ప్రస్తుత ఉద్యోగ నియామకాలకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేమా?

పాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ప్రస్తుత నోటిఫికేషన్ లో వర్తింపు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు సామాజిక విశ్లేషకులు సంపతి రమేష్ మహారాజ్. మాదిగ ఉపకులాలు వీటిని కోల్పోతే ఒక తరం నష్టపోతుందని, ప్రభుత్వం సామాజిక న్యాయం చేయాలని కోరుతున్నారు. 

New Update
SC reservation classification should apply for current notifications says Sampathi Ramesh Maharaj telugu news

SC Classification: భారతదేశం అనాదిగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కూరుకుపోయినది. ఇందులో షెడ్యూల్ కులాలను అట్టడుగు స్థాయిలో ఉంచారు. వీరంతా వేల సంవత్సరాల నుంచి సామాజిక హక్కులు నిరాకరించబడి అస్పృశ్యత, అంటరానితనమనే వివక్షకు గురైనారు. ఈ కులాల ఉన్నతకై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాల్లో ప్రధానంగా మాదిగ, మాల, ఇతర ఉపకులాలున్నాయి. వీరిలో అత్యధికంగా ఉండి, వెనబడ్డ కులం మాదిగ, వీటిలోని ఉపకులాలే. మాదిగ కులాన్ని వివిధ రాష్ట్రాల్లో పలు రకాల పేర్లతో పిలుస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాలలతో పోలిస్తే మాదిగ జనాభా అధికం. కానీ వీరు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో వెనుకబడ్డారు. మెజార్టీ జనాభా గల మాదిగ కులానికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో తగిన వాటా దక్కకపోవడమే దీనికి కారణం. దీంతో మాల,మాదిగల మధ్య వైరుద్యం పెరిగింది. మంద కృష్ణ మాదిగ, ఇతర మాదిగ మేధావుల నేతృత్వంలో 1994న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఈ నేపథ్యంలో అనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1996 లో వర్గీకరణ అంశంపై జస్టిస్ పి.రామచంద్రమూర్తి కమిషన్ నియమించారు. ఈ కమిషన్ షెడ్యూల్ కులాల్ని వెనకబాటుతనం ఆధారంగా ఏ, బి, సి, డి లుగా వర్గీకరణ చేయాలనీ సిఫార్సు చేసింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను విద్యా, ఉద్యోగాల్లో వర్తింపచేయాలని సూచించింది. ఈ కమిషన్ నివేదిక మేరకు 2000 నుంచి ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు పరిచారు. ఇందులో బి-వర్గంలో ఉన్న మాదిగలకు 7 శాతం, సీ-వర్గంలో ఉన్న మాలలకు 6 శాతం, ఇతర ఉప కులాలకు మిగతా శాతాన్ని వర్తింపజేశారు. దీంతో కొంత వరకు మాదిగలకు విద్య, ఉద్యోగాల్లో లబ్ధి జరిగింది. 

ఇది కూడా చదవండి: తగ్గేదేలేదంటున్న కొండా సురేఖ.. వేములవాడలో మరో వివాదం!

ప్రస్తుత నోటిఫికేషన్లలో అమలు చేయలేమా?

ఎస్సీ కులాల్లో సామాజిక సమానత్వం కోసం అమలుపరిచిన ఉప వర్గీకరణను రాజ్యంగ విరుద్దమని మాల సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే E.V చెన్నయ్య VS యూనియన్ ఆఫ్ ఇండియా-2004 కేసు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 నుంచి అమల్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మాదిగ ఉప కులాలు నిరసన వ్యక్తం చేసి, వర్గీకరణ చట్టబద్ధతకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2007లో ఉషా మేహ్ర కమిషన్ ను నియమించినది. ఈ కమిషన్ కూడా రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని నొక్కి చెప్పింది. కానీ ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం కోసం ఇన్నాళ్లు దాటవేశారు. ఇటీవల సుప్రీం కోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ అండ్‌ అదర్స్‌ vs దేవీందర్‌సింగ్‌ కేసు విషయంలో E.V చెన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించి ఆగస్టు1, 2024న ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టాలు అమల్లో ఉన్నట్టే కదా. మన తెలుగు రాష్ట్రాలలో కూడా అమలైన 2000 నాటి ఎస్సీ వర్గీకరణ చట్టం కూడా అమల్లో ఉన్నట్టే. అలాంటప్పుడు ప్రస్తుత నోటిఫికేషన్ లో కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేయవచ్చు కదా. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీలో ప్రస్తుత నోటిఫికేషన్ల లో వర్గీకరణను అమలు చేస్తామన ప్రకటించారు.

ఇది కూడా చదవండి: సినీ పరిశ్రమతో భట్టి కీలక భేటీ.. అందుకు సిద్ధమంటూ సంచలన ప్రకటన!

ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం..

తొలి దశ తెలంగాణ ఉద్యమంలో స్థానికతపైన కోర్టులు విభిన్న తీర్పులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 1959 లోని ముల్కీ నిబంధనలకు రక్షణ కల్పించే సెక్షన్ 3ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1969 ఫిబ్రవరి 3న కొట్టివేసింది. అప్పుడు పాత చట్టమైన పెద్దమనుషుల ఒప్పందం-1956లోని సెక్షన్119 కింద ముల్కీ నిబంధనలకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3న చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అనగా కొత్త చట్టంలో స్థానికత తొలగించినప్పుడు పాత చట్టంలోని స్థానికత చెల్లుబాటువుతుందని 1972 నాటి కోర్టు తీర్పు సారాంశం. దీన్ని బట్టి ఎస్సీ వర్గీకరణపై 2000 నాటి పాత చట్టం అమలులో ఉన్నట్టే. ప్రస్తుత ఉద్యోగ నియామకాల్లో కూడా దీన్ని వర్తింపచేయవచ్చు కదా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని సూచించింది. ఈమేరకు ఇటీవల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఇదీ 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని గడుపు విధించారు. అనంతరమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేస్తామని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ఇప్పుడు జరిగే గ్రూప్-1, గ్రూప్ -2, ఇతర అత్యున్నత ఉద్యోగ నియామకాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. అయితే కమిషన్ అధ్యయనం తర్వాత వర్గీకరణ అమలైతే మాదిగలకు మరింత లాభం జరగవచ్చమో కానీ, ప్రస్తుత నోటిఫికేషన్ లో చాలా నష్టం జరగవచ్చు. కావున పాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ప్రస్తుత నోటిఫికేషన్ లో తక్షణం వర్తింపు చేయాలి. గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4, డిఎస్సీ, కానిస్టేబుల్ వంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు ఎన్నో ఏళ్ల తర్వాత వస్తుంటాయి. మాదిగ ఉపకులాలు వీటిని కోల్పోతే ఒక తరం నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ఎస్సీ వర్గీకరణ అమలు ద్వారా సామాజిక న్యాయం చేయాలి.

ఇది కూడా చదవండి: Bihar: లవర్‌ కోసం ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?

ఇది కూడా చదవండి: క్రైమ్ ప్రపంచానికి రారాజు.. లారెన్స్ బిష్ణోయ్ నేర ప్రస్థానమిదే!

సంపతి రమేష్ మహారాజ్
సామాజిక విశ్లేషకులు
7979579428.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

1981 Indravelli massacre : ఇంద్రవెల్లి ఘటన స్ఫూర్తితో....

ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 45 ఏళ్లు. ఏప్రిల్ 20,1981 నఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో రైతు కూలీ సంఘం' సమావేశం నిర్వహించింది. ఆ క్రమంలో జరిపిన కాల్పుల్లో పలువురు ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు

New Update
Indervelly

Indervelly

1981 Indravelli massacre : ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు 45 ఏళ్లు. ఇది ‘స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్’ కథగా చెప్పుకొంటారు. ఏప్రిల్ 20,1981వ సంవత్సరం ఆదిలాబాద్ ఆదివాసీలకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిన రోజు. ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని ఇంద్రవెల్లిలో ఓవైపు సంత జరుగుతోంది. ఈ సంతలో సరుకులు కొనడానికి జనం వస్తే ...మరోవైపు గిరిజన రైతు కూలీ సంఘం' సమావేశానికి జనం వస్తున్నారు. సభకు అనుమతి లేదని పోలీసులకు, ప్రజలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో జరిపిన కాల్పుల్లో 13 మంది ఆదివాసీలు ప్రాణాలు కోల్పోయారు(అధికారిక లెక్కల ప్రకారం). అనేక మంది గాయపడ్డారు. అయితే, ఆ సంఖ్య ఎంత అనేది స్పష్టంగా తెలియదు. స్థానిక ఆదివాసీలు ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకాలను కథలు కథలుగా వినిపిస్తారు. ఇంద్రవెల్లి పోలీస్ కాల్పుల ఘటనను యావద్దేశం ముక్త కంఠంతో ఖండించింది. కాల్పుల ఘటనతో కుగ్రామంగా ఉన్న ఇంద్రవెల్లి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రతిపక్షాలు, ప్రజాహక్కుల సంఘాలు, సాహితీలోకం 'స్వతంత్ర భారత జలియన్‌వాలా బాగ్' అంటూ నిరసించింది. 

కుమ్రం భీమ్ నుంచి ఇంద్రవెల్లి వరకు

కుమ్రం భీమ్ ఆధ్వర్యంలో ఆదివాసీలు సాగించిన 'జోడేన్ ఘాట్'ను నిజాం అణచివేశాడు. ఆ తర్వాత నిజాం ప్రభుత్వం కొన్ని సంస్కరణలు చేపట్టింది. ఆదివాసీల తిరుగుబాటు మూలాలపై మానవ పరిణామ శాస్త్రవేత్త 'హేమాన్ డార్ఫ్' అధ్యయనం చేసి ఆయన సూచనల మేరకు సుమారు లక్షన్నర ఎకరాల అటవీ పోడు భూములకు పట్టాలు పంపిణీ చేశారు. ఆదివాసీలను అక్షరాస్యులగా చేసేందుకు ప్రత్యేక స్కూళ్లు, వృత్తి శిక్షణ కేంద్రాలు తెరిచారు. గిరిజన తెగలు, ప్రాంతాలను నోటిఫైడ్ ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. కేస్లాపూర్ నాగోబా జాతర వేదికగా ఆదివాసీల సమస్యలు, ఆర్జీలను పరిష్కరించేందుకు 'దర్బార్'ను ప్రారంభించారు. బయటి ప్రాంత వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఈ చర్యలతో ఆదివాసీలకు కాస్త ఉపశమనం దొరికింది.

ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం అయ్యింది. ఆదివాసీ ప్రాంతాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ లో చేర్చారు. అనంతరం రాజ్యాంగబద్ధమైన చట్టాలను తెచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలకు రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్ ప్రాంతం) భూమి బదలాయింపు చట్టం -1959 తీసుకువచ్చారు. దీనికి 1970 సంవత్సరంలో మార్పులు చేశారు. దీన్నే 1/70 ( వన్ ఆఫ్ సెవంటీ) చట్టంగా పిలిచారు. ఈ రకంగా పకడ్బందీ చట్టాలు వచ్చినా... అందులోని లోపాలతో  పెద్ద విస్తీర్ణంలో ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. అంతేకాకుండా 1971 నాటికి గుడిహత్నూర్, ఆసిఫాబాద్, కరీంనగర్, నిర్మల్ ప్రాంతాలను కలుపుతూ రోడ్డు సౌకర్యం ఏర్పడి బయటి వ్యక్తుల రాకపోకలు పెరిగాయి. దీంతో ఈ ప్రాంతానికి వలసలు పెరిగాయి.

వడ్డీ వ్యాపారులు క్రమంగా ఆ ప్రాంతాల్లో బలపడ్డారు. ఆదివాసులుగా గుర్తించని బంజారా/లంబాడాల చేతుల్లోకి భూమి, అధికారాలు మారుతుండటంతో గోండ్ ఆదివాసీల ప్రాబల్యం రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. ఇలా జీవనాధారమైన భూములు, పుట్టిన ప్రాంతంలోనే తమ అస్తిత్వం అన్యాక్రాంతం కావడం ఇంద్రవెల్లి పోరాటానికి కారణమైంది . ఈ క్రమంలో 1983లో ఇంద్రవెల్లి కాల్పులు జరిగిన ప్రాంతంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలో భాగంగా అమరవీరుల స్థూపం నిర్మించారు. అక్కడి ప్రజలకు కొన్ని మౌలిక సదుపాయాలను కల్పించింది. ప్రతి ఏటా ఏప్రిల్ 20న పెద్ద ఎత్తున అక్కడి ఆదివాసుల ఏకమై స్మరించుకోవడం జరుగుతుంది. 

భూ పోరాటం కొనసాగింపు... లక్ష కిలోమీటర్ల రథయాత్ర

ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్లు గడిచిన...అక్కడి ప్రజల జీవితాలలో ఆశించిన పురోగతి లేదు. నాణ్యమైన విద్య, వైద్య సదుపాయాలు ఇంకా అందరికీ అందుబాటులో లేదు. ఉపాధి లేక కూలీలుగా జీవితాలను వెల్లదీస్తున్నారు. భౌతిక పురోగతే తప్ప, ప్రజల జీవన ప్రమాణాలలో మెరుగుదల అంతంత మాత్రమే. ఆదివాసీ తెగల అస్తిత్వ పోరు ఆగడం లేదు. ఆదివాసీల భూసమస్యలు చాలా వరకు అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. అదే సందర్భంలో ఆదివాసీలు, లంబాడ గిరిజనుల మధ్య ఘర్షణ వాతావరణం  కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ ల ఉప వర్గీకరణ సబబే అని తీర్పునివ్వడం జరిగింది. వీరిలో కూడా అంతర్గత అంతరాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

దీంతో జనాభా ప్రాతిపదికన వారికి విద్యా, ఉద్యోగాల్లో వారి రిజర్వేషన్ లలో ఉప వర్గీకరణను వర్తింపచేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఉప వర్గీకరణ చట్టం  తెచ్చాయి. ఎస్టీలలో కూడా ఉపవర్గీకరణ జరగాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే సమాన అవకాశాలు లభిస్తాయి. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన బీసీ, ఎస్సీ, ఎస్టీలలో మెజార్టీ ప్రజల చేతిలో భూమి లేదు. వారికి ఈ రాజ్యంలో వాటా లేదు. అన్ని రంగాల్లో వారు వెనుకబడ్డారు. అగ్రవర్ణ పెత్తందారుల ఆధిపత్యమే కొనసాగుతుంది.

 

ఈ నేపథ్యంలో ఇటీవల బీసీ,ఎస్సీ, ఎస్టీ హక్కులు, రాజ్యాధికార జేఏసీ మరియు ధర్మ సమాజ పార్టీ ఆధ్వర్యంలో "మాభూమి" పేరుతో లక్ష కిలోమీటర్ల రథయాత్ర కార్యక్రమం అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైనది. దీన్నీ డాక్టర్ విశారదన్ మహారాజు ఏప్రిల్ 14, 2025 అంబేద్కర్ జయంతి రోజున శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం కూడా ఆనాడు కొమురం భీమ్ సాగించిన భూ పోరాటం మరియు సామాజిక సమస్యల పరిష్కారం దిశగానే కొనసాగుతుంది. 

(ఇంద్రవెల్లి ఘటనకు 45 ఏళ్లు సందర్భంగా..)


- సంపతి రమేష్ మహారాజ్, సామాజిక విశ్లేషణకులు,7989578428

Advertisment
Advertisment
Advertisment