Tamil Nadu Voter List : తమిళనాడు ఓటర్ల లెక్క తేలింది...74లక్షల మంది ఓటర్లు ఔట్‌

తమిళనాడులో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (sir) పూర్తయింది. తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. గత ఎన్నికలతో పోలిస్తే 74లక్షల మంది ఓటర్లు తొలగించబడ్డారు.

New Update
Uttar Pradesh SIR Voter List

Tamil Nadu Voter List

Tamil Nadu Voter List :  పలు రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)తో ఆయా రాష్ట్రాల్లోఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. స్థిరనివాసం లేనివారు, వేర్వేరు చోట్ల ఓటు నమోదు చేయించుకోవడం ఇలా పలు కారణాలతో నమోదైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సవరిస్తోంది. కాగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడులో చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (sir) పూర్తయింది. దీంతో ఈ రోజు (సోమవారం) తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల సంఘం వెల్లడించిన జాబితాను బట్టి రాష్ట్రంలో మొత్తం 5.67కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. గత ఎన్నికలతో పోలిస్తే 74లక్షల మంది ఓటర్లు ఓటరు జాబితా నుంచి తొలగింపునకు గురికావడం గమనార్హం.

కాగా సర్‌ అమలు చేయడానికి ముందు గతేడాది అక్టోబరు చివరి నాటికి రాష్ట్రంలో 6.41కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఓటరు జాబితా ప్రకారం తెలుస్తోంది. అయితే ‘సర్‌’ ప్రక్రియ పూర్తయిన తర్వాత గతేడాది డిసెంబరు 19న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. దాని ప్రకారం ఓటర్ల సంఖ్యను 5.43 కోట్లుగా నిర్ధారించింది. అంటే.. జాబితాలో సుమారు 97లక్షల ఓటర్ల పేర్లను ఈసీ తొలగించింది. అయితే ఈ సందర్భంగా  ఓటు హక్కు కోల్పోయిన వారు ఎవరైన ఉంటే అభ్యంతరాలు తెలిపేందుకు ఈసీ కొంత సమయం ఇచ్చింది.

దీంతో ఓటు హక్కు కోల్పొయిన పలువురు తిరిగి దరఖాస్తులు చేసుకున్నారు. వారి దరఖాస్తులను మరోసారి పరిశీలించిన ఈసీ 27.53లక్షల మంది అర్హులైన ఓటర్లను తిరిగి చేర్చింది. అదే సమయంలో 4.23లక్షల మంది అనర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించింది. అనేక వడపోతలు, మార్పు చేర్పుల అనంతరం ఈ రోజు తమిళనాడు రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల కమిషన్‌ విడుదల చేసింది. సమగ్ర సవరణ అనంతరం ప్రస్తుతం తమిళనాడులో 5.67కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. కాగా మొత్తం  ఓటర్ల లో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89కోట్ల మంది మహిళలు ఉన్నట్లు తేల్చింది. అంటే గతంలో పోలిస్తే ఓటర్ల సంఖ్య 74లక్షల వరకు తగ్గినట్లయ్యింది. సమగ్ర సవరణ తర్వాత తమిళనాడు రాష్ట్రంలోని  చెంగల్‌పట్టు జిల్లా 27-శోలింగనల్లూర్‌ స్థానంలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది. ఇక్కడ 5.36లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇక అత్యల్పంగా చెన్నైలోని 18-హార్బర్‌ నియోజకవర్గంలో 1.16లక్షల ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది.

కాగా తమిళనాడు ప్రస్తుత శాసనసభ గడువుకాలం ఈ ఏడాది మే నెలతో ముగుస్తుంది. దీంతో ఇక్కడ  అంతకంటే ముందు ఏప్రిల్‌లో శాసనసభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి షెడ్యూల్‌ను మార్చి మధ్యలో ఈసీ విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో నటుడు విజయ్‌ టీవీకే పార్టీతో ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెట్టనున్నారు. ఒకపుడు డీఎంకే, ఏఐడీఎంకే(అన్నాడీఎంకే)ల మధ్య నువ్వా నేనా అన్నట్లు ఎన్నికలు సాగేవి. కానీ ఈసారి డీఎంకే కూటమితో పాటు, బీజేపీ, అన్నాడీఎంకే, టీవీకే పోరుతో ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.

Advertisment
తాజా కథనాలు