BIG BREAKING : విజయ్ సంచలన నిర్ణయం...ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ కు లేఖ?

విజయ్‌ టీవీకే పార్టీ తమిళనాడులో విజయం సాధించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్‌ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

New Update
TVK Vijay

TVK Vijay

BIG BREAKING : తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖించబడింది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ, సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) సంచలన విజయాన్ని నమోదు చేసింది. స్పష్టమైన మెజారిటీకి అతి సమీపంలో నిలిచిన విజయ్, ఇప్పుడు అధికార పీఠాన్ని అధిరోహించేందు కు అవసరమైన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. విజయ్‌ టీవీకే పార్టీ  తమిళనాడులో అనూహ్య విజయం సాధించినప్పటికీ.. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ 118 సీట్లను దక్కించుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడానికి విజయ్‌ గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రెండు వారాల్లో మెజారిటీ నిరూపించుకుంటామని గవర్నర్‌కు విజయ్‌ రాసిన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే.. ఆ పార్టీకి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కావాల్సిఉంది. దీంతో ఏ కూటమి నుంచి మద్దతు కూడగట్టాలనే విషయంపై పార్టీ నేతలు మళ్లగుళ్లాలు పడుతున్నారు.  

తమిళనాడు శాసనసభలోని మొత్తం 234 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీవీకే అనూహ్య రీతిలో 108 స్థానాలను కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పార్టీ అధినేత విజయ్ తాను పోటీ చేసిన పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల నుంచి భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించి, తన రాజకీయ శక్తిని చాటుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118 కాగా
టీవీకే 108 స్థానాలను గెలుచుకుంది, అంటే అధికార పీఠం దక్కాలంటే మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దుతు అవసరం ఉంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాష్ట్రంలో 'హంగ్' ఏర్పడింది. దీంతో స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు కీలకంగా మారింది.

గవర్నర్‌కు విజయ్ లేఖ – రెండు వారాల గడువు

ఇదిలా ఉండగా అతిపెద్ద పార్టీగా అవతరించిన తమను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని కోరుతూ విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. తమకు తగినంత బలం ఉందని, అవకాశం ఇస్తే అసెంబ్లీలో రెండు వారాల (14 రోజులు) గడువులోగా మెజారిటీ నిరూపించుకుంటామని ఆ లేఖలో ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం గవర్నర్ నిర్ణయం కోసం రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. 

ఈ ఎన్నికల్లో అత్యంత దిగ్భ్రాంతికరమైన అంశం ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఓటమి. తన సొంత నియోజకవర్గమైన కోలాత్తూరులో ఆయన పరాజయం పాలుకావడం డీఎంకే శ్రేణులను కుదిపేసింది. ఫలితాల అనంతరం ఆయన నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు ఓడిపోవడం, ఒక కొత్త పార్టీ అతిపెద్ద శక్తిగా ఎదగడం తమిళ రాజకీయాల్లో పెద్ద మార్పుగా పరిగణించబడుతోంది. 

 ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 10 సీట్ల కోసం విజయ్ ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు: కాంగ్రెస్ , పీఎంకే  పార్టీలు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇందుకు ప్రతిఫలంగా ఇరు పార్టీలు చెరో రెండు మంత్రి పదవులను కోరుతున్నట్లు సమాచారం.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం స్వయంగా విజయ్‌కు ఫోన్ చేసి మాట్లాడటం జాతీయ రాజకీయాల్లోనూ ప్రాధాన్యత సంతరించుకుంది. వామపక్ష పార్టీల నేతలతో కూడా టీవీకే అంతర్గత చర్చలు జరుపుతోంది. వీరంతా కలిస్తే విజయ్ సునాయాసంగా మెజారిటీ నిరూపించుకునే అవకాశం ఉంది.

ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులను అభినందించేందుకు,తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు విజయ్ పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ సమావేశంలో ఎల్పీ (Legislative Party) నేతను ఎన్నుకోవడంతో పాటు, ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే దానిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.మొత్తానికి, 'దళపతి' విజయ్ తన సినీ కెరీర్‌ను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే అధికారానికి చేరువ కావడంతో తమిళనాడులో కొత్త శకం మొదలైందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు