Samrat Chaudhary : ఎవరీ సామ్రాట్ చౌదరి...ఆయన బీహార్ ముఖ్యమంత్రి స్థాయికి ఎలా ఎదిగారో తెలుసా?

బీహార్ రాజకీయాల్లో నవశకం ప్రారంభమైంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారి BJP సీఎం పీఠం అధీష్టించింది. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్నబీజేపీకే ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది.

New Update
FotoJet (76)

Bihar's new CM Samrat Chaudhary

Samrat Chaudhary : బీహార్ రాజకీయాల్లో నవ శకం ప్రారంభమైంది...రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా BJP సీఎం పీఠం అధీష్టించింది...బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు...దశాబ్దాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటూవస్తోన్న జేడీయూ చీఫ్‌ నితీష్ కుమార్...సీఎం పదవికి రిజైన్ చేసి రాజ్యసభకు వెళ్లడంతో రాష్ట్రంలో నాయకత్వ మార్పు వచ్చింది...అసెంబ్లీలో 89 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకే ఈసారి ముఖ్యమంత్రి పీఠం దక్కింది...అంతకుముందు నితీష్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన సామ్రాట్ చౌదరిని...బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు...రాష్ట్రంలో రాజకీయంగా అత్యంత కీలకమైన ఓబీసీ కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన ఆయన నాయకత్వానికి NDA మిత్రపక్షాలు పూర్తి మద్దతు పలికాయి.

బీహార్ నూతన సీఎం సామ్రాట్ చౌదరిని రాకేష్‌ కుమార్ అని కూడా పిలుస్తారు. 1968, నవంబరు 16న ముంగేర్‌లోని లఖన్‌పూర్‌ గ్రామంలో జన్మించారు. గతంలో ఆర్జేడీ, జేడీయూ పార్టీలలో కూడా పనిచేశారు. ఈయన రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చారు...తండ్రి మాజీమంత్రి శకుని చౌదరిసహా తల్లి పార్వతీ దేవి కూడా రాజకీయ నాయకురాలే కావడం విశేషం. ఇప్పుడు మిత్రులుగా ఉన్న నితీశ్‌, సామ్రాట్‌లు ఒకప్పుడు బద్ధశత్రువులు. నితీశ్‌ను సీఎం పదవి నుంచి దింపుతానని సవాల్ విసిరడమే కాదు...అప్పటిదాకా  ముదురురంగు తలపాగా ఇలాగే ఉంచుతానని శపథం చేశారు. అయితే సమీకరణాలు పూర్తిగా మారిపోవడంతో అదే నితీశ్‌తో ఫ్రెండ్‌షిప్‌ చేయాల్సివచ్చింది. ఫలితంగా ఆయన చేసిన సవాల్‌ను వెనక్కి తీసుకుని...అయోధ్యకు వెళ్లి ఆ తలపాగా సమర్పించి మొక్కు తీర్చుకున్నారు సామ్రాట్ చౌదరి.

ఇక, సామ్రాట్ చౌదరికి కలిసొచ్చిన అంశం ఆయన సామాజిక వర్గమనే చెప్పాలి. రాష్ట్రంలో బలమైన కుష్వాహా ఓటుబ్యాంక్‌ను ఆకర్షించడంలో బీజేపీకి ఒక ఆయుధమయ్యారు. విమర్శలతో ప్రత్యర్థులను పరుగులు పెట్టించడంలో, పార్టీ కేడర్‌ను ఉత్సాహ పరచడంలో సామ్రాట్ చౌదరి దిట్ట.

సామ్రాట్ చౌదరి 1990లో క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు...2000లో జరిగిన ఎన్నికల్లో పర్బత్తా నుంచి ఆర్జేడీ ఎమ్మెల్యేగా గెలిచి రబ్రీదేవీ కేబినెట్‌లో వ్యవసాయమంత్రిగా పనిచేశారు.2010లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై  ప్రతిపక్ష పార్టీ చీఫ్ విప్‌గా నియమితుడయ్యాడు. 2014లో ఆర్జేడీపై తిరుగుబాటుచేసి జితన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని జనతా దళ్(యూ)లో చేరి...పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. సామ్రాట్ చౌదరి 2018లో బీజేపీలో చేరి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా,2023లో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగాడు. 2014 నుంచి 2016 వరకు, అలాగే 2020 నుంచి 2025 వరకు ఎమ్మెల్సీగా ఉన్నారు. 2024లో నితీష్ మంత్రివర్గంలో డిప్యూటీసీఎంగా ఎన్నుకోబడ్డాడు.

బీహార్‌లో కీలక నేతగా ఎదిగిన సామాట్ర్ చౌదరి రాజకీయ జీవితంలో ఎన్నో ఆరోపణలు, వివాదాలు ముసురుకున్నాయి. 1999లో రబ్రీదేవి కేబినెట్‌లో  వ్యవసాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు...అయితే, ఆ సమయంలో మంత్రి కావడానికి ఉండాల్సిన కనీస వయస్సు 25 ఏళ్లు లేదన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరపగా Underage అని తేలడంతో సామ్రాట్ చౌదరి పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. బీహార్ రాజకీయాల్లో ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది.

అలాగే సామ్రాట్ విద్యార్హతలపైనా వివాదం చోటుచేసుకుంది.  తాను 7వ తరగతి వరకే చదువుకున్నానని ఓ అఫిడవిట్‌లో పేర్కొనడం.. మరో అఫిడవిట్‌లో కాలిఫోర్నియా పబ్లిక్ వర్సిటీ నుంచి...డాక్టరేట్ పొందినట్లుగా చూపించడంతో రాజకీయ ప్రత్యర్థులు, మరీ ముఖ్యంగా ప్రశాంత్‌కిశోర్‌వంటి వారు ప్రశ్నలు సంధించారు.

సామ్రాట్‌ చౌదరి అసలు పేరు రాకేశ్ కుమార్... రాజకీయాల్లోకి వచ్చాక సామ్రాట్ చౌదరిగా మర్చుకున్నారు... ఈ పేరు మార్పు వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శకులు అంటుంటారు.

సామ్రాట్ చౌదరిపై అనేక కేసులు నమోదై ఉన్నాయి. 1995లో కాంగ్రెస్ నేత సచ్చిదానంద సింగ్‌సహా మరో ఆరుగురి హత్యకేసులో ప్రముఖంగా తండ్రి శకునితోపాటు సామ్రాట్ చౌదరి పేరు కూడా వినిపించింది. అయితే, ఆ సమయంలో తాను మైనర్ అని, తనకు సంబంధం లేదని వాదించారు.  ప్రస్తుతం ఆయనపై కొన్ని పెండింగ్ కేసులు ఉన్నట్లుగా ఎన్నికల అఫిడవిట్ల ద్వారా తెలుస్తుంది.

వయస్సు వివాదం నుంచి తలపాగా శపథం వరకు.. సామ్రాట్ చౌదరి రాజకీయ ప్రయాణం ఒక రంగుల రాట్నం లాంటిది. నిన్నటి ప్రత్యర్థులతో నేడు అధికారం పంచుకోవడం, పాత కేసుల నీడలు వెంటాడుతున్నా ప్రజల్లో తన బలాన్ని నిరూపించుకోవడం ఆయనకే చెల్లింది. అధికారపీఠం ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయన ముందున్న సవాలు.. తనపై ఉన్న ఆరోపణలను తుడిచిపెట్టుకుపోయేలా పరిపాలన అందించడమా? లేక తన రాజకీయ చాణక్యంతో విమర్శల నోళ్లు నొక్కడమా? బీహార్ రాజకీయ ముఖచిత్రంపై సామ్రాట్ సంతకం ఎంత కాలం నిలుస్తుందో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు