ఆరోసారి విశ్వవిజేతగా భారత్.. భారీ నజరానా కురిపించిన BCCI!

అద్భుత ప్రదర్శనతో అజేయంగా నిలిచిన యువ భారత్‌కు రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ప్రకటించారు. ఫిబ్రవరి 6న జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 

New Update
bcci

హరారే వేదికగా జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి ఆరోసారి ట్రోఫీని ముద్దాడిన భారత జట్టుపై బీసీసీఐ ప్రశంసల జల్లు కురిపించింది. అద్భుత ప్రదర్శనతో అజేయంగా నిలిచిన యువ భారత్‌కు రూ. 7.5 కోట్ల నగదు బహుమతిని బీసీసీఐ సెక్రటరీ దేవాజిత్ సైకియా ప్రకటించారు. ఫిబ్రవరి 6న జరిగిన ఈ హై-వోల్టేజ్ ఫైనల్‌లో భారత్ 100 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 

టీమిండియా ఓపెనర్ వైభవ్ సూరియవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 55 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి, అండర్-19 చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 175 పరుగులు చేసి భారత్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ ఆయుష్ మ్హత్రే సారథ్యంలో భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

311 పరుగులకే కుప్పకూలింది

412 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. కాలేబ్ ఫాల్కనర్ సెంచరీతో పోరాడినప్పటికీ 311 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్‌ను ఒత్తిడిలోకి నెట్టారు. యువ జట్టు ప్రదర్శనపై బీసీసీఐ సెక్రటరీ స్పందిస్తూ.. "పెద్ద వేదికపై ఒత్తిడిని అధిగమించి మన కుర్రాళ్లు ఆడిన తీరు గర్వకారణం. ఈ విజయం భారత క్రికెట్ భవిష్యత్తు ఎంత భద్రంగా ఉందో చాటిచెబుతోంది" అని కొనియాడారు.

  రూ. 7.5 కోట్ల బహుమతిని జట్టు సభ్యులకు, సపోర్ట్ స్టాఫ్ మరియు కోచింగ్ బృందానికి పంపిణీ చేయనున్నారు. కాగా అండర్-19 ప్రపంచకప్ చరిత్రలో అత్యధికంగా ఆరుసార్లు విజేతగా నిలిచిన ఏకైక జట్టుగా భారత్ తన రికార్డును మరింత సుస్థిరం చేసుకుంది. ఈ టోర్నీలో ఆడిన ఏ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా భారత్ ఛాంపియన్‌గా నిలవడం విశేషం.

Advertisment
తాజా కథనాలు