CM Yogi Adityanath : అఖిలేష్ యాదవ్ కుమార్తెపై ట్రోలింగ్.. సీఎం యోగి ఫైర్!

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుమార్తెను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని, ట్రోలింగ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు.

New Update
yogi

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుమార్తెను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని, ట్రోలింగ్‌ను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు. కుమార్తెలు ఎవరికైనా కుమార్తెలేనని, వారిని ఇలాంటి మురికి రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని అజాంగఢ్‌లో రూ. 955 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆడపిల్లలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన, అసహ్యకరమైన కామెంట్లు చేయడాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, అది క్షమించరాని నేరమని ఆయన హెచ్చరించారు.

ఇటీవల సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు అఖిలేష్ యాదవ్ గారి కుమార్తెపై అసభ్యకరమైన కామెంట్లు చేయడం నా దృష్టికి వచ్చింది. ఇది తెలిసిన వెంటనే, నేను స్పందించి నిందితులపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించాను అని ముఖ్యమంత్రి చెప్పారు. ఆడపిల్ల అంటే ఆడపిల్లే. ఊరిలో ఉండే ఏ ఆడపిల్ల అయినా అందరికీ కూతురు, సోదరి లాంటిదే అనే సంస్కృతి, విలువల మధ్య మనం పెరిగాం. మేము ఎప్పుడూ ఇందులో ఎలాంటి భేదాలు చూపించలేదు అని యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అఖిలేష్ యాదవ్ కుమార్తెను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నకిలీ, అవమానకరమైన పోస్ట్‌లను ప్రచారం చేసిన ముగ్గురు వ్యక్తులపై కాన్పూర్ పోలీస్ కమిషనరేట్ సైబర్ సెల్‌లో కేసు నమోదైంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా ఆమె ఫోటోను మార్ఫింగ్ చేసి, అబద్ధపు ప్రచారాలు చేస్తూ కొందరు వ్యక్తులు పిచ్చి వ్యాఖ్యలు పెట్టారని ఎస్పీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.

నిందితులపై కఠిన చర్యలు

ఈ సందర్భంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తూనే, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు సీఎం యోగి ఒక సలహా ఇచ్చారు. తమ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు కూడా మహిళలు, పెద్దలు, సీనియర్ నాయకుల పట్ల ప్రవర్తించేటప్పుడు భాషను అదుపులో ఉంచుకునేలా క్రమశిక్షణ నేర్పాలని హితవు పలికారు.

అఖిలేష్ జీ, మీరు ఇతరులకు సలహాలు ఇస్తుంటారు, కానీ మీ అనుచరులు, కార్యకర్తలు కూడా మర్యాదపూర్వకమైన భాషను వాడేలా మీరు చూసుకోవాలి. మీ వాళ్లకు మీరే బుద్ధి చెప్పడం మంచిది. ఒకవేళ వారికి అర్థం కాకపోతే, వారిని మాకు అప్పగించండి. వారికి పద్ధతిగా ఎలా అర్థం కావాలో అలా మేము అర్థమయ్యేలా చెప్తాం అంటూ ఎస్పీ పార్టీలోని గుండా సంస్కృతిని ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్ గట్టి చరకలు వేశారు.

Advertisment
తాజా కథనాలు