Donald Trump : ఇరాన్‌పై దాడి .. అగ్రశ్రేణి సైనిక నేతలు ఖతం అంటూ ట్రంప్ పోస్ట్!

ఖతార్‌లోని టెహ్రాన్ నగరంపై అమెరికా జరిపిన భారీ దాడిలో ఇరాన్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి సైనిక నాయకులు హతమయ్యారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.

New Update
Donald Trump

Donald Trump

ఖతార్‌లోని టెహ్రాన్ నగరంపై అమెరికా జరిపిన భారీ దాడిలో ఇరాన్‌కు చెందిన పలువురు అగ్రశ్రేణి సైనిక నాయకులు హతమయ్యారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికగా వెల్లడిస్తూ, ఆ సమయంలో ఆకాశంలో భారీ ఎత్తున వెలుగులు చిమ్ముతున్న పేలుళ్లకు సంబంధించిన ఒక నిమిషం నిడివి గల వీడియోను కూడా జత చేశారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఈ పరిణామం మరింత ఆందోళన కలిగిస్తోంది.

అంతకుముందే ట్రంప్ ఇరాన్‌కు 48 గంటల గడువు విధిస్తూ ఒక హెచ్చరిక జారీ చేశారు. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని వెంటనే తెరిచి, అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ భీకరమైన దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుందని, పరిస్థితి నరకంలా మారుతుందని ఆయన హెచ్చరించారు. ఈ గడువు ముగియకముందే ఇరాన్ గగనతలంలో రెండు అమెరికా యుద్ధ విమానాలను ఆ దేశం కూల్చివేసింది. దాదాపు ఆరు వారాలుగా జరుగుతున్న ఈ యుద్ధంలో అమెరికా విమానాలు నేలకూలడం ఇదే మొదటిసారి. ఈ ఘటనలో ఒక అమెరికా సైనికుడు శత్రువుల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో గల్లంతు కాగా, అతని కోసం అమెరికా దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.

మరోవైపు యుద్ధంలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్ల అమెరికా రాజకీయాల్లో కూడా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అనూహ్య నిర్ణయం తీసుకుంటూ, ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌ను వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని ఆదేశించారు. దీనికి సరైన కారణం వెల్లడించనప్పటికీ, యుద్ధ నిర్వహణపై ట్రంప్ ప్రభుత్వంపై వస్తున్న విమర్శల నేపథ్యంలోనే ఈ మార్పు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ పరిణామాలు వాషింగ్టన్‌లో రాజకీయ అలజడికి దారితీశాయి.

సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు

అమెరికాలో జరుగుతున్న ఈ రాజకీయ మార్పులపై ఇరాన్ సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు కోరుకుంటున్న ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలిందని, అసలైన మార్పు వాషింగ్టన్‌లోనే జరుగుతోందని దక్షిణాఫ్రికాలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎద్దేవా చేసింది. అమెరికా సైనిక అధికారుల ఫోటోలను ఉంచి, వాళ్లని తొలగించడాన్ని చూపిస్తూ "ప్రభుత్వ మార్పు విజయవంతంగా జరిగింది" అంటూ నవ్వుతున్న ఎమోజీలతో పోస్ట్ పెట్టింది. 

ఇక పాకిస్థాన్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందిస్తూ, అమెరికా పైలట్లకు ఇరాన్ జైలు కంటే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్లే ఎక్కువ ప్రమాదం ఉందని వ్యాఖ్యానించింది. ఇరాన్ దళాలు ఖైదీలను ఎంతో గౌరవంగా చూసుకుంటాయని వారు స్పష్టం చేశారు. ఈ వరుస ఘటనలతో అగ్రరాజ్యం అమెరికా గగనతల ఆధిపత్యానికి గండి పడటమే కాకుండా, గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ఎటు దారితీస్తుందో అన్న భయం ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతోంది.

Advertisment
తాజా కథనాలు