Paralympics 2024: మనవాళ్ల రికార్డ్ అద్భుతం అంతే..ముగిసిన పారాలింపిక్స్ సాధారణ ఒలింపిక్స్‌లో మూటగట్టకుని వచ్చిన వైఫల్యాలను తుడిచేస్తూ పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఇరగదీశారు. ఎన్నడూ లేనంతగా 29 పతకాలు సాధించి రికార్డ్ సృష్టించారు. దివ్యాంగులైన క్రీడాకారులు అధ్బుతాలు చేసిన ఈ పారాలింపిక్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. By Vishnu Nagula 10 Sep 2024 in స్పోర్ట్స్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Paralympics 2024: పదిరోజు క్రీడా సంబరానికి తెరపడింది. ఇందులో కనీవినీ ఎరుగని రీతిలో భారత క్రీడాకారులు సత్తా చాటారు. 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు కలిపి 29 పతకాలతో రికార్డులను చితకొట్టారు. ఇంకా కొన్ని లాస్ట్ మినిట్‌లో తప్పిపోయాయి కానీ..అవి కూడా వచ్చి ఉంటే ఓ లెక్కలో ఉండేది. పైగా ఇలా పతకాల వేటతో అదరగొట్టడం రెండవసారి కూడా. మొత్తం 549 పతకాలకు జిగిన పారాలింపిక్స్ పోటీల్లో 23 క్రీడాంశాలకు గాను 12 ఆట్లలోనే పాల్గొన్న మన భారత క్రీడాకారుల బృందం ఈసారి పతకాల పట్టికలో టాప్ 20లో నిలిచారు. ఇదొక పెద్ద అచీవ్ మెంట్. అంతకు ముందు మూడేళ్ళ క్రితం జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో కూడా మనం 19 పతకాలు గెలిచి చరిత్ర సృష్టించాం. ఇప్పుడు దానికంటే మరో 10 పతకాలు ఎక్కవు సాధించి అదరహో అనిపించాం. ఈసారి ఒలింపిక్స్‌లో అన్నీ సంచలనాలే. భారత్ తరఫున పతకాలు సాధించినవారిలో ఈసారి 10 మంది మహిళలే ఉండడం గమనార్హం. అందులో కూడా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్‌లో స్వర్ణంతో ఇప్పటికి 2 పారాలింపిక్ స్వర్ణాలు గెలిచిన అవని కాకుండా మిగతా తొమ్మిది మందీ సరికొత్త విజేతలే అవడం ఇంకా పెద్ద సంచలనం. మన మహిళా అథ్లెట్లకు పారాలింపిక్స్‌లో ఇది అసాధారణ విజయం. ఎవరికి వారు ఎన్నో సవాళ్ళను అధిగమిస్తూ, అంచనాల ఒత్తిడిని తట్టుకొని ఈ ఘనత సాధించారు. ప్రతి ఒక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ. ముఖ్యంగా తెలుగు బిడ్డ దీప్తి జీవాంజి లాంటివారు అయితే తమ భూమిని అమ్ముకుని మరీ ఆటల్లో నిబడ్డారు. దీప్తి తాజా పారాలింపిక్స్‌లోనూ పతకం సాధించడమే కాక, తనను వదిలేయకుండా ఇంత పైకి తీసుకొచ్చిన కన్నవారి కోసం అదే స్థలాన్ని తిరిగి కొని బహూకరించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే మానవీయ గాథ. తెలుసుకోవాలే కానీ ఇలాంటిఇ ఇంకా చాలా ఉన్నాయి. పేరున్న క్రీడా తారలైన జావలిన్ త్రోయర్ సుమిత్ ఆంటిల్, హైజంపర్ మారియప్పన్ తంగవేలు లాంటి వారే కాక అంతగా ప్రసిద్ధులు కాని అథ్లెట్లు సైతం ఈసారి పతకాల విజేతలుగా నిలవడం విశేషం. ఈసాఇ పారాలింపిక్స్ మీద ప్రభుత్వం కూడా బాగానే దృష్ట పెట్టింది. టోక్యోలో సాధించిన వాటిని పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టింది. టోక్యో గేమ్స్‌కు రూ. 26 కోట్లు, 45 మంది కోచ్‌లతో సన్నాహాలు సాగించిన ప్రభుత్వం ఈసారి రూ. 74 కోట్లు ఖర్చు చేసి, 77 మంది కోచ్‌లతో తీర్చిదిద్దడంతో మంచి ఫలితాలొచ్చాయి. ఈ క్రీడా సమరంలో మన దేశం నుంచి ఎన్నడూ లేనంతగా ఈసారి 84 మంది పాల్గొన్నారు. దివ్యాంగులకు అసలు మామూలు సౌకర్యాలే పెద్దగా ఉండని మనలాంటి దేశాల్లో వాటిని అధిగమించి క్రీడాకారులు ఈస్థాయికి చేరుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయం. ప్రభుత్వం, క్రీడాశాఖల ప్రోత్సాహం ఇలానే ఉంటే భవిష్యత్తులో మరిన్ని పతకాలు రాడం ఖాయం. దాంతో పాటూ పారాలింపిక్స్ కూడా ప్రపంచంలో క్రేజ్ పెరిగింది. ఇంతకు ముందు వీటిని చూసేందుకు జనం పెద్దగా వచ్చేవారు కాదు. కానీ ఈసారి ఈ దివ్యాంగుల అద్భుతాలు చూసేందుకు జనం విరగబడ్డారు. ఈ ప్రపంచ పోటీలకు దాదాపు 20 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయని నిర్వాహకులు చెప్పారు. ఇది నిజంగా ఒక మంచి శుభపరిణామం అని వారు అంటున్నారు. ఇలానే ఉంటే క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని చెబుతున్నారు. #paralympics-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి