నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ 2025 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభ, రాజ్యసభలో విడివిడిగా ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రి వరుసగా ఎనిమిదోసారి ఆమె కేంద్ర బడ్జెట్‌ను సమర్పించనున్నారు.
రెండు విడతలుగా బడ్జెట్ సమావేశాలు
అయితే ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. ఇందులో మొదటి విడత సమావేశాలు 2025 జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనుండగా.. రెండో విడత సమావేశాలు మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. కాగా, బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కేంద్రం మొత్తం 16 బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇందులో కీలకమైన వక్స్ సవరణ బిల్లు కూడా ఉంది. ఫైనాన్స్ బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, రైల్వేస్, డిజాస్టర్ మేనేజ్ మెంట్, ఆయిల్ ఫీల్డ్స్ చట్టాల సవరణ బిల్లు లతో పాటు బాయిలర్స్, మర్చంట్ షిప్పింగ్, కోస్టల్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది.
బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్ లో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించింది. డిఫెన్స్ మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ సమావేశంలో బడ్జెట్ సమావేశాల అజెండాను ప్రతిపక్షాలకు వివరించారు. మీటింగ్ లో కేంద్రమంత్రులు జేపీ నడ్డా, కిరణ్ రిజిజు, కాంగ్రెస్ ఎంపీలు గౌరవ్ గొగొయ్, జైరాం రమేశ్, డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, టీఎంసీ ఎంపీలు సుదీప్ బందో పాధ్యాయ్, డెరెక్ ఒ బ్రెయిన్ తదితరులు పాల్గొన్నారు.
కాగా, పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ నేతృత్వంలో సమస్యలను లేవనెత్తు తామని కాంగ్రెస్ లీడర్ ప్రమోద్ తివారీ తెలిపారు. రైతులు, నిరుద్యోగులు సహా ప్రజల సమస్యలన్నింటి పై కేంద్రాన్ని ప్రశ్నిస్తామని చెప్పారు. కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపైనా ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. వీఐపీల కారణంగానే కుంభమేళాలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బీజేపీ పాలనలో మతపరమైన ఉత్సవాలన్నీ వీఐపీల సమ్మే ళనాలుగా మారాయని విమర్శించారు.