Telangana Elections 2023: ఓబీసీల విషయంలో గందరగోళంలో బీజేపీ!

తెలంగాణాలో తమ పార్టీ గెలుపొందితే ఓ బిసిని ముఖ్యమంత్రిగా చేస్తామని బిజెపి అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సూర్యాపేటలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో మాట్లాడుతూ ప్రకటించడం ద్వారా తెలంగాణ ఎన్నికల చర్చను ఆ అంశంపై మరల్చేందుకు ప్రయత్నం చేశారు.

New Update
Telangana Elections 2023: ఓబీసీల విషయంలో గందరగోళంలో బీజేపీ!

ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలంగాణాలో తామే అధికారంలోకి వస్తామని చెప్పుకుంటూ వస్తున్న బిజెపి ఇప్పుడు ఓ విధంగా ఆత్మరక్షణలో పడింది. పోటీ ప్రధానంగా బిఆర్ఎస్ - కాంగ్రెస్ ల మధ్య నెలకొందనే అభిప్రాయం కలుగుతుంది. కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో అకస్మాత్తుగా బిజెపి గ్రాఫ్ పడిపోయిందని అభిప్రాయం బలపడుతుంది. అందుకనే, తామింకా పోటీలో ఉన్నామని సంకేతం ఇవ్వడం కోసమే అమిత్ షా ఇటువంటి ప్రకటన చేశారనే అభిప్రాయం కలుగుతుంది.

పైగా, ఇటీవల సంస్థాగతంగా చేసిన మార్పులలో బిసి వర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నామనే ప్రచారంకు దారితీయడంతో ఆ వర్గాలను ప్రసన్నం చేసుకొనేందుకు సహితం అమిత్ షా `బిసి ముఖ్యమంత్రి' అనే ప్రయత్నం చేశారు. ఇటీవల ఎన్నికలు జరిగిన కర్ణాటకలోనూ ముఖ్యమంత్రి ఎవ్వరో ప్రకటించలేదు.

కానీ తెలంగాణాలో మాత్రం ప్రకటించడం ఎన్నికల అవసరాలకోసమే అని స్పష్టం అవుతుంది. అదే కర్ణాటకలో ముఖ్యమంత్రి వ్యక్తిపేరు ప్రకటించక పోయినా `లింగాయత్ ల నుండే మా ముఖ్యమంత్రి' అని ప్రకటించినా మరింతగా మెరుగైన ఫలితాలు బిజెపికి వచ్చి ఉండెడివి. కర్ణాటకలో జరిగిన ఎదురు దెబ్బల కారణంగా తెలంగాణాలో మాత్రం జాగ్రత్తపడే ప్రయత్నం చేస్తున్నట్లుంది.

ముఖ్యమంత్రి పదవికి బిజెపి కీలక పోటీదారునిగా ఉన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, చ‌త్తీస్‌ఘ‌ఢ్ లలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. పైగా, ముఖ్యమంత్రిగా ఉన్న శివరాజ్ సింగ్ చౌహన్ కు మధ్యప్రదేశ్ లో, పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా ఉండి, విశేషమైన ప్రజాదరణగల ఏకైక బిజెపి నాయకురాలిగా ఉన్న వసుంధరరాజేకు రాజస్థాన్ లో మొదటి జాబితాలో అసెంబ్లీ సీట్లు కూడా ప్రకటించలేదు.

వీరిద్దరితో పాటు, చ‌త్తీస్‌ఘ‌ఢ్‌లో 15 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్ ను పక్కన పెట్టి, కేవలం ప్రధాని మోదీ ఇమేజ్ తో ఈ మూడు రాస్త్రాలలో గెలుపొంది ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలనీ, కొత్తవారిని ముఖ్యమంత్రులుగా చేయాలనీ బిజెపి ఎత్తుగడగా స్పష్టం అవుతుంది. కానీ, రెండంకెల సీట్లు తెచ్చుకొంటుందా అనే అనుమానాలు ఎదురవుతున్న తెలంగాణాలో బిసిని ముఖ్యమంత్రిగా ప్రకటించడం రాజకీయ ఎత్తుగడగా మాత్రమే వెల్లడి అవుతుంది.

దేశానికి తొలి `బిసి ప్రధాన మంత్రి'ని ఇచ్చిన పార్టీగా, కేంద్ర మంత్రివర్గంలో అత్యధిక సంఖ్యలో బిసిలకు మంత్రి పదవులు ఇచ్చిన పార్టీగా ప్రచారం చేసుకొంటూ దేశంలో, ముఖ్యంగా హిందీ రాష్ట్రాల్లో ఓబిసి వర్గాలలో కొంతమేరకు బిజెపి చొచ్చుకు పోయింది. ఆయా వర్గాలలో బలమైన నేతలను ప్రోత్సహించబట్టే హిందీ రాష్ట్రాలలో ఇప్పటికి తిరుగులేని పార్టీగా కొనసాగ గలుగుతున్నది.

అయితే, బిసి కులగణన అంశానికి వచ్చేసరికి బిజెపి ఇరకాటంలో పడుతున్నది. ఈ విషయంలో బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం బిసి కులగణన చేపడితే హైకోర్టుకు వెళ్లి బిజెపి ఆపగలిగింది. అయితే, సుప్రీంకోర్టుకు వెళ్లి సానుకూలంగా తీర్ప్యూ పొంది, కులగణనను పూర్తి చేసి, నివేదికను కూడా అసెంబ్లీ ముందు నితీష్ కుమార్ పెట్టేసరికి బిజెపి తట్టుకోలేక పోతుంది.

సమాజాన్ని కులాలవారీగా విభజించే కుట్ర ప్రతిపక్షాలు చేస్తున్నాయని స్వయంగా ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. `కులగణన' చేబడితే ఇప్పటివరకు బిజెపి విజయాలలో కీలక భూమిక వహిస్తున్న `హిందుత్వ' అంశం తెరమరుగవుతుందని బీజేపీ ఆందోళన చెందుతుంది. కానీ, తెలంగాణాలో మాత్రం `బిసి ముఖ్యమంత్రి' అని ప్రకటించడం గమనిస్తే ఈ విషయమై ఆ పార్టీలో నెలకొన్న అస్పష్టతను వ్యక్తం చేస్తుంది.

అదేవిధంగా ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లులో కూడా బిసిలకు ప్రత్యేక కొటా ఇవ్వాలనే డిమాండ్ చాలాకాలంగా వస్తున్నా బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఈ అంశంపైనే ఈ బిల్లు చట్టరూపం ధరించడానికి సుమారు మూడు దశాబ్దాలపాటు ఆగాల్సి వచ్చింది. ఓబిసి వర్గాలకు రాజకీయ సాధికారికత కల్పించకుండా ఆర్థిక పరమైన సంక్షేమ పధకాల ద్వారా వారిని సంతృప్తి పరచే ప్రయత్నాలు పరిమితమైన ప్రయోజనాలను మాత్రమే సాధించగలవు.

ఓబిసి వర్గీకరణ విషయమై జస్టిస్ రోహిణి కమిషన్ సమర్పించిన నివేదికను కూడా మోదీ ప్రభుత్వం బహిరంగపరచలేదు. ఈ విషయమై స్పష్టమైన అభిప్రాయం చెప్పే సాహసం చేయడం లేదు. నితీష్ కుమార్ బిసి కులగణన తర్వాత దేశంలో నూతన రాజకీయ వరవడి శ్రీకారం చుట్టారు. దానితో ఇప్పుడు కాంగ్రెస్ సహితం అసెంబ్లీ ఎన్నికలలో తాము అధికారంలోకి రాగానే బిసి కులగణన చేబడతామని ఎన్నికల ప్రణాళికలలో ప్రకటిస్తూ వస్తున్నది.

అధికారంలోకి వచ్చిన గంటలోగా ఆ మేరకు ఉత్తరువులు జారీ చేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ దిశలో ఎందుకని ప్రయత్నాలు జరగలేదనే విషయమై కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తున్నారు. రాజకీయ అవసరాలకోసం, ఒబిసిలను ఆకట్టుకునేందుకు ఇటువంటి నినాదాలు ఇస్తున్నారు తప్పా ఒబిసిల రాజకీయ సాధికారికత పట్ల ఈ పార్టీలకు ఏమేరకు చిత్తశుద్ధి ఉందొ ప్రశ్నార్ధకమే కాగలదు.

కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఒబిసిలను చేర్చుకున్న ప్రధాని మోదీ ఈ వర్గాలకు చెందిన వారికి కీలకమైన - హోమ్, ఆర్థిక, రక్షణ, విదేశాంగ, విద్య, వాణిజ్యం వంటి శాఖలలో ఒక్క మంత్రిత్వశాఖనైనా కేటాయించక పోవడం గమనార్హం. `తొలి ఓబిసి ప్రధాని'గా చెప్పుకుంటున్న మోదీ కార్యాలయంలో ఏ సామజిక వర్గానికి చెందినవారు పెత్తనం చేస్తున్నారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్, కాంగ్రెస్ బిసి వర్గాలకు చెప్పుకోదగిన సీట్లు ఇవ్వలేదని విమర్శలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ లో కనీసం 35 సీట్లు ఇవ్వాలని బిసి నేతలు ఒత్తిడి తెచ్చినా ఫలితం లేకపోయింది. తమ గోడు చెప్పుకొనేందుకు ఢిల్లీకి వెడితే అగ్రనాయకులు కనీసం ఇంటర్వ్యూ కూడా ఇవ్వకుండా అవమానకరంగా వ్యవహరించారు. దానితో మాజీ టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అవమానభారంతో పార్టీకి రాజీనామా చేశారు.

ఈ నేపథ్యంలో రిజర్వేడ్ కానీ సీట్లలో సగంకు పైగా బిసిలకు ఇస్తున్నామని బిజెపి ప్రకటించింది. అయితే, పార్టీ అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా కృషి చేస్తున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కూడా ఆ విధంగా సీట్లు ఇస్తున్నారా? పార్టీ సీనియర్ నాయకులు అందరూ ఎన్నికలలో పోటీ చేయాలనీ కేంద్ర నాయకత్వం ఆదేశించినా గెలిచే అవకాశం లేదనే భయంతో సీనియర్ నాయకులు పోటీకి మొఖం చాటేస్తున్నారు. అయితే, బిసిలకోసం తాము తమ సీట్లు త్యాగం చేస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే, తెలంగాణాలో `బిసి ముఖ్యమంత్రి' నినాదం మొదటగా బిజెపి ఇవ్వలేదని గుర్తించాలి. 2014 ఎన్నికలలో మొదటిసారిగా తెలుగు దేశం ఇచ్చింది. ప్రముఖ బిసి నేత ఆర్ కృష్ణయ్యను పార్టీలో చేర్చుకొని, ఎల్ బి నగర్ సీటు ఇచ్చి, ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటించింది. ఆయన గెలవడంతో పాటు మిత్రపక్షం బిజెపితో కలిసి టిడిపి 20 సీట్లను గెల్చుకుంది. అధికారంలోకి వస్తామనుకున్న కాంగ్రెస్ కన్నా కేవలం 1 సీటు మాత్రమే తక్కువ.

అయితే, ఆ తర్వాత వివిధ రాజకీయ కారణాలతో తెలంగాణ నుండి టిడిపి తెరమరుగైంది. `టిడిపికి బిసిలతో ప్రాణం పోస్తాను' అంటూ చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ఈ సారి పోటీ చేయబోవడం లేదని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పేసరికి అలిగి పార్టీకి దూరమయ్యారు. అంటే, మరోసారి బిసి ముఖ్యమంత్రి నినాదంతో టిడిపి ఎన్నికలకు వెళ్లడం ఆగిపోయింది.

కేవలం నినాదాలు ఇవ్వడం కాకుండా, గెలిచే అవకాశాలు లేని సీట్లు ఇవ్వడం కాకుండా వ్యవహారాలలో నిర్ణయాత్మక పాత్ర బిసిలకు కలిపించినప్పుడే వారు తమ ప్రతిభను చూపి, సామజిక మార్పుకు దోహదపడగలరు. బిసిల సాధికారికత పట్ల అటువంటి స్పష్టమైన విధానాలు, నిజాయితీ ప్రధాన రాజకీయ పార్టీలలో కనిపించడం లేదు. ముఖ్యంగా బిజెపి, కాంగ్రెస్ ఈ విషయమై ఆత్మపరిశీలన చేసుకోవలసి ఉంది.

ఇక ప్రాంతీయ పార్టీలు చాలావరకు `కుటుంభం పార్టీలు'గా మారిపోయాయి. వాటిల్లో అదే కుటుంభంకు చెందిన సామజిక వర్గంకు చెందిన నాయకులకు సహితం నిర్ణయాత్మక పాత్ర ఉంటుందని చెప్పలేము. చివరకు ఓబీసీలు నేతృత్వం వహించినా వారికి నిర్ణయాధికారం ఏమేరకు ఉంటుంది అనేడిది ప్రశ్నార్ధకమే. నిజంగా తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వచ్చి, ఓ బిసి నేత ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినా పరిస్థితులలో మార్పు తీసుకు రాగలరా?

ముఖ్యంగా జాతీయ పార్టీలలో ముఖ్యమంత్రులు స్వతంత్రంగా వ్యవహరింపగలరా? కర్ణాటకలో విశేషమైన ప్రజాదరణ గల బిఎస్ యడ్యూరప్ప వంటి నేత సహితం ఢిల్లీ చుట్టూ అనేక సార్లు ప్రదక్షిణలు చేసినా తన మంత్రివర్గాన్ని తన పదవీకాలంలో పూర్తిగా విస్తరింప చేసుకోలేకపోయారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సుమారు నెల రోజుల పాటు మంత్రివర్గం లేకుండానే పాలన సాగించారు.

ఆంధ్ర ప్రదేశ్ లో అణగారిన వర్గాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పదవులతో పాటు కీలక మంత్రిపదవులు ఇచ్చారు. అయితే వారెవరైనా స్వతంత్రంగా వ్యవహరింపగలుగుతున్నారా? కనీసం తమ శాఖలలో అధికారులైనా వారి మాటలు వింటారా?

-చలసాని నరేంద్ర

Also Read: వచ్చే ఎన్నికల్లో `మోదీ గ్యారంటీలు’ అక్కరకు వస్తాయా?

Watch This:

Advertisment
Advertisment
తాజా కథనాలు