TS Elections 2023: కాళేశ్వరం, మజ్లీస్‌ల ప్రస్తావన లేని మోదీ ప్రసంగం! బీసీ ఆత్మగౌరవ సభ బీజేపీ కార్యకర్తలను నిరాశకు గురి చేసిందా? ప్రధాని మోదీ తన ప్రసంగంలో ఎక్కడా మజ్లిస్ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు? కాళేశ్వరం ఊసెందుకు ఎత్తలేదు? పొలిటికల్ ఎనలిస్ట్ చలసాని నరేంద్ర ఏం అంటున్నారో ఆర్టికల్‌లోకి వెళ్లి చదవండి! By Trinath 09 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి తెలంగాణ ఎన్నికల్లో చతికలపడిన బీజేపీ ప్రచారంకు పెద్ద ఊపు ఇస్తారని ఆశించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న `బీసీ ఆత్మగౌరవ' బహిరంగసభ ఒక విధంగా నిరాశపరిచింది. ఎంతసేపు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను కుటుంబ పార్టీలని, అవినీతి పార్టీలని నిందించడం, తాము గెలిస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పడమే గాని నిర్దుష్టంగా ఎటువంటి ప్రకటనలు చేయకపోవడం ఆ పార్టీ శ్రేణులను కూడా నిరాశపరిచింది. ముఖ్యంగా బీజేపీకి ప్రధాన ప్రచార అస్త్రంగా ఉండగలదని భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రెండు బ్యారేజీలు కుంగిపోవడాన్ని ప్రస్తావిస్తారని అందరూ ఆశించారు. అదే విధంగా ప్రస్తుతం దేశంలో అన్ని రాస్త్రాలలో బీసీలు డిమాండ్ చేస్తున్న కులగణన గురించి ఏదో ఒక ప్రకటన చేస్తారని, బీసీ వర్గీకరణ గురించి జస్టిస్ రోహిణి కమిషన్ సమర్పించిన నివేదిక గురించి నిర్దుష్టంగా హామీ ఇస్తారని ఎదురు చూసిన వారికి నిరాశే మిగిలింది. అన్నింటికీ మించి బీజేపీ నాయకులు ఎవ్వరు మాట్లాడినా కేసీఆర్ ను నడిపిస్తున్నది పాతబస్తీలోని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసి అని విమర్శలు గుప్పిస్తుంటారు. మోదీ పాలనపై నిత్యం ఒవైసి ప్రకటనలు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీ బలం పుంజుకోవడానికి ప్రధాన కారణం మిగిలిన పార్టీల మాదిరిగా లాలూచీ పడకుండా మజ్లీస్ పై రాజకీయంగా పోరాటం చేస్తారనే. అటువంటిది ఆ పార్టీ గురించి ప్రధాని ప్రస్తావించనూ లేదు. వీటన్నింటికి మించి, ఒకటిన్నర సంవత్సరం తర్వాత సస్పెన్షన్ రద్దు చేసి, గోషామహల్ సీటును తిరిగి కేటాయించిన ఎమ్యెల్యే రాజాసింగ్ ఈ సభలో పాల్గొనక పోవడం అందరికి ఆశ్చర్యం కలిగించింది. పైగా, ప్రధాని పాల్గొన్న బహిరంగసభ ఆయన నియోజకవర్గ పరిధిలోనే జరిగింది. ఇవ్వన్నీ చూస్తుంటే ప్రధాని కొన్ని ఒత్తిడులు ఎదుర్కొంటున్నారని అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్ ఇంజనీర్ల సూచనలు ఖాతరు చేయకుండా స్వయంగా సీఎం కేసీఆర్ చేయడంతో లోపభూయిష్టంగా ఉంది, బీటలు వారుతున్నదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల `మేడిగడ్డ' బ్యారేజిపై కిషన్ రెడ్డి కోరగానే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అత్యున్నత నిపుణుల బృందాన్ని పంపింది. ఆ బృందం సమర్పించిన నివేదికలో నిర్మాణ లోపాలు ఉన్నట్లు ఆరోపించింది. ప్రాజెక్ట్ నిర్మాణంపై సీబీఐ విచారణ కోరాలని కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కోరారు. లేనిపక్షంలో, తెలంగాణాలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తామే విచారణకు ఆదేశిస్తామని ప్రకటించారు. హోమ్ మంత్రి అమిత్ షా నుంచి కేంద్ర బీజేపీ నాయకులు ఎవ్వరు తెలంగాణకు వచ్చినా కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ అవినీతికి ప్రత్యక్ష నిదర్శనం అంటూ దానిని కేసీఆర్ కుటుంభం ఏటిఎంగా అభివర్ణిస్తున్నారు. అటువంటిది ప్రాజెక్ లో లోపాలపై ప్రధాని కేసీఆర్ ను నిలదీసే ప్రయత్నం చేయకపోవడం అందరికి విస్మయం కలిగిస్తుంది. కేసీఆర్- బీజేపీ ఒకటే అంటూ కాంగ్రెస్ సాగిస్తున్న ప్రచారాన్ని కొట్టిపారవేసేందుకు ఢిల్లీ మద్యం కుంభకోణంను ప్రస్తావిస్తూ దోషులకు శిక్ష తప్పదని అన్నారు గాని నేరుగా సీఎం కుటుంబం సభ్యులు ఏ ఏ కుంభకోణంలో ఉన్నారని చెప్పకపోవడం గమనార్హం. ఇలా ఉండగా, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరిపేందుకు కేసిఆర్ ప్రభుత్వం ఆమోదం అవసరం లేదని, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నేరుగా సీబీఐ విచారణ కొరవచ్చని సీబీఐ మాజీ డైరక్టర్ నాగేశ్వరావు పేర్కొనడం గమనిస్తే కేవలం ఎన్నికల ప్రచారం కోసం ఈ ప్రాజెక్ట్ ను వాడుకోవడం తప్ప తగిన విచారణ పట్ల బిజెపికి సహితం ఆసక్తి లేదని స్పష్టం అవుతుంది. కాళేశ్వరానికి కేంద్రానికి చెందిన 10 ఏజెన్సీలే అనుమతులిచ్చాయని నాగేశ్వరరావు ఈ సందర్భంగా చెప్పడం గమనార్హం. అంటే నిర్మానాలోపాలు ఉంటె కేంద్ర ఏజెన్సీలు కూడా బాధ్యత వహించాలి ఉంటుంది. అందుకనే ప్రధాని ఈ విషయమై మౌనం వహిస్తున్నారా? అనే ప్రశ్న తలెత్తుతుంది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి గురించి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెండేళ్ల క్రితమే స్వయంగా ప్రధానిని కలిసి కొన్ని ఆధారాలు అందించారు. విద్యుత్ ప్రాజెక్టులకు ఇచ్చే రుణాలను తీసుకొని సాగునీటి ప్రాజెక్ట్ కట్టారని, ఈ అంశంపై కేంద్రం విచారణ జరిపి తగు చర్య తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని కేసీఆర్ అవినీతి గురించి తనను పలు వివరణలు అడిగారు గాని, ఎటువంటి చర్య తీసుకోలేదని ఆ తర్వాత ఆయన ఓ ఇంటర్వ్యూలో విస్మయం వ్యక్తం చేశారు. ఇక, బహిరంగసభలో రాజాసింగ్ పాల్గొనకపోవడానికి, ప్రధాని మజ్లిస్ పేరు ప్రస్తావించక పోవడానికి సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గం కావడం, తాను అప్పటికే నామినేషన్ వేసి ఉండడంతో తాను హాజరైతే ఆ సభకు పెట్టిన మొత్తం ఖర్చులను తన అకౌంట్ లో వేస్తారని హాజరు కాలేదని రాజాసింగ్ పేలవమైన వివరణ ఇచ్చారు. వాస్తవానికి ఆ వేదికపై ఉన్న అందరు అభ్యర్థులకు సమానంగా ఆ వ్యయాన్ని విభజించవచ్చు. లేదా గ్రేటర్ హైదరాబాద్ లోని అందరు అభ్యర్థులకు పంచవచ్చు. రాజాసింగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి, ఎన్నికల ప్రకటన వరకు సస్పెన్షన్ తొలగించక పోవడానికి ఆయన చేసిన వివాదాస్పద వాఖ్యల పట్ల గల్ఫ్ దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడమే కారణం కావడం గమనార్హం. అమెరికా, చైనా తర్వాత భారత్ అత్యధికంగా గల్ఫ్ దేశాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాయి. పైగా, ప్రస్తుతం ఇజ్రాయిల్ - హమాస్ యుద్ధంలో భారత్ ఇజ్రాయిల్ కు బాసటగా నిలబడడంతో గల్ఫ్ దేశాలతో సున్నితంగా వ్యవహరించాల్సి వస్తున్నది. తోటి ముస్లిం దేశమైన పాకిస్థాన్ ను సహితం లెక్కచేయకుండా భారత్ తో సంబంధాలు మెరుగు పరుచుకొంటున్న ఆయా దేశాల పట్ల భారత్ ఎంతో సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఆ కారణంగానే ప్రధాని సభలో రాజాసింగ్ ఒకే వేదికపై కనిపించడం ఈ దేశాలకు ప్రతికూల సంకేతాలు పంపే అవకాశం ఉందని నివారించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది. ఇదే కారణంతో మజ్లిస్ ప్రస్తావనను కూడా చేయలేదని పరిశీలకులు భావిస్తున్నారు. Also Read: ఓబీసీల విషయంలో గందరగోళంలో బీజేపీ! WATCH: #telangana-elections-2023 #chalasani-narendra-analysis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి