/rtv/media/media_files/2026/06/07/ambulance-2026-06-07-16-23-57.jpg)
మధ్యప్రదేశ్‌లోనే అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రి నెట్‌వర్క్ అది.. కానీ అక్కడ మానవత్వం మంటగలిసింది. ఒక 12 ఏళ్ల పిల్లాడు మండుటెండలో స్ట్రెచర్‌పై నరకం చూస్తుంటే.. ఆ కన్నవాళ్లే ఆసుపత్రి సిబ్బందిగా, వార్డ్ బాయ్‌లుగా, అంబులెన్స్‌గా మారాల్సి వచ్చింది. ఇండోర్‌లోని ఎమ్ వై ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిల మధ్య జరిగిన ఈ ఘటన.. ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్య సేవలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
వెన్నుముక సమస్యతో బాధపడుతున్న 12 ఏళ్ల ఆదర్శ్ అనే పిల్లాడిని ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి రెఫర్ చేశారు. కానీ, కనీసం ఒక వార్డ్ బాయ్ గానీ, అటెండెంట్ గానీ, వాహన సదుపాయం గానీ అధికారులు కల్పించలేదు. దీంతో ఆ పిల్లాడి తండ్రి స్ట్రెచర్‌ను లాగుతూ ఉంటే.. తల్లి పక్కనే నడుస్తూ, ఎండ తీవ్రత తట్టుకోలేక తన చున్నీని నీళ్లలో ముంచి కొడుకు శరీరంపై కప్పుతూ దాదాపు ఒక కిలోమీటర్ దూరం మండుటెండలో నడిపించుకుంటూ వెళ్లారు.
గత 15 రోజులుగా
బాధిత కుటుంబం తెలిపిన వివరాల ప్రకారం.. ఆదర్శ్‌కు గత 15 రోజులుగా 'ఎమ్ వై' ఆసుపత్రిలోని న్యూ చెస్ట్ వార్డులో ట్రీట్‌మెంట్ జరుగుతోంది. అయితే వెన్నుముక సమస్య కారణంగా అతన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లమన్నారు. తీరా అంత దూరం స్ట్రెచర్‌పై నెట్టుకుంటూ వెళ్లాక.. అక్కడ పిల్లాడిని అడ్మిట్ చేసుకోవాల్సిన అవసరం లేదని, కేవలం ఫైల్స్, డాక్యుమెంట్లు చూస్తే సరిపోతుందని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో ఆ పేద తల్లిదండ్రులు మళ్లీ ఆ పిల్లాడిని అదే స్ట్రెచర్‌పై తిరిగి 'ఎమ్ వై' ఆసుపత్రికి నెట్టుకుంటూ తీసుకురావాల్సి వచ్చింది.
ఈ ఘటనపై 'ఎమ్ వై' ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ యాదవ్ స్పందిస్తూ.. ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఆ పిల్లాడిని అసలు ఏ వార్డు నుంచి రెఫర్ చేశారనే దానిపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. అటు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పీయూష్ పంచరియా మాట్లాడుతూ.. తాను సర్జరీలో బిజీగా ఉండటం వల్ల పూర్తి వివరాలు తెలియవని, అసలు పిల్లాడి పరిస్థితి ఏంటి అనేదానిపై ఆరా తీస్తున్నామని చెప్పుకొచ్చారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని పెట్టుకున్నా.. రోగులకు కనీస సేవలు అందకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ 'ఎమ్ వై' ఆసుపత్రి ఇలాంటి నిర్లక్ష్యపు ఘటనలతో వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది లోనే వరుసగా ఇలాంటి దారుణాలు జరిగాయి. ఈ ఆసుపత్రిలోని ఐసీయూలో ఉన్న ఇద్దరు నవజాత శిశువులను ఎలుకలు కొరికాయి. ఆ తర్వాత కొందరు పిల్లలు చనిపోగా.. ఎలుకలు కరవడం వల్లే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
Follow Us