Toll charge: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!

రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో టోల్‌ ఛార్జీలు వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలను రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆదేశించారు. సేవలు ఉత్తమంగా లేనపుడు టోల్‌ ఛార్జీ వసూలు చేయొద్దని, నేషనల్‌ హైవే ఫీల్డ్‌ ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

New Update
Toll charge: వాహనదారులకు గుడ్ న్యూస్.. టోల్ ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!

Nitin Gadkari : దేశవ్యాప్తంగా రోడ్లు సరిగా లేని ప్రాంతాల్లో టోల్‌ ఛార్జీలు వసూలు చేయొద్దని ఆయా ఏజెన్సీలకు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సూచించారు. గుంతలతో కూడిన రోడ్లు, టోల్‌ ప్లాజాల వద్ద రద్దీ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. శాటిలైట్‌ ఆధారిత టోల్‌ వసూలుపై నిర్వహించిన గ్లోబల్‌ వర్క్‌షాప్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రజలు తిడుతున్నారు..
‘మీ సేవలు ఉత్తమంగా లేనపుడు టోల్‌ ఛార్జీ వసూలు చేయొద్దు. రోడ్లు బాగా లేకపోతే ప్రజలు హర్షించరు. చాలామంది ఇప్పటికే సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కాబట్టి మంచి రోడ్లు నిర్మించలేపుడు టోల్‌ వసూలు చేయడం సరైనది కాదు. ఒకవేళ గుంతలతో కూడిన రోడ్లపై టోల్‌ వసూలు చేస్తే రాజకీయ నాయకులుగా మేం ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. నేషనల్‌ హైవే ఫీల్డ్‌ ఆఫీసర్ల టోల్‌ ప్లాజాల వద్ద ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి' అని ఆదేశించారు.

రూ.10వేల కోట్ల అదనపు ఆదాయం..
ఇదిలా ఉంటే.. శాటిలైట్ ఆధారిత టోల్‌ ఛార్జీల వసూలు విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనున్నట్లు గడ్కరీ స్పష్టం చేశారు. తొలి దశలో 5 వేల కిలోమీటర్ల రహదారులపై ఈ టోల్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని, మొదట కమర్షియల్‌ వాహనాలకు ఒక లేన్‌లో అనుమతిస్తారని పేర్కొన్నారు. టోల్‌ వసూలుకు కీలకమైన వెహికల్‌ ట్రాకర్‌ సిస్టమ్‌ యూనిట్‌ను ఆయా వాహనాల్లో అమర్చాల్సి ఉంటుంది. ఈ వ్యవస్థ అందుబాటులోకి వస్తే వాహనాలు టోల్‌ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. దశలవారీగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తాం. దీనివల్ల ప్రభుత్వానికి రూ.10వేల కోట్లు అదనపు ఆదాయం సమకూరుతుందన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు