/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ap-pic.png)
ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతోపాటు మరోవైపు తెలంగాణలో నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో మున్నేరు వాగు (Munneru brook) పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఎన్టీఆర్ జిల్లా ( ntr District) నందిగామ పరిధిలోని అనేక ప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. కీసర వద్ద మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగు సమీప ప్రాంత గ్రామాలు పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి. మరోవైపు అనుకోకుండా వచ్చిన వరదలకు భారీ స్థాయిలో పంటనష్టం వాటిల్లింది. పంటపొలాలను వరదలు ముంచెత్తడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోండటంతో ఏపీలోకి వరద పోటెత్తుతోంది. భారీ వరదలతో ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ (Nandigama) మండల పరిధిలోని అంబారుపేట, ఐతవరం, ఎటిపట్టు, కీసర గ్రామాల్లో పంటపొలాలు పూర్తిగా నీటమునిగాయి. అనుకోకుండా వచ్చిన వరదలు తమకు తీవ్ర స్థాయిలో పంట నష్టాన్ని కలిగించినట్లు రైతులు వాపోయారు.
మరోవైపు వరదనీరు గ్రామాల్లోకి వస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద వస్తోందిని కానీ ముంపు ప్రాంత గ్రామస్థులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కానీ అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని తెలిపారు. అధికారులు ముందస్తు సమాచారం ఇస్తే తాము సురక్షిత ప్రాంతాలకు వెళ్లేవారిమని వెల్లడించారు.
తమ ఇళ్లల్లోకి వరద నీరు వచ్చిందని, తమకు సహాయం చేసేవారు కూడా లేరని, తమకు ఎటు వెళ్లాలో తెలియడం లేదని గ్రామస్తులు వాపోయారు. వరద నీరు గంట గంటకూ పెరుగుతుండటంతో భయాందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు.. ప్రభుత్వం స్పందించి తమను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలని కోరారు.
కీసర మున్నేరు వాగు(Munneru brook) లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో మున్నేరు నుంచి కృష్ణా నది(Krishna river)లోకి 1.52 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు భారత వాతావరణ విభాగం(imd) తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ(imd) పేర్కొంది.