/rtv/media/media_files/2026/05/11/sanjay-2026-05-11-16-24-49.jpg)
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని పెట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్‌లో భగీరథ్‌పై 17 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. భగీరథ్ తనను లోబర్చుకుని, మద్యం తాగించి, నగర శివార్లలోని ఒక ఫామ్‌హౌస్‌లో లైంగిక దాడికి పాల్పడ్డారని ఆ బాలిక తన ఫిర్యాదులో ఆరోపించింది. దీనిపై పోలీసులు పోక్సో చట్టం (సెక్షన్లు 11, 12) తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఇంతకు ఈ చట్టం ఏంటి? ఇందులో ఉన్న సెక్షన్లు ఏంటి? శిక్షలు ఎలా ఉంటాయి? అని నెటిజన్లు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
అబ్బాయిలు కూడా వర్తిస్తుంది
POCSO అంటే Protection of Children from Sexual Offences. అంటే లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ కల్పించే చట్టం. పిల్లలపై పెరుగుతున్న అకృత్యాలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం 2012లో అత్యంత శక్తివంతమైన ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. చాలామంది ఈ చట్టం కేవలం ఆడపిల్లల కోసమే అనుకుంటారు. కానీ, 18 ఏళ్ల లోపు వయసున్న అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా ఈ చట్టం వర్తిస్తుంది. పిల్లలపై జరిగే శారీరక దాడులు, అసభ్య ప్రవర్తన, అసభ్యకరమైన వీడియోలు చూపించడం వంటివన్నీ ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.
సాధారణ కేసులకు, పోక్సో కేసులకు మధ్య చాలా తేడా ఉంది. ఇందులో ఉన్న కొన్ని కఠిన నిబంధనలు నిందితులకు చెమటలు పట్టిస్తాయి. ఈ చట్టం కింద కేసు నమోదైతే నిందితుడికి అంత సులభంగా బెయిల్ రాదు. సాధారణంగా ఏదైనా నేరం జరిగితే ఇతనే తప్పు చేశాడని పోలీసులు నిరూపించాలి. కానీ పోక్సోలో.. తాను తప్పు చేయలేదని నిందితుడే కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. బాధితులకు త్వరగా న్యాయం జరగాలని ప్రభుత్వం ప్రత్యేకంగా 'పోక్సో కోర్టుల'ను ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ విచారణ చాలా వేగంగా జరుగుతుంది.
ఒకవేళ నేరం చేశాడని తేలితే.. ఈ చట్టంలో శిక్షలు మారుతూ ఉంటాయి. పిల్లలను తాకడం లేదా అసభ్యంగా ప్రవర్తిస్తే 3 నుండి 5 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. లైంగిక దాడికి పాల్పడితే 7 ఏళ్ల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు. 019లో చేసిన సవరణల ప్రకారం, చిన్న పిల్లలపై అత్యంత దారుణంగా అఘాయిత్యాలకు పాల్పడే వారికి మరణశిక్ష (ఉరిశిక్ష) వేసే అధికారం కూడా కోర్టులకు ఉంది.
ఈ చట్టం ప్రకారం బాధితులైన పిల్లల పేరును గానీ, ఫోటోలను గానీ, వారి స్కూల్ వివరాలను గానీ మీడియాలో లేదా సోషల్ మీడియాలో బయటపెట్టడం పెద్ద నేరం. అలా చేసిన వారిపై కూడా పోలీసులు చర్యలు తీసుకుంటారు. బండి భగీరథ్ కేసు నేపథ్యంలో ఈ చట్టం చర్చకు వచ్చినప్పటికీ, రాజకీయాలతో సంబంధం లేకుండా పిల్లల భద్రత కోసం భారత్‌లో ఉన్న అత్యంత కఠినమైన చట్టం ఇదే. చట్టం ముందు అందరూ సమానమే అనే సూత్రంతో ఈ కేసులు విచారణకు వస్తాయి.
Follow Us