/rtv/media/media_files/2026/04/24/fotojet-2026-04-24-12-51-30.jpg)
Terrorists arrested
Terrorists : ఉత్తరప్రదేశ్ ఉగ్రవాద నిరోధక దళం (UP ATS) దేశ రాజధాని ప్రాంతంలో పెను ప్రమాదాన్ని తప్పించింది. నోయిడాలో మెరుపు దాడి నిర్వహించిన ఏటీఎస్ అధికారులు, పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ISI) , అక్కడి గ్యాంగ్‌స్టర్లతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. పక్కా సమాచారంతో శుక్రవారం నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో బాఘ్‌పత్‌కు చెందిన తుషార్ చౌహాన్ (హిజ్‌బుల్లా అలీ ఖాన్), ఢిల్లీకి చెందిన సమీర్ ఖాన్‌లు పట్టుబడ్డారు. వీరిద్దరూ కేవలం 20 ఏళ్ల వయస్సులోనే దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటం గమనార్హం.
నిందితులు సోషల్ మీడియా, ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పాకిస్థానీ హ్యాండ్లర్లతో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యువతను తీవ్రవాద భావజాలం వైపు ఆకర్షించడం, స్లీపర్ సెల్‌లను ఏర్పాటు చేయడం వీరి ప్రధాన లక్ష్యంగా ఉంది. ఢిల్లీ -ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని 'టార్గెటెడ్ కిల్లింగ్‌లు' చేయడానికి, అలాగే విధ్వంసకర దాడుల ద్వారా అశాంతిని సృష్టించేందుకు వీరు కుట్ర పన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను దెబ్బతీసేలా ఐఎస్‌ఐ ఇచ్చిన ఆదేశాల మేరకు వీరు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.
Also Read: కేసీఆర్ కు బిగ్ షాక్.. పార్టీ పేరు ప్రకటించిన కవిత!
అరెస్ట్ సమయంలో నిందితుల నుంచి ప్రమాదకరమైన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద ఉన్న పిస్టళ్లు, మందుగుండు సామగ్రి, కత్తులు, కీలక సమాచారం ఉన్న మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. పాకిస్థాన్ గ్యాంగ్‌స్టర్ల డైరెక్షన్‌లో పెద్ద ఎత్తున రక్తపాతం సృష్టించేందుకు ఆయుధాలను సేకరిస్తున్న క్రమంలో ఏటీఎస్ నిఘా వర్గాలు వీరిని కనిపెట్టాయి. ఈ ఆయుధాల ద్వారా ఎక్కడెక్కడ దాడులు చేయాలని ప్లాన్ చేశారనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: ఢిల్లీలో దాడులకు ప్లాన్...ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్
ప్రస్తుతం వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS), ఆయుధాల చట్టం మరియు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏ (UAPA) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల వివరాలు రాబట్టేందుకు నిందితులను పోలీస్ కస్టడీకి కోరేందుకు ఏటీఎస్ సిద్ధమైంది. సకాలంలో స్పందించి వీరిని అరెస్ట్ చేయడం ద్వారా భారీ ఉగ్రవాద కుట్ర భగ్నమైందని, దేశ వ్యతిరేక శక్తులపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఏటీఎస్ అధికారులు స్పష్టం చేశారు.
Follow Us