KKR vs LSG : ఐపీఎల్‌లో హైడ్రామా: సూపర్ ఓవర్‌లో లక్నోను చిత్తు చేసిన కోల్‌కతా!

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం జరిగిన లో-స్కోరింగ్ థ్రిల్లర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్య జరిగిన ఈ పోరు ఊహించని మలుపులతో అభిమానులను ఉర్రూతలూగించింది.

New Update
lsg

ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం జరిగిన లో-స్కోరింగ్ థ్రిల్లర్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. పట్టికలో అట్టడుగున ఉన్న రెండు జట్ల మధ్య జరిగిన ఈ పోరు ఊహించని మలుపులతో అభిమానులను ఉర్రూతలూగించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగి 'టై'గా ముగిసిన ఈ మ్యాచ్‌లో, సూపర్ ఓవర్ ద్వారా కేకేఆర్ విజేతగా నిలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఒక దశలో 15 ఓవర్లకు 93 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ (51 బంతుల్లో 83 నాటౌట్) అసాధారణ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. చివరి ఓవర్‌లో వరుసగా నాలుగు సిక్సర్లు బాదిన రింకూ, జట్టు స్కోరును 155/7 కు చేర్చాడు. కేకేఆర్ బ్యాటర్లలో రింకూ తర్వాత కెమెరాన్ గ్రీన్ (34) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నాడు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్ (5/23) కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్లు తీసి కేకేఆర్ వెన్ను విరిచాడు.

156 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ సైతం బ్యాటింగ్ వైఫల్యంతో తడబడింది. రిషబ్ పంత్ (42) పోరాడినా, మిగిలిన వారు నిరాశపరచడంతో లక్నో వరుసగా ఐదో ఓటమి దిశగా సాగింది. అయితే, చివరి ఓవర్‌లో కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. త్యాగి ధారాళంగా 16 పరుగులు ఇవ్వగా, 9వ నంబర్ బ్యాటర్ మొహమ్మద్ షమీ చివరి బంతికి సిక్సర్ బాదడంతో స్కోర్లు సమమై మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

సునీల్ నరైన్ మ్యాజిక్

సూపర్ ఓవర్‌లో కోల్‌కతా స్పిన్నర్ సునీల్ నరైన్ అద్భుతం చేశాడు. అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసిన నరైన్, కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో లక్నో కేవలం 2 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రింకూ సింగ్, ప్రిన్స్ యాదవ్ వేసిన మొదటి బంతికే ఫోర్ కొట్టి కేకేఆర్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

ఈ ఏడాది IPLలో KKRకు ఇది రెండో విజయం.  5 పాయింట్లతో ఆ జట్టు ఇప్పుడు పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. మరోవైపు, LSG పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పడిపోయింది. మరోవైపు ఆదివారం మధ్యాహ్నం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ కు  ఇది నాలుగో విజయం. దీంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరగా, సీఎస్‌కే ఆరో స్థానానికి పడిపోయింది. 

ఎనిమిది మ్యాచ్‌లలో మొత్తం 380 పరుగులు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ, ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసులో అగ్రస్థానంలో ఉండగా , అతని తర్వాతి స్థానాల్లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో సూర్యవంశీ, రాహుల్ ఇద్దరూ చెరో 357 పరుగులు చేశారు.

Advertisment
తాజా కథనాలు