Kolkata : పశ్చిమ బెంగాల్‌లో హై టెన్షన్.. TMC MPపై ఎటాక్ !

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా చందీతాలా పోలీస్ స్టేషన్ వెలుపల తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ  ఎంపీ కల్యాణ్ బెనర్జీపై బీజేపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు.

New Update
tmc mp attack

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా చందీతాలా పోలీస్ స్టేషన్ వెలుపల తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభ  ఎంపీ కల్యాణ్ బెనర్జీపై బీజేపీ మద్దతుదారులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత అరెస్ట్ అయిన తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. పోలీసులకు వినతిపత్రం సమర్పించడానికి కల్యాణ్ బెనర్జీ ఆధ్వర్యంలో టీఎంసీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌కు వచ్చాయి. అదే సమయంలో అక్కడకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు వారికి ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య గొడవ మొదలైంది.

బీజేపీ కార్యకర్తలు టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ.. నిరసనకారులను దొంగలని దూషించడంతో పరిస్థితి ఒక్కసారిగా చెయ్యి దాటిపోయింది. ఈ గందరగోళం మధ్యే కల్యాణ్ బెనర్జీపై దాడి జరిగింది. దాడి అనంతరం ఆయన తన తలకు తడి కర్చీఫ్ అడ్డుపెట్టుకుని కనిపించారు. ఈ ఘటనా స్థలానికి భారీగా స్థానిక పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఈ క్రూరమైన దాడిని ఎంపీ తీవ్రంగా ఖండించారు. తాము కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును వాడుకుంటుంటే, కావాలనే తనను టార్గెట్ చేసి దాడి చేశారని ఆయన మండిపడ్డారు.

తలపైకి రాయి విసిరారని

తాను నిరసన వేదిక వైపు నడుచుకుంటూ వెళ్తుండగా.. కాషాయ కండువాలు కప్పుకున్న 10 నుండి 15 మంది గూండాలు తనపైకి దూసుకొచ్చారని కల్యాణ్ బెనర్జీ చెప్పారు. వారిలో ఒకరు తన తలపైకి రాయి విసిరారని, ఇదంతా పోలీసుల ముందే జరిగిందని ఆయన ఆరోపించారు. రాయి తగలడంతో తన తల పగిలి రక్తం కారిందని, రోడ్డుపై పడిపోయిన తనను ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ కాపాడారని చెప్పారు. ఈ దాడి తనను చంపే ఉద్దేశంతోనే జరిగిందని, బెంగాల్ పోలీసులు మాత్రం మూగప్రేక్షకుల్లా నిలబడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు ఈ ఆరోపణలను అధికార బీజేపీ పూర్తిగా ఖండించింది. కల్యాణ్ బెనర్జీకి ఎలాంటి గాయం కాలేదని, అదంతా అబద్ధమని కొట్టిపారేసింది. ప్రజల్లో సానుభూతి  సంపాదించడం కోసమే ఆయన గాయపడినట్లు నటిస్తున్నారని ఆరోపించింది. వార్తల్లో నిలవడం కోసం, అందరి దృష్టిని ఆకర్షించడానికే ఎంపీ ఇదంతా ఒక పెద్ద డ్రామా ఆడారని బీజేపీ నాయకులు ఎద్దేవా చేశారు. ఎన్నికల తర్వాత టీఎంసీపై స్థానిక ప్రజల్లో ఉన్న కోపమే ఇలా వ్యక్తమవుతోందని వారు పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు