/rtv/media/media_files/2026/05/17/rahul-gandhi-2026-05-17-13-42-01.jpg)
కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ముఖ్యమంత్రి ఎంపికపై సాగిన హైడ్రామా నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను హెచ్చరిస్తూ వాయనాడ్‌లో వెలిసిన కొన్ని వివాదాస్పద పోస్టర్లు కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయ గోడలతో పాటు పలు ప్రధాన ప్రాంతాల్లో వెలిసిన ఈ పోస్టర్లపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కేరళ కొత్త ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న సమయంలో ప్రియాంకా గాంధీ వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ నియోజకవర్గంలో ఈ పోస్టర్లు దర్శనమిచ్చాయి. కేరళ సీఎం పీఠాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్‌కు అప్పగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయనేలా ఈ పోస్టర్లలో హెచ్చరికలు ఉన్నాయి.
రాహుల్ జీ, కేసీ వేణుగోపాల్ మీకు బ్యాగులు మోసే వ్యక్తి కావచ్చు. కానీ కేరళ ప్రజలు మిమ్మల్ని ఎప్పటికీ క్షమించరని ఒక పోస్టర్‌లో రాశారు. ఒకవేళ ఆయనకు సీఎం పదవి ఇస్తే.. 2019లో రాహుల్ గాంధీ ఓడిపోయిన ఉత్తరప్రదేశ్ లోని అమేథి నియోజకవర్గం గతే వాయనాడ్‌కు కూడా పడుతుందని హెచ్చరించారు. మిస్టర్ రాహుల్, ప్రియాంక.. వాయనాడ్‌ను మర్చిపోండి. ఇక్కడి నుండి మీరు మళ్లీ గెలవలేరు అంటూ ఇంగ్లీషులో ఉన్న పోస్టర్లు అక్కడ ప్రత్యక్షమయ్యాయి.
సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.
వాయనాడ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.సిద్ధిఖీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ ఆఫీస్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా.. ఒక వ్యక్తి అర్ధరాత్రి వేళ ఈ పోస్టర్లను గోడలపై అంటిస్తున్నట్లు గుర్తించారు. అతడు ఎవరు? దీని వెనుక ఏవైనా రాజకీయ శక్తులు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా గత నెలలో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కూటమి ఘనవిజయం సాధించింది. మొత్తం 140 స్థానాలకు గానూ ఏకంగా 102 సీట్లు గెలుచుకుని, దశాబ్దం తర్వాత కేరళలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వచ్చింది. మే 4న ఫలితాలు వచ్చినప్పటికీ సీఎం ఎవరనే దానిపై పది రోజులకు పైగా సస్పెన్స్ నడిచింది.
ముఖ్యమంత్రి రేసులో వి.డి. సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల ముగ్గురూ పోటీ పడ్డారు. అయితే, కేసీ వేణుగోపాల్ పేరును స్థానిక నేతలు కొందరు వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ పోస్టర్ల వివాదం రేగింది. చివరకు మే 14న కాంగ్రెస్ అధిష్ఠానం సస్పెన్స్‌కు తెరదించుతూ.. గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న వి.డి. సతీశన్‌ను కేరళ తదుపరి ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించింది.
Follow Us