/rtv/media/media_files/2025/02/17/L7lrekc86QYf7q3thvfT.jpg)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి పది రోజులు గడిచినా బీజేపీ ఇంకా సీఎం అభ్యర్ధిని ఖరారు చేయకపోవడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే, ఢిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి 10 రోజులు గడిచినప్పటికీ ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై ఢిల్లీ ప్రజలకు క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. ఢిల్లీ ప్రజల పట్ల బీజేపీకి ఎలాంటి దార్శనికత లేదని అతిషి విమర్శలు చేశారు.
సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో అతిషి బీజేపీపై విమర్శలు గుప్పించారు. " ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించి 10 రోజులు అయింది, ఈ రోజు 17వ తేదీ. బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని 9వ తేదీన ప్రకటిస్తుందని, 10వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని ఢిల్లీ ప్రజలు ఆశించారు. కానీ ఢిల్లీ ప్రజలు ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. బీజేపీ నుంచి గెలిచిన 48 మంది ఎమ్మెల్యేల ఏకైక పని ఢిల్లీ ప్రజలను దోచుకోవడం మాత్రమే " అని అతిషి ఆరోపించారు. బీజేపీ నుంచి గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలలో ప్రధాని మోదీ ఎవరినీ విశ్వసించడం లేదని అతిషి ఆరోపించారు. ఈ 48 మంది ఎమ్మెల్యేలలో ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం లేరని ఆయనకు తెలుసునన్నారు. ఎవరూ ముఖ్యమంత్రి అయ్యే సామర్థ్యం లేకపోతే ఢిల్లీ ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారంటూ ఆమె ప్రశ్నించారు.
బీజేపీ గ్రాండ్ విక్టరీ
కాగా ఇటీవల వెలువడిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 48 స్థానాలను గెలుచుకుని 27 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్ల ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేవలం 22 సీట్లు మాత్రమే గెలుచుకోగా, కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఖాతా తెరవలేకపోయింది. అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లతో సహా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అనేక మంది అగ్ర నాయకులు ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. సీఎం అతిషితో పాటుగా ముగ్గురు మంత్రులు గోపాల్ రాయ్, ముఖేష్ అహ్లావత్ , ఇమ్రాన్ హుస్సేన్ విజయాలను అందుకున్నారు.
ఇక సీఎం పదవికీ ఇప్పటికే అతిషి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్‌కు అందించారు అతిషి. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపద్ధర్మ సీఎంగా ఉండాలని అతిషిని కోరారు ఎల్జీ. కేజ్రీవాల్ అరెస్టు తర్వాత అనూహ్యంగా సీఎం అయ్యారు అతిషి. ఈమె ఢిల్లీకి మూడో సీఎం కావడం విశేషం.
Also Read : Pakistan: బుద్దిమార్చుకోని పాక్.. భారత్ను అవమానించేలా చిల్లర చేష్టలు!