Producers with Pavan Kalyan: పవన్ కళ్యాణ్ తో అప్పుడలా.. ఇప్పుడిలా.. తెలుగు సినీ నిర్మాతల తీరే వేరు!

పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఒకప్పుడు సినీ హీరో. ఏపీలో టికెట్ రేట్ల విషయంలో పవన్ మాటలకు సినీ ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ రాలేదు. ఇప్పుడు అధికారంలోకి పవన్ వచ్చిన వెంటనే సినీ నిర్మాతలు ఆయన వద్దకు క్యూ కట్టారు. అలా ఎందుకు? పూర్తి వివరాలు ఆర్టికల్ లో తెలుసుకోండి 

New Update
Producers with Pavan Kalyan: పవన్ కళ్యాణ్ తో అప్పుడలా.. ఇప్పుడిలా.. తెలుగు సినీ నిర్మాతల తీరే వేరు!

Producers with Pavan Kalyan:  అది 2021.. సెప్టెంబర్ 25.. సాయి ధరమ్ తేజ్ సినిమా రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్.. అంతా కోలాహలంగా ఉంది. అక్కడికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కదా.. రిపబ్లిక్ సినిమా గురించి.. సాయి ధరమ్ తేజ్ గురించి నాలుగు మాటలు చెబుతారని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే.. ఆయన మాట్లాడటం ప్రారంభించగానే అందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఫక్తు రాజకీయ ప్రసంగం చేశారు పవన్. కానీ, అది సినిమాలకు సంబంధించిన విషయమే కావడంతో అందరూ లైట్ తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వ మంత్రులను పనికిరానివారు, ఇడియట్స్ అంటూ చెబుతూ ఆయన తనను టార్గెట్ చేసుకుని.. తెలుగు సినిమా ఇండస్ట్రీని ఇబ్బందుల పాలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం అని అన్నారు పవన్. టికెట్ రేట్ల తగ్గింపు అందులో భాగమేనని చెప్పిన ఆయన.. కావాలంటే నేరుగా తనతో తలపడమని.. టార్గెట్ చేస్తే తన సినిమాలను టార్గెట్ చేయమనీ.. చెప్పారు. "మీరు సినిమాలను నిషేధించాలనుకుంటే, నా చిత్రాలను నిషేధించండి..  ఇతరుల చిత్రాలను ఎందుకు ఆపుతున్నారు?" అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అభిమానుల కారతాళధ్వనుల మధ్య ఏపీ ప్రభుత్వం తీసుకున్న సినిమా టికెట్ రేట్ల తగ్గింపు నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 

Producers with Pavan Kalyan:  పవన్ కళ్యాణ్ అప్పుడు మాట్లాడిన మాటలు తన గురించి కాదు. సినిమా ఇండస్ట్రీకి ఎదురైన ఇబ్బందుల గురించి. నిర్మాతల పరిస్థితి గురించి. సినిమా టికెట్ల రేట్లను ఏపీలో తగ్గించడంతో నిర్మాతలు నష్టపోతారని బాధతో వారి తరఫున మాట్లాడిన మాటలవి. కానీ, సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ ఒక్కరూ కూడా ఈ మాటలపై స్పందించలేదు. పవన్ కళ్యాణ్ ను ఎవరూ సమర్ధించలేదు. ఆయా వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నట్టుగా ఒక్కరో ఇద్దరో తప్ప అందరు నిర్మాతలు సైలెంట్ గా ఉండిపోయారు. రెండురోజులు పవన్ కళ్యాణ్ మాటలపై ఏపీలో మంత్రులు పవన్ కళ్యాణ్ ను బూతులతో ఏకిపారేశారు. ఎవరెన్ని మాటలు అన్నా.. ఆరోజు సినీ నిర్మాతలు ఎవరూ కూడా పవన్ పక్కన నిలబడలేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. 

కట్ చేస్తే..
ఇది జూన్ 24.. ఏపీ సెక్రటేరియట్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్.. తెలుగు సినిమా అగ్ర నిర్మాతలు అంతా పవన్ కళ్యాణ్ ముందు కూచుని ఉన్నారు. మీకు సన్మానం చేస్తాం.. ముఖ్యమంత్రికి అభినందన సభ పెడతాం అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ ని పొగిడేశారు. సీఎం చంద్రబాబు అంతటి వారు లేరు అనేశారు. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి మేలు చేయాలని.. చేస్తారని.. ఆశిస్తున్నామంటూ చెప్పారు. మీటింగ్ అయిపోయిన తరువాత ప్రెస్ మీట్ లో కూడా పవన్ ను పొగిడారు. డిప్యూటీ సీఎంగా తమకు.. ఇండస్ట్రీకి సహకరిస్తారని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. 

ఎందుకిలా?
Producers with Pavan Kalyan:  అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఇండస్ట్రీ గురించే. మంత్రులతో మాటలు పడింది తెలుగు సినిమా నిర్మాతల కోసమే. కానీ, ఏ ఒక్కరూ కూడా ఆయనకు అండగా నిలబడలేదు సరికదా.. కనీసం పవన్ కరెక్ట్ చెప్పారు అని కూడా అనలేదు (హీరో నాని మాత్రం బహిరంగంగా పవన్ కళ్యాణ్ మాటలకు మద్దతు ఇచ్చారు) ఇప్పుడు పవన్ అధికారంలోకి రాగానే ఆహా.. ఓహో అంటూ వెంటపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలకు ముందు, నిర్మాతలు దిల్ రాజు, సి కళ్యాణ్, జి ఆది శేషగిరిరావు సెప్టెంబర్ 20న మంత్రి పేర్ని నానితో సమావేశమై పోసినిమా టికెట్ల అమ్మకాలను ప్రభుత్వమే చేస్తుందని.. దానికోసం ఒక పోర్టల్ ఏర్పాటు చేస్తుందనీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. 

అసలు గొడవ ఏమిటి?
2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక ‘బెనిఫిట్‌’ షోలను రద్దు చేసింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లలో పెద్ద హీరోల సినిమాల హంగామాను క్యాష్ చేసుకునేందుకు మొదటి కొన్ని రోజులు టిక్కెట్టు రేట్లు పెంచడం ఆనవాయితీ. టిక్కెట్లు రూ. 1,000 వరకు అమ్ముడవుతాయి. అయితే, ఏపీ సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని ఉటంకిస్తూ, ఉదయం 11 గంటల నుండి రోజుకు నాలుగు షోలను మాత్రమే వేసుకోవాలని.. ఎక్కువ షోలను అనుమతించే విధానాన్ని ప్రభుత్వం నిషేధించింది.

Producers with Pavan Kalyan:  ఇంకా, ఈ ఏడాది ఏప్రిల్ 8న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టిక్కెట్ రేట్లపై పరిమితిని నిర్ణయిస్తూ ప్రభుత్వ ఉత్తర్వు (GO)ను ప్రవేశపెట్టింది. స్థానికత, అందించిన సౌకర్యాల ఆధారంగా రేట్లు నిర్ణయించారు. మల్టీప్లెక్స్‌లో ప్రీమియం టిక్కెట్‌కు గరిష్ట ధర రూ.250గా డిసైడ్ చేశారు. ఛార్జీలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి, అయితే గ్రామ పంచాయతీలో ఎకానమీ సీటుకు కనీస ధర రూ.50గా నిర్ణయించారు. దీంతో పాటు టికెట్ల అమ్మకాలు ప్రభుత్వ కనుసన్నల్లోనే జరగాలనే నిబంధన తీసుకువచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ ఒక్కరే గట్టిగా మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో ఎవరూ మాట్లాడలేదు. 

అంతా బిజినెస్..
మొత్తంగా ఈ ఎపిసోడ్స్ చూస్తే.. సినిమా రంగంలో బిజినెస్ తప్ప.. అనుభూతులు.. పద్ధతి ఉండవని క్లియర్ గా అర్ధం అవుతుంది. కేవలం ఎవరికీ వారు తమ ఉనికిని కాపాడుకోవడానికో.. తమ వ్యాపారాలను రక్షించుకోవడానికో వ్యవహారాలు సాగిస్తారు తప్ప.. ఎట్టి పరిస్థితిలోనూ ఇండస్ట్రీ బాగోగులను సీరియస్ గా తీసుకోరనే విషయం స్పష్టం అవుతోంది. వ్యాపార కోణంలోనే అప్పటి ప్రభుత్వం ఏమన్నా.. ఏమి చేసినా భరించారు.. ఇప్పుడు అదే వ్యాపార కోణంలోనే పవన్ కళ్యాణ్ ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. విధి ఎంత విచిత్రమైనది అంటే, పవన్ పోటీ చేసినపుడు ఇండస్ట్రీలో ఎవరూ కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు ఆయన ఉపముఖ్యమంత్రి హోదాలో ఉంటే.. ప్రత్యేక విమానాలు.. కారులు వేసుకుని హైదరాబాద్ నుంచి ఆఘమేఘాల మీద సినీ అగ్ర నిర్మాతలందరినీ ఆయన ఛాంబర్ ముందు కూచోపెట్టింది. ఏది ఏమైనా.. ఇప్పుడు బాల్ పవన్ కోర్టులో ఉంది. ఇకపై ఏపీలో సినిమా రాజకీయాలన్నీ ఆయన చుట్టూనే తిరుగుతాయి అనడంలో డౌట్ లేదు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు