/rtv/media/media_files/2026/05/13/pm-convoy-2026-05-13-11-02-54.jpg)
MODI CONGVOY REDUCE
MODI CONGVOY REDUCE : పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించుకోవాలంటూ హైదరాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన పిలుపు, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీశాయి. పొదుపు మంత్రం కేవలం ప్రజలకేనా, పాలకులకు వర్తించదా? అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నించిన మరుసటి రోజే.. ప్రధాని మోదీ ఊహించని రీతిలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన సొంత కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను భారీగా తగ్గించుకుంటూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
హైదరాబాద్ వేదికగా జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ... అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై (ఫారెక్స్ రిజర్వ్స్) తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని పేర్కొన్నారు. దేశ సంపద వృథా కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని వీలైనంతగా తగ్గించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే, ఈ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియా వేదికగా మోదీపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్, విమర్శలు వెల్లువెత్తాయి. "ప్రజలకు సుద్దులు చెప్పే ముందు మీరు పాటిస్తే బెటర్ కదా సార్?" అంటూ నెటిజన్లు నిలదీశారు.
సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి వ్యక్తమైన ఈ విమర్శలపై ప్రధాని మోదీ తక్షణమే స్పందించారు. కేవలం ప్రజలకే కాకుండా, పాలకులకు కూడా ఈ పొదుపు సూత్రం వర్తిస్తుందని నిరూపించేలా తన భద్రతా కాన్వాయ్ విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను ఏకంగా సగానికి సగం (50 శాతం) తగ్గించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా, కాన్వాయ్‌లో ఇంధన ఆధారిత వాహనాలకు బదులుగా పర్యావరణహిత ఎలక్ట్రికల్ వెహికల్స్ (EVs) వాడకాన్ని పెంచాలని ప్రధాని సూచించారు.
ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) ఈ ఆదేశాల మేరకు తక్షణ చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి భద్రతా ప్రొటోకాల్‌కు మరియు రక్షణ వలయానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అత్యంత వ్యూహాత్మకంగా కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించింది. విమర్శలను సానుకూలంగా తీసుకుని, దేశ ప్రధాని స్థాయి వ్యక్తి తన భద్రతా వలయాన్ని సైతం తగ్గించుకుంటూ ఇంధన పొదుపు దిశగా ముందడుగు వేయడం గమనార్హం.
మరోవైపు, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధాని మోదీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు అభినందిస్తుండగా.. మరికొందరు మాత్రం కేవలం పీఎం ఒక్కరే తగ్గించుకుంటే సరిపోదని అభిప్రాయపడుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమంత్రులు (CMs), కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ మరియు హంగామా పేరుతో వందలాది లీటర్ల ఇంధనాన్ని వృథా చేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. రాజకీయ నాయకులందరూ విలాసాలకు స్వస్తి చెప్పి, ఇంధనాన్ని పొదుపు చేస్తేనే ప్రజల్లో నిజమైన మార్పు వస్తుందని, అప్పుడే ప్రధాని ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని సామాన్యులు స్పష్టం చేస్తున్నారు.
Follow Us