Abhishek Banerjee: బెంగాల్‌లో ఉద్రిక్తత.. టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీపై రాళ్లు,గుడ్లతో దాడి

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో శనివారం తీవ్ర కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో మమతా బెనర్జీ తర్వాతి స్థానంలో కొనసాగుతున్న సీనియర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో ఊహించని విధంగా రాళ్లు, గుడ్లతో దాడి జరిగింది.

New Update
FotoJet (54)

TMC leader Abhishek Banerjee attacked with stones and eggs

Abhishek Banerjee: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో శనివారం తీవ్ర కలకలం రేగింది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీలో మమతా బెనర్జీ తర్వాతి స్థానంలో (నంబర్ 2) కొనసాగుతున్న సీనియర్ ఎంపీ అభిషేక్ బెనర్జీపై దక్షిణ 24 పరగణాల జిల్లాలోని సోనార్‌పూర్‌లో ఊహించని విధంగా దాడి జరిగింది. ఎన్నికల అనంతర హింసాకాండలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు డైమండ్ హార్బర్ లోక్‌సభ సభ్యుడైన అభిషేక్ అక్కడకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఆయన పర్యటిస్తున్న తరుణంలో కొందరు నిరసనకారులు ఒక్కసారిగా రాళ్లు, గుడ్లతో దాడికి తెగబడ్డారు. అంతటితో ఆగకుండా కొందరు వ్యక్తులు ఆయనపై చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించి, కాళ్లతో తన్నడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి విషమించడాన్ని గమనించిన ఎంపీ వ్యక్తిగత భద్రతా సిబ్బంది వెనువెంటనే అప్రమత్తమై, క్షణాల వ్యవధిలో ఆయనను చుట్టుముట్టి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఇదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు అభిషేక్ బెనర్జీని లక్ష్యంగా చేసుకుని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆయనను ఉద్దేశించి “దొంగ.. దొంగ” (చోర్.. చోర్) అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ నిరసనలకు దిగారు. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీపై నడిరోడ్డుపై ఇలా దాడి జరగడం, అదే సమయంలో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించడంతో సోనార్‌పూర్‌లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది.

ఈ దాడిలో అభిషేక్ బెనర్జీ చొక్కా చిరిగిపోయింది. భద్రతా సిబ్బంది, పోలీసులు ఆయన్ను రక్షించి హెల్మెట్ తొడిగి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దాడి పూర్తిగా బీజేపీ స్పాన్సర్డ్ అని, తనను చంపేయాలనే కుట్రతోనే దాడికి పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసు భద్రత లేకపోవడంపై ఆయన మండిపడుతూ, హైకోర్టును, గవర్నర్‌ను ఆశ్రయిస్తానని ప్రకటించారు. 

ఈ దాడి అనంతరం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ చర్యలు, ఘర్షణలతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగిన అధికారులు సోనార్‌పూర్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పశ్చిమ బెంగాల్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య ఇప్పటికే ఉన్న పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం, ఈ తాజా దాడి ఘటనతో మరింత ముదిరి రాజకీయ యుద్ధానికి దారితీసింది.

Advertisment
తాజా కథనాలు