Big BREAKING : తమిళనాడులో సంచలనం...రాజకీయాల్లోకి లారెన్స్‌.. ?

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు ప్రస్తుతం తమిళనాట సంచలనంగా మారాయి. తిరుచ్చి ఈస్ట్' ఉప ఎన్నికలో ఆయన బరిలోకి దిగుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

New Update
FotoJet - 2026-06-07T133927.920

Raghava Lawrence

Big BREAKING : ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారన్న వార్తలు ప్రస్తుతం తమిళనాట సంచలనంగా మారాయి. కోలీవుడ్‌లో నటుడిగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. ఇప్పుడు రాజకీయ రంగప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులోని కీలకమైన 'తిరుచ్చి ఈస్ట్' అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో ఆయన బరిలోకి దిగబోతున్నారనే ప్రచారం తమిళ రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ స్టార్ హీరో, 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ అధినేత విజయ్ పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి భారీ విజయాలను అందుకున్నారు. అయితే, ఒక వ్యక్తి ఒకే స్థానానికి ప్రాతినిధ్యం వహించాలనే నిబంధన ప్రకారం విజయ్ పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని, తిరుచ్చి ఈస్ట్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఖాళీ అయిన ఈ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది.

విజయ్‌తో రాఘవ లారెన్స్‌కు ఉన్న ఆత్మీయ సంబంధాల నేపథ్యంలో, తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో టివికె (TVK) పార్టీ తరఫున లారెన్స్ బరిలోకి దిగడం ఖాయమనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ లారెన్స్ గనుక ఎన్నికల బరిలోకి దిగితే తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లారెన్స్ రాజకీయ ప్రయాణంపై మీడియాలో, సోషల్ మీడియాలో రకరకాల వార్తలు, కథనాలు షికారు చేస్తున్నాయి.

కేవలం వెండితెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ రాఘవ లారెన్స్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. తన తల్లి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎంతో మంది అనాథ పిల్లలను, వృద్ధులను ఆదుకుంటున్నారు. ఉచిత వైద్యం అందిస్తూ రియల్ హీరోగా ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. ఇబ్బందుల్లో ఉన్నామని ఎవరైనా సామాజిక మాధ్యమాల వేదికగా కోరినా, ఆయన టీమ్ మరియు స్నేహితులు వారిని వెతికి మరీ సహాయం అందిస్తారు. ఈ సేవా గుణమే ఆయనను రాజకీయాల వైపు నడిపిస్తోందని అభిమానులు భావిస్తున్నారు.

ఈ పొలిటికల్ ఎంట్రీ ఊహాగానాలపై తాజాగా రాఘవ లారెన్స్ తన అఫీషియల్ ఎక్స్ (X) ఖాతా వేదికగా స్పందించారు. "తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. దీనిపై స్పష్టత ఇవ్వాలని అనేక మంది మీడియా మిత్రులు నాకు ఫోన్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం నేను ‘బెంజ్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాను. ఈ నెల 10వ తేదీతో ఈ షెడ్యూల్‌ పూర్తవుతుంది" అని లారెన్స్ పేర్కొన్నారు.

తన భవిష్యత్తు కార్యాచరణ, రాజకీయ ప్రయాణంపై వస్తున్న వార్తలకు త్వరలోనే పూర్తిస్థాయిలో తెరదించుతానని లారెన్స్ స్పష్టం చేశారు. "మా అమ్మ ఆశీస్సులతో నా జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని ఈనెల 11వ తేదీ, గురువారం ఉదయం 9:30 గంటలకు ఎక్స్ వేదికగా ప్రకటిస్తాను. నా అభిమానులు, ప్రజలు, మీడియా మిత్రులు అప్పటివరకు వేచి చూడాలని కోరుతున్నాను" అని లారెన్స్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీంతో తనకు ఎంతో ఇష్టమైన గురువారం నాడు లారెన్స్ ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు