/rtv/media/media_files/2026/04/10/tappad-2026-04-10-15-47-45.jpg)
Thappad Gang
Thappad Gang : మనం దోపిడీ దొంగల ముఠాలు, చెడ్డీ గ్యాంగ్ ముఠాలు, గొలుసు దొంగల ముఠాలను చూసే ఉంటాం. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ముఠా ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ముఠా
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో హల్ చల్ చేస్తోంది. అలాగని ఈ ముఠా ఎవరిని బెదిరించడమో, దొంగతనాలకు పాల్పడటమో చేయడం లేదు. రాత్రి పూట బైక్‌లపై వస్తున్న ఈ ముఠా దారివెంట నడుచుకుంటూ వెళ్లేవారిని టార్గెట్‌గా చేసుకుని చెంపపగలగొట్టి వెళుతోంది. వీరు కావాలనే కేవలం వినోదం కోసమో లేదా ప్రజలను భయపెట్టడానికి మాత్రమే ఇలా చేస్తున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ప్రజలు ఒంటరిగా వెళ్లాలంటే ఎక్కడ ఎవరు చెంప పగలగొడుతారో అని భయాందోళనకు గురవుతున్నారు. ఈ ముఠాను స్థానికులు 'చెంపదెబ్బల ముఠా' (థప్పడ్ గ్యాంగ్) అని పిలుచుకుంటున్నారు.
ఏప్రిల్ 7న సాయంత్రం నగర్ కొత్వాలీ పరిధిలోని గౌశాల మొహల్లాలో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా బయటకు వచ్చింది. రెండు రోజుల క్రితం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న దీపక్ అనే యువకుడిని మోటార్ సైకిల్‌పై వచ్చిన కొంతమంది యువకులు చెంపదెబ్బ కొట్టారు. అతను దాని నుంచి తేరుకునే లోపునే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటన సమీపంలోని ఒక ఇంట్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఆ యువకుడిని కొట్టిన చెంపదెబ్బ చాలా బలంగా తగలడంతో అతని ముక్కు నుంచి రక్తం కారింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ మారడంతో పాటు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇలా ఒకటి కాదు వరుసగా చాలామందికి జరిగినట్లు చెబుతున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మొదట ఇది కేవలం ఒకరు ఇద్దరు మాత్రమే చేస్తున్నారని అనుకున్నారు.. కానీ నిత్యం ఇలాంటి సంఘటనలు వేర్వేరు చోట జరుగుతుండటంతో బాధితులు ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయో పోలీసులు ఆరా తీస్తున్నారు. దీంతో గతంలో పలువురిని ఈ విధంగానే కొట్టడం, బెల్టులతో దాడి చేయడం వంటివి జరిగాయని వెలుగులోకి వచ్చింది. కాగా కొంత మంది ఆకతాయిలు సరదా కోసం చేస్తున్నారా లేక మరేదైనా కారణమా అనే విషయంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Follow Us