/rtv/media/media_files/2026/05/18/tvk-vijay-2026-05-18-10-35-06.jpg)
తమిళనాడు రాజకీయాల్లోఅప్పుడే వెడెక్కాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయం సాధించి, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన దళపతి జోసెఫ్ విజయ్ ప్రభుత్వంపై డీఎంకే తీవ్రస్థాయిలో విమర్శల దాడి పెంచింది. విజయ్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మరో ఆరు నెలల కంటే ఎక్కువ కాలం మనలేదని డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. విజయ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. "ఈ ప్రభుత్వం మహా అయితే ఇంకో నాలుగు నుండి ఆరు నెలలు మాత్రమే బతుకుతుంది. ఆ తర్వాత మా 'తలైవర్' ఎం.కె. స్టాలిన్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయం అంటూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు.
గత ఎన్నికల్లో డీఎంకే అధినేత స్టాలిన్ తన సొంత నియోజకవర్గమైన కొలత్తూర్‌లో టీవీకే అభ్యర్థి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందిస్తూ.. "స్టాలిన్ కొలత్తూర్‌ను సింగపూర్‌లా మార్చారు. కానీ అక్కడి ఓటర్లు విలువ తెలియకుండా ప్రవర్తించారు. రాబోయే రోజుల్లో స్టాలిన్ తిరుచ్చి నుండి పోటీ చేయాలని మేము కోరుకుంటున్నాము" అని ఆయన వ్యాఖ్యానించారు.
బహిరంగ సవాల్
ఇదే వేదికపై నుంచి మంత్రి ఆధవ్ అర్జునకు అనితా రాధాకృష్ణన్ బహిరంగ సవాల్ విసిరారు. "ఆధవ్ అర్జునకు నిజంగా దమ్ముంటే.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నేను కూడా నా పదవికి రాజీనామా చేస్తాను. ఇద్దరం తిరుచెందూర్ నియోజకవర్గంలో తలపడదాం. ఇది మా అడ్డా.. ఇక్కడ మమ్మల్ని ఎదిరించిన వారిని ఓడించి తీరుతాం" అంటూ సవాల్ విసిరారు. కాగా, తిరుచెందూర్ స్థానం గత 25 ఏళ్లుగా అనితా రాధాకృష్ణన్‌కు బలమైన కోటగా ఉంది.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ ఒంటరిగానే 108 స్థానాలు గెలుచుకుంది. మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్.. ఆ తర్వాత కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతుతో (గతంలో ఇవి డీఎంకే కూటమిలో ఉండేవి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల జరిగిన విశ్వాస పరీక్షలో కూడా 144 ఓట్లతో విజయ్ సర్కార్ నెగ్గింది.
తమ చేతుల్లోంచి అధికారం చేజారిపోవడంతో డీఎంకే శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. విజయ్ ప్రభుత్వం అస్థిరంగా ఉందంటూ డీఎంకే ప్రచారం చేస్తుండగా.. టీవీకే మాత్రం దీన్ని కొట్టిపారేస్తోంది. మరి డీఎంకే విసిరిన ఈ తాజా సవాల్‌పై సీఎం విజయ్ ఆఫీస్ గానీ, ఆధవ్ అర్జున గానీ ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Follow Us