/rtv/media/media_files/2025/10/15/nitish-2025-10-15-15-43-30.jpg)
బీహార్ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత రెండు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వైఖరితో కూటమి ప్రభుత్వంలో ప్రకంపనలు మొదలయ్యాయి. గత నవంబర్ ఎన్నికల్లో భారీ విజయం సాధించి మళ్ళీ సీఎం పీఠం అధిష్టించిన నితీష్, అనూహ్యంగా రాజ్యసభకు వెళ్లడం రాజకీయ అనిశ్చితికి దారితీసింది. ఆయన త్వరలోనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారన్న వార్తల నేపథ్యంలో తదుపరి వారసుడు ఎవరనే చర్చ జోరందుకుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో "సమృద్ధి యాత్ర" నిర్వహిస్తున్న నితీష్ కుమార్, బుధవారం జముయి జిల్లాలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. వేదికపై ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని ఉద్దేశించి మాట్లాడుతూ.. "బీహార్ బాధ్యతలను ఇకపై సామ్రాట్ చౌదరే పర్యవేక్షిస్తారు. ఆయన నాయకత్వంలో రాష్ట్రం గణనీయమైన పురోగతిని సాధిస్తుంది" అని నితీష్ పేర్కొన్నారు. అంతకుముందు సహర్సా పర్యటనలోనూ సామ్రాట్ చౌదరి భుజంపై చేయి వేసి నితీష్ సన్నిహితంగా మెలిగారు. వరుసగా ఆయన ఇస్తున్న ఈ రాజకీయ సంకేతాలు, సామ్రాట్ చౌదరినే తదుపరి ముఖ్యమంత్రి అని దాదాపు ఖరారు చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
జేడీయూలో మొదలైన అసమ్మతి
నితీష్ కుమార్ వ్యాఖ్యలపై సొంత పార్టీ అయిన JD-Uలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామ్రాట్ చౌదరి పేరును తెరపైకి తేవడాన్ని కీలక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. జేడీయూ సీనియర్ నేత, మంత్రి విజయ్ చౌదరి స్పందిస్తూ.. నితీష్ కుమార్ ఎవరినీ తన రాజకీయ వారసుడిగా అధికారికంగా ప్రకటించలేదని స్పష్టం చేశారు. ఒకవేళ బీజేపీ నేతకు పగ్గాలు అప్పగిస్తే పార్టీలో తిరుగుబాటు తప్పదనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
రేసులో ఉన్న నాయకులు ఎవరు?
ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేసిన పక్షంలో, తదుపరి సీఎం బీజేపీ నుంచే ఉంటారని దాదాపు ఖాయమైంది. ఈ రేసులో ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి:
సామ్రాట్ చౌదరి: ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉంటూ నితీష్ ఆశీస్సులు పొందుతున్నారు.
దిలీప్ జైస్వాల్: పార్టీలో కీలక నేతగా గుర్తింపు పొందారు.
నిత్యానంద్ రాయ్: కేంద్ర మంత్రిగా ఉన్న ఈయన పేరు కూడా బలంగా వినిపిస్తోంది.
బీహార్‌లోని సంక్లిష్టమైన కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని, బీజేపీ అధిష్టానం OBC వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉంది. జేడీయూ నేతల అసంతృప్తిని చల్లార్చి, ఎలాంటి గందరగోళం లేకుండా కొత్త ముఖ్యమంత్రి ఎంపికను బీజేపీ హైకమాండ్ ఎలా పూర్తి చేస్తుందో వేచి చూడాలి.
Follow Us