Telangana elections 2023: మోదీ ఎస్సీ వర్గీకరణ మంత్రం బీజేపీకి ఫలిస్తుందా! 'బీసీ ముఖ్యమంత్రి' నినాదంతో పాటు షెడ్యూల్ కులాల వర్గీకరణ అంటూ తెలంగాణ ఎన్నికల వేళ కులాలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది బీజేపీ. అయితే ఇది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? రాజకీయ విశ్లేషకులు చలసాని నరేంద్ర ఏం అంటున్నారో తెలుసుకోవాలంటే ఆర్టికల్‌లోకి వెళ్లి చదవండి. By Trinath 14 Nov 2023 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఆరు నెలల క్రితం తెలంగాణాలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు ప్రధాన పోటీదారునిగా బీజేపీ జనం దృష్టిలో నిలబడింది. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత ఆ పార్టీ గ్రాఫ్ అనూహ్యంగా పడిపోయింది. పార్టీ అధిష్టానం తప్పదని చెప్పినా జీ కిషన్ రెడ్డి, డా. కే లక్ష్మణ్, డీకే అరుణా, జితేందర్ రెడ్డి, పీ మురళీధరరావు లాంటి సీనియర్ నాయకులు పోటీకి వెనుకడుగు వేశారంటే పార్టీ ఎంతటి దుస్థితిలో ఉందొ వెల్లడి అవుతుంది. అందుకనే `బీసీ ముఖ్యమంత్రి' నినాదంతో మొదటి ఒక బాణం వదిలారు. తాజాగా, షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తాం అంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీతో ప్రకటన చేయించి, సాంప్రదాయకంగా పార్టీకి దూరంగా ఉంటున్న దళితులలో ప్రధాన వర్గాన్ని తమవైపు తిప్పుకొని ఎత్తుగడలు వేస్తున్నారు. గత ఏడాది హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని ఎస్సీ వర్గీకరణపై ఇచ్చినా హామీలను నిలబెట్టుకోవడం లేదంటూ అడ్డుకోలేందుకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎం ఆర్ పి ఎస్) కార్యకర్తలు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలతో వారు ఘర్షణకు కూడా దిగారు. ఇప్పుడు ఆ సమితి అధినేత కృష్ణ మాదిగ స్వయంగా వేదికపై ప్రధానిని ఆలింగనం చేసుకొని, ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు. కర్ణాటక ఎన్నికలకు మూడు నెలలకు ముందు ఫిబ్రవరిలో కర్ణాటకలోని బస్వరాజ్ బొమ్మై ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం తీర్మానం చేసింది. సుప్రీంకోర్టులో ఈ అంశం పెండింగులో ఉన్నందున ఏ ప్రయత్నం కూడా ముందుకు సాగలేదు. పైగా, ఆ ప్రయత్నం అక్కడ బిజెపికి అధికారం నిలబెట్టుకునేందుకు ఉపయోగపడలేదు. తెలంగాణాలో సహితం అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పలేము. ప్రధాని ప్రకటన మాదిగలలో ఏమేరకు నమ్మకం కలిగిస్తుందో చూడాల్సి ఉంది. వాస్తవానికి కృష్ణ మాదిగ గత పదేళ్లుగా తరచూ ప్రధాని మోదీని కలుస్తూనే ఉన్నారు. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన 100 రోజులలో ఎస్సి వర్గీకరణ జరుపుతామని హామీ ఇచ్చింది. కానీ, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ విషయమై ఎటువంటి కసరత్తు చేసిన దాఖలాలు లేవు. గతంలోని యుపిఎ ప్రభుత్వం కూడా ఈ విషయమై హామీ ఇచ్చి, ఉషా మెహతా కమిటీని నియమించి కూడా ఏమీ చేయలేక పోయింది. సుప్రీంకోర్టు సహితం ఈ విషయంలో రెండు బెంచ్ లలో రెండు తీర్పును ఇవ్వడంతో ఇప్పుడు మూడో బెంచ్ మీదకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కుల గణనకు వ్యతిరేకిస్తున్న బీజేపీకి, మహిళా రిజర్వేషన్ లలో బిసిలకు రిజర్వేషన్ ప్రసక్తి లేకుండా చేసిన బీజేపీకి ఈ విషయంలో గల చిత్తశుద్ధిపై సందేహాలు మాదిగలలో సహితం వ్యక్తం అవుతున్నాయి. ఎస్సిలలోనే ఈ విషయమై ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం. షెడ్యూల్డ్ కులాల్లో మాల, మాదిగలతో పాటు 55 ఉప కులాలు ఉన్నాయి. రిజర్వేషన్ ప్రయోజనాలు అన్నింటిని మాలలోని కొందరు ఇప్పటికే అభివృద్ధి చెందిన కుటుంబాలే కైవసం చేసుకొంటున్నాయనే అసంతృప్తి మిగిలిన వారిలో వ్యక్తం అవుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో సాంప్రదాయకంగా ఎస్సి వర్గాలు కాంగ్రెస్ కు మద్దతుగా ఉంటున్నాయి. గతంలో టీడీపీ, టిఆర్ఎస్ వంటి పార్టీల ప్రభంజనాల సమయంలో కూడా దళిత వర్గాలు కాంగ్రెస్ కు గట్టి మద్దతుదారులుగా నిలిచారు. కేవలం ఈ వర్గాలలో చీలిక తీసుకురావడం ద్వారా కాంగ్రెస్ వోట్ బ్యాంకును బలహీనం చేసేందుకు చంద్రబాబు నాయుడు ప్రోద్భలంతో కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారని విస్తృతంగా ప్రచారం జరిగింది. పైగా, నిలకడలేని ఆయన రాజకీయ విధానాలు సహితం పలు సందర్భాలలో వివాదాస్పదంగా మారుతూ వచ్చాయి. ఈ విషయమై ఒక వైపు నిపుణుల కమిటీని నియమించడంతో పాటు, మరోవంక సుప్రీంకోర్టులో ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్ ఈ అంశాన్ని చేపట్టే విధంగా చేయడం ద్వారా ప్రస్తుతంకు ఈ అంశాన్ని వాయిదా వేసే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. వర్గీకరణ జరిపితే కొన్ని ప్రాంతాలలో మాదిగలకు రాజకీయ, సామజిక, ఆర్థిక రంగాలలో ప్రాధాన్యత పెరిగినా, ముఖ్యంగా బిజెపి బలంగా ఉన్న ఉత్తరాదిన వారి ప్రస్తుత ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదం ఉన్నదనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అందుకనే, ఈ విషయమై జాతీయ స్థాయిలో ఒక చట్టం తీసుకురాకుండా, రాష్త్ర ప్రభుత్వాలు తమ వర్గీకరణ చేపట్టే వెసులుబాటు కల్పించాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ)లకు కల్పిస్తున్న రిజర్వేషన్లలో వర్గీకరణకు వీలు కల్పించేలా రాజ్యాంగంలోని ఆర్టికల్ 341ను సవరించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలోని కులాల స్థితిగతుల్లో ఏకరూపత లేకపోవడం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు వంటి చోట్ల అసలు ఎస్సీ జనాభాయే లేకపోవడం వంటి అనేక కారణాల రీత్యా దేశవ్యాప్త వర్గీకరణ సాధ్యం కాదనే అభిప్రాయం బలపడుతుంది. పైగా కొన్ని కులాలు ఒక రాష్ట్రంలో ఎస్సీల జాబితాలో ఉంటే, మరికొన్ని రాష్ట్రాల్లో ఎస్టీల జాబితాలో, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బీసీల జాబితాలో ఉన్నాయి. మరోవైపు ఎస్సీ వర్గీకరణ మాదిరిగానే షెడ్యూల్డ్ తెగల(ఎస్టీ)లో కూడా వర్గీకరణ డిమాండ్ మొదలైంది. అటవీ ప్రాంతాల్లో ఉండే గిరిజన, ఆదివాసీల కంటే మైదాన ప్రాంతాల్లో ఉండే కొన్ని కులాలు రిజర్వేషన్ల ఫలాలు తన్నుకు పోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఏ రాష్ట్రంలో వర్గీకరణ అవసరం అనుకుంటే ఆ రాష్ట్రం చట్టం చేసుకునేలా రాజ్యాంగంలోని 341వ అధికరణాన్ని సవరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004లో తీసుకొచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కొట్టేసింది. 2020లో మరోసారి ఈ అంశంపై ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది అని చెబుతూనే ఏడుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనానికి ఈ అంశాన్ని అప్పగించాలని సూచించింది. ఈ వ్యవహారం ఇప్పటికీ సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగులో ఉంది. 1994లో హర్యానా, 2006లో పంజాబ్, 2008లో తమిళనాడు రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం ప్రయత్నించాయి. 2000 సంవత్సరం మార్చిలో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా 7 రాష్ట్రాలు స్పందించగా, 14 రాష్ట్రాలు వ్యతిరేకించాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఎస్సీ జనాభా లేని రాష్ట్రాలు సైతం వ్యతిరేకించడం ఇక్కడ గమనార్హం. 2006-07లో కేంద్ర ప్రభుత్వం నాటి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీల వర్గీకరణ అంశంపై ఉషా మెహ్రా కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వర్గీకరణకు అనుకూలంగా సిఫార్సు చేసినప్పటికీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో అందరి చూపు సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చే తీర్పుపైనే ఉంది. కేవలం ఎస్సీల్లోనే కాదు ఎస్టీల్లోనూ రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందడం లేదని చెప్పేందుకు గణాంకాలతో కూడిన సమగ్ర సమాచారం ఉంది. ఏదేమైనా ఈ అంశం జాతీయ స్థాయిలో రాజకీయంగా కలకలం రేపే అవకాశం ఉంది. -చలసాని నరేంద్ర Also Read: చుక్కకు చుక్కెదురు.. ఎన్నికల వేళ ఫంక్షన్లలో దావత్ బంద్..! #telangana-elections-2023 #chalasani-narendra-analysis మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి