/rtv/media/media_files/2026/01/06/uttar-pradesh-sir-voter-list-2026-01-06-12-16-40.jpg)
Rajasthan SIR Voter List
SIR : కేంద్ర ఎన్నికల కమిషన్ ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) పూర్తయినట్లు ఎన్నికల కమిషన్ ఈ రోజు (శనివారం) ప్రకటించింది. కాగా ఈ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో అనర్హత కలిగిన ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించింది. కాగా ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసిన జాబితాలో అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల కంటే గుజరాత్‌లోనే అత్యధికంగా అనర్హత ఓటర్లను తొలగించినట్లు పేర్కొంది. ఆ రాష్ట్రంలో ఏకంగా 68 లక్షల 12 వేల 711 మందిని జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించింది. ఎస్ఐర్ ప్రక్రియకు ముందు 5,08,43,436 మంది ఓటర్లు అనర్హులను తొలగించిన తర్వాత ప్రస్తుతం 4,40,30,725కు తగ్గినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇక మధ్యప్రదేశ్‌లో 34,25,078 మందిని ఓటర్ల జాబితా నుంచి తొలగించగా అక్కడ ఓటర్ల సంఖ్య 5,74,06,143 నుంచి 5,39,81,065కు చేరుకుంది.
వీటితో పాటు SIR చేపట్టిన మిగతా రాష్ట్రాల్లోనూ ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలో సవరణలు చోటు చేసుకున్నాయని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. కమిషన్ వెల్లడించిన అశాలను బట్టి ఛత్తీస్‌గఢ్‌లో 2,12,30,737 నుంచి 1,87,30,914కు, కేరళలో 2,78,50,855 నుంచి 2,69,53,644కు ఓటర్ల సంఖ్య తగ్గింది. రాజస్థాన్‌లో ఓటర్ల సంఖ్య 5,46,56,215 నుంచి 5,15,19,929 మందికి తగ్గింది. గోవాలో ఓటర్ల సంఖ్య 11,85,034 ఉండగా సవరణ తర్వాత 10,57,566కు తగ్గింది.
ఇక కేంద్ర పాలిత ప్రాంతాలైన అండమాన్ నికోబార్ దీవుల్లో సవరణలో భాగంగా 52,364 మందిని జాబితా నుంచి తొలగించారు. దీంతో ఓటర్ల సంఖ్య 3,10,404 నుంచి 2,58,040కి తగ్గింది. పుదుచ్చేరిలో ఓటర్ల సంఖ్య 10,21,578 ఉండగా సవరణ తర్వాత 9,44,211 మందికి చేరుకుంది. లక్షద్వీప్‌లో 57,813 మంది ఓటర్లు ఉండగా సవరించిన అనంతరం 57,607కు చేరుకుంది.
ఓటర్లను తొలగించడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ఓటరుగా నమోదు చేసుకున్నవ్యక్తి మరణం, శాశ్వతంగా నివాసస్థలాలు మార్చటం, పలుచోట్ల ఓటర్లుగా రిజిస్టర్ చేయించుకోవడం, ఇతర అనర్హత కారణాలతో పలువురు ఓటర్లను తొలగించినట్లు కమిషన్ తెలిపింది. వీరితో పాటు కొత్త ఓటర్లకు జాబితాలో చోటు కల్పించామని ఈసీ తెలిపింది. ఎన్నికల జాబితా అప్డేట్ అనేది నిరంతర ప్రక్రియ అని, అర్హత కలిగిన పౌరులు అప్లయ్ చేసుకోవడం, ఎంట్రీల కరెక్షన్ వంటివి ఎప్పటికప్పుడు చేసుకోవచ్చని తెలిపింది.
Follow Us