/rtv/media/media_files/2025/02/09/6NosgeAeDP2iIFS85WjI.jpg)
mann
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పార్టీ ఓటమి పాలయింది. బీజేపీ 48 సీట్లతో అధికారంలోకి రాగా... ఆప్ 22 సీట్ల వద్దే ఆగిపోయింది. కాంగ్రెస్ మళ్లీ సున్నా సీట్లకే పరిమితం అయింది. అయితే ఆప్ అధికారం కోల్పోయిందని బాధలో ఉంటే అప్పుడే పంజాబ్‌లో గందరగోళం తీవ్రమైంది. ఆప్ ఘోర పరాజయం తర్వాత పంజాబ్‌లో కూడా పార్టీ చీలిపోతుందనే భయాలు మొదలుకున్నాయి.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్ త్వరలో మహారాష్ట్రకు చెందిన ఏక్‌నాథ్ షిండే మార్గాన్ని అనుసరించవచ్చని పంజాబ్ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా ఆరోపించారు. 30 మందికి పైగా ఆప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని, వారు ఎప్పుడైనా పార్టీలు మారవచ్చని బజ్వా సంచలన కామెంట్స్ చేశారు. పంజాబ్‌లోని ఆప్ ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిందని, ఒకటి భగవంత్ మాన్‌తో ఉందని, మరొకటి ఢిల్లీ నాయకత్వంతో విభేదిస్తోందని బజ్వా అన్నారు. ఈ మహారాష్ట్ర విమానం చండీగఢ్‌లో ల్యాండ్ అయినప్పుడు ఏక్‌నాథ్ షిండేగా మారే మొదటి ప్రయాణీకుడు భగవంత్ మాన్ అని చెప్పారు.
పంజాబ్ సీఎంగా కేజ్రీవాల్
భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖతో టచ్‌లో ఉన్నారని, ఢిల్లీలోని ఆప్ తో ఆయన విడిపోవచ్చని ప్రతాప్ సింగ్ బజ్వా పేర్కొన్నారు. పంజాబ్ ముఖ్యమంత్రి సిక్కు కానవసరం లేదని పంజాబ్ ఆప్ అధ్యక్షుడు అమన్ అరోరా ఇటీవల చేసిన కామెంట్స్ పై కూడా బజ్వా మాట్లాడారు. భవిష్యత్తులో కేజ్రీవాల్‌ను పంజాబ్ రాజకీయాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బజ్వా అన్నారు. పంజాబ్‌లోని లూథియానా స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యే గుర్‌ప్రీత్ గోగి మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉందని బజ్వా అన్నారు. ఆప్ తలచుకుంటే కేజ్రీవాల్‌ను ఈ స్థానం నుంచి పోటీచేయించి, ముఖ్యమంత్రిని చేయవచ్చన్నారు.
పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీకి చెందిన చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని గత ఏడాది కాలంగా చాలా మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని, మన్ ప్రభుత్వ భవిష్యత్తు గురించి వారు ఆందోళన చెందుతున్నారని బజ్వా అన్నారు. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కూడా నిఘా ఉంచిందని, రాబోయే కాలంలో పెద్ద రాజకీయ మార్పులు జరగవచ్చని ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఢిల్లీలో ఓటమి తర్వాత భగవంత్ మాన్ ప్రభుత్వం పంజాబ్ లో మనుగడ సాగించడం ఇప్పుడు కష్టమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఘోర పరాజయం తర్వాత పంజాబ్‌లో ఆప్ స్థానం కూడా అస్థిరంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.