/rtv/media/media_files/2025/02/06/Q77J3khpvCfHT1IUpzfp.jpg)
indrajit sinha
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన బీజేపీ నాయకుడు ఇంద్రజిత్ సిన్హా ఇప్పుడు బీర్భూమ్ జిల్లాలోని తారాపిత్ శ్మశానవాటికలో భిక్షాటన చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంద్రజిత్ సిన్హా ఒకప్పుడు బెంగాల్ బీజేపీలో ఆరోగ్య సేవల సెల్ కన్వీనర్‌గా ఉన్నారు. అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు రాహుల్ సిన్హా సలహా మేరకు రాజకీయాల్లోకి ప్రవేశించి బీజేపీ ఉనికిని పెంచడానికి పగలు, రాత్రి పనిచేశారు.
40 ఏళ్ల ఇంద్రజిత్ సిన్హా అవివాహితుడు. ఆయన తల్లిదండ్రులు ఇప్పటికే మరణించారు. ఒకప్పుడు శక్తివంతమైన నాయకుడిగా ఎదిగిన ఇంద్రజిత్ సిన్హా గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. అతన్ని ఈ పరిస్థితిలో చూసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర విద్యా మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ ముందుకువచ్చారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఇంద్రజిత్ సిన్హాను వెంటనే ఆసుపత్రిలో చేర్పించమని బీర్భూమ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడిని కోరారు. అందుకు అవసరమయ్యే ఖర్చును తాను భరిస్తానని హామీ ఇచ్చారు.
అప్పుల్లో కూరుకుపోయా
ఇంద్రజిత్ సిన్హా దాదాపు పదేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి కాషాయం పార్టీలో చేరారు. ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారు. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఎదిగింది. కానీ అనారోగ్యంతో బాధపడుతున్న సిన్హాను ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు పట్టించుకోవడం లేదు. తనను ఆర్థికంగా చూసుకోవడానికి ఎవరూ లేకపోవడంతో తారాపిత్‌కు వెళ్లి అక్కడ శ్మశానవాటికలో భిక్షాటన చేయడం ప్రారంభించారు. ఇంద్రజిత్ సిన్హా మాట్లాడుతూ ప్రజలకు సహాయం చేస్తూనే తాను అప్పుల్లో కూరుకుపోయానని అన్నారు.
పార్టీ కోసం రాత్రింబవళ్లు పనిచేశానని.. పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులు ఏవరైనా అనారోగ్యానికి గురైతే ఆసుపత్రుల్లో చేర్పించి వారికి తానే స్వయంగా ఖర్చులు భరించానని ఇంద్రజిత్ సిన్హా తెలిపారు. పార్టీ కార్యక్రమాలను నిర్వహించి తాను చాలా అప్పుల్లో కూరుకుపోయానని తెలిపారు. అందుకే ఈరోజు తనకు ఈ గతి పట్టిందని.. తినడానికి కూడా తిండి లేక ఇలా బయట అడుకుంటున్నానని ఇంద్రజిత్ సిన్హా ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : బంగారు ప్రియులకు బిగ్ షాక్.. ఆల్ టైం గరిష్టానికి చేరిన పసిడి.. గ్రాము రేటు ఎంతంటే?