద్ద నుండి సుమారు రూ. 9.83 కోట్లు వసూలు చేసిందని, అలాగే ఆమె సోదరి దివ్యారెడ్డికి కూడా రూ. 50 లక్షలు ఇచ్చినట్లు బాధితుడు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లికి అన్ని సిద్ధమవుతున్న తరుణంలో అషురెడ్డి అకస్మాత్తుగా వివాహానికి నిరాకరించిందని బాధితుడు ఆరోపిస్తున్నారు.

అంతేకాకుండా, అషురెడ్డి అవసరాల కోసం తాను పలు బ్యాంకుల నుండి లోన్లు తీసుకుని మరీ నగదు ఇచ్చానని, ఇప్పుడు ఆ అప్పులు తీర్చలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ధర్మేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తనపై ఎదురు కేసులు పెడతానని లేదా ఆత్మహత్య చేసుకుంటానని అషురెడ్డి బెదిరిస్తోందని ఆయన ఫిర్యాదులో తెలిపారు. తన బాయ్‌ఫ్రెండ్ జయంత్‌తో కలిసి అషురెడ్డి ఈ డ్రామా ఆడి తనను మానసికంగా, ఆర్థికంగా వంచించిందని బాధితుడు వాపోతున్నారు.

బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అషురెడ్డి కుటుంబంపై కఠినమైన సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. అయితే తనపై వస్తున్న ఆరోపణలను అషురెడ్డి పూర్తిగా తోసిపుచ్చారు. పోలీసులు కనీసం తన వాదన వినకుండానే ఏకపక్షంగా కేసు నమోదు చేశారని ఆమె హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో వాస్తవం లేదని, కాబట్టి ఎఫ్ఐఆర్‌ను వెంటనే కొట్టివేయాలని ఆమె కోర్టును వేడుకున్నారు. రెండు నెలల క్రితమే ఫిర్యాదు చేసినా, ఇప్పుడు ఈ వ్యవహారం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అషురెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

Advertisment
తాజా కథనాలు