/rtv/media/media_files/2026/05/28/cm-siddaramaih-2026-05-28-20-25-43.jpg)
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులోని రాజ్ భవన్ కు వెళ్లిన సిద్ధరామయ్య.. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అందుబాటులో లేకపోవడంతో, ఆయన ప్రత్యేక కార్యదర్శి ప్రభు శంకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామా సమర్పించిన అనంతరం డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నప్పటికీ తన రాజకీయ ప్రస్థానం ముగిసిపోలేదని సిద్ధరామయ్య కుండబద్దలు కొట్టారు. తనకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఆసక్తి లేదని, కర్ణాటక రాజకీయాల్లోనే క్రియాశీలకంగా ఉంటానని ప్రకటించారు. "రాజీనామా తర్వాత నాకు రాజ్యసభ సీటు ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం ఆఫర్ చేసింది. కానీ నేను దాన్ని సున్నితంగా తిరస్కరించాను. నేను కర్ణాటకలోనే ఉండి ఇక్కడి రాజకీయాలకే పరిమితమవ్వాలని అనుకుంటున్నాను. నా చివరి శ్వాస వరకు మతతత్వ శక్తులపై నా పోరాటం కొనసాగుతుంది" అని సిద్ధరామయ్య స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలు దుష్ప్రచారం
పదవి నుంచి తప్పుకుంటున్న తరుణంలోనూ తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు గ్యారంటీ పథకాలను సిద్ధరామయ్య గట్టిగా సమర్థించుకున్నారు. ఈ పథకాల వల్ల కర్ణాటక దివాళా తీస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చేసిన విమర్శలను ఆయన కొట్టిపారేశారు. "మా గ్యారంటీ పథకాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేశాయి. కానీ ప్రస్తుతం దేశంలోనే తలసరి ఆదాయంలో కర్ణాటక నంబర్ వన్‌గా ఉంది. జీఎస్టీ వసూళ్లలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. దేశ జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతంగా ఉంటే, కర్ణాటక వృద్ధి రేటు 8.1 శాతంగా నమోదైంది" అని గణాంకాలతో సహా వివరించారు. ప్రభుత్వం హద్దులు మీరి అప్పులు చేసిందన్న ఆరోపణలను తిరస్కరిస్తూ.. తాము 'కర్ణాటక ఆర్థిక బాధ్యత చట్టం-2002' పరిమితులకు లోబడే నిధులు సేకరించామని చెప్పారు.
Follow Us