Jabalpur : అమ్మ ప్రేమంటే ఇది.. కన్నకొడుకును కౌగిలించుకుని ప్రాణాలు వదిలిన తల్లి

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన బోటు ప్రమాదం దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, శుక్రవారం రక్షక దళాలకు కనిపించిన ఒక దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది.

New Update
women

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన బోటు ప్రమాదం దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, శుక్రవారం రక్షక దళాలకు కనిపించిన ఒక దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది. నీటిలో నుంచి బయటకు తీసిన మృతదేహాలలో ఒక తల్లి తన నాలుగేళ్ల కొడుకును గట్టిగా హత్తుకుని కనిపించింది. ప్రాణాలు పోతున్నా తన బిడ్డను వదలకూడదన్న ఆ తల్లి ప్రేమను చూసి అక్కడ ఉన్న వారు వెక్కి వెక్కి ఏడ్చారు. వీరిద్దరి మృతదేహాలకు లైఫ్ జాకెట్ ఉన్నప్పటికీ మృత్యువు నుంచి తప్పించుకోలేకపోయారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి రాకేష్ సింగ్ సైతం ఆ దృశ్యాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యారు.

30 మంది ప్రయాణికులతో వెళ్తున్న

గురువారం సాయంత్రం బార్గి డ్యామ్ జలాశయంలో సుమారు 30 మంది ప్రయాణికులతో వెళ్తున్న క్రూయిజ్ బోటు అకస్మాత్తుగా వచ్చిన తుపాను కారణంగా బోల్తా పడింది. బలమైన గాలుల వల్ల నీరు ఉవ్వెత్తున ఎగసిపడటంతో బోటు అదుపు తప్పింది. ప్రమాదం జరగక ముందే ఒడ్డుకు వెళ్ళమని ప్రయాణికులు కేకలు వేసినా, సిబ్బంది పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇప్పటివరకు 22 మందిని రక్షించగా, ఇంకా కొందరు గాలిలో కలిసిపోయారు. రాష్ట్ర విపత్తు సహాయక దళం (SDRF), పోలీసులు, స్థానిక యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నాయి.

కాగా, ఈ ప్రమాదంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బోటులో కనీస భద్రతా ప్రమాణాలు పాటించలేదని, అందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని ఒక బాధితుడు ఆరోపించారు. లైఫ్ జాకెట్లు ఉన్నా కూడా ప్రాణాలు ఎందుకు పోయాయనే దానిపై విచారణ జరిపిస్తామని మంత్రి రాకేష్ సింగ్ తెలిపారు. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఈ ఘటనపై స్పందిస్తూ, బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పర్యాటక శాఖ మంత్రి ధర్మేంద్ర భవ్ సింగ్ లోధీ స్పందిస్తూ.. సహాయక చర్యలు ముగిసిన వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి, నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు