/rtv/media/media_files/2026/05/16/neet-2026-paper-leak-2026-05-16-09-40-12.jpg)
NEET 2025 Paper Leak
NEET 2025 Paper Leak : వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే అత్యంత కీలకమైన ‘నీట్’ (NEET-UG) ప్రవేశ పరీక్షల విశ్వసనీయతపై మరోసారి తీవ్ర నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుత 2026 నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ (CBI) అధికారులకు గత ఏడాది (2025) పరీక్షకు సంబంధించిన అనేక షాకింగ్ నిజాలు దొరికాయి. గతేడాది కూడా ప్రశ్నపత్రం లీకైందా? లీకైన పేపర్ సాయంతోనే కొందరు యావరేజ్ విద్యార్థులు అసాధారణ మార్కులు సాధించి, ప్రభుత్వ వైద్య కాలేజీల్లో సీట్లు పొందారా? అనే సందేహాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.
రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన స్థానిక బీజేపీ నాయకుడు దినేశ్ బివాల్, అతని సోదరులు మంగీలాల్, ఘన్‌శ్యామ్‌ల కుటుంబం గతేడాది వార్తల్లో నిలిచింది. నీట్-2025లో ఈ ఒకే కుటుంబానికి చెందిన వికాస్ బివాల్, ప్రగతి, గుంజన్, సానియా, పలక్ అనే ఐదుగురు విద్యార్థులు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు సాధించారు. 2025 నవంబర్ 6న దినేష్ బివాల్ ఫేస్‌బుక్‌లో తమ ఘనతను చాటుకోగా, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు వీరి సక్సెస్ స్టోరీని భారీగా ప్రచారం చేశాయి. అయితే, తాజా 2026 లీకేజీ కేసులో మంగీలాల్, దినేశ్‌లతో పాటు వికాస్‌ను కూడా సీబీఐ అరెస్ట్ చేయడంతో ఈ అసాధారణ విజయాల వెనుక విద్యా మాఫియా హస్తం ఉందనే అనుమానాలు బలపడ్డాయి.
ఈ ఐదుగురు విద్యార్థుల పాత విద్యా రికార్డులను పరిశీలించిన దర్యాప్తు అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. మంగీలాల్ కుమారుడు వికాస్‌కు టెన్త్‌లో 63%, ఇంటర్‌లో 55% మార్కులే వచ్చాయి. 2024 నీట్‌లో 720కి కేవలం 270 మార్కులు సాధించిన ఇతను, 2025 నీట్‌లో ఏకంగా 85.1 పర్సంటైల్ సాధించి సవాయ్ మాధోపూర్ మెడికల్ కాలేజీలో సీటు కొట్టేశాడు. ప్రగతి 2024 నీట్‌లో 332 మార్కులే తెచ్చుకున్నా 2025లో 89 పర్సంటైల్ సాధించింది. అలాగే 2024 నీట్‌లో గుంజన్‌కు 355, సానియాకు 360, పలక్‌కు 512 మార్కులే రాగా.. 2025 నీట్‌లో సానియా 94, పలక్ 98.6 పర్సంటైల్ సాధించి టాప్ కాలేజీల్లో చేరిపోయారు. ఈ ఏడాది మంగీలాల్ తన చిన్నకుమారుడు రిషి కోసం ప్రశ్నపత్రం కొనుగోలు చేస్తూ దొరికిపోగా, ప్రస్తుతం రిషి పరారీలో ఉన్నాడు.
లీకేజీ సూత్రధారి నీట్ కమిటీ సభ్యుడే: సీబీఐ సంచలన గుర్తింపు
నీట్-2026 ప్రశ్నపత్రం లీకేజీకి ప్రధాన సూత్రధారి ‘నీట్ ప్రశ్నపత్ర రూపకల్పన కమిటీ’లో సభ్యుడిగా ఉన్న పీవీ కులకర్ణి అని సీబీఐ నిర్ధారించి, అతనిని పుణెలో అరెస్టు చేసింది. మహారాష్ట్ర లాతూర్‌కు చెందిన కులకర్ణి కెమిస్ట్రీ లెక్చరర్‌గా రిటైరైన తర్వాత ఈ కమిటీలో కొనసాగుతున్నారు. ఆయన తన నివాసంలో కొందరు విద్యార్థుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి, లీకైన ప్రశ్నలపై ప్రత్యేకంగా కోచింగ్ క్లాసులు నిర్వహించారు. కులకర్ణి నుంచి ఈ పేపర్ మనీషా వాఘ్మరే, శుభమ్ ఖైర్నార్ మీదుగా పుణెకు చెందిన సప్లయర్ యశ్ యాదవ్‌కు చేరింది. ఆ యశ్ యాదవ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని జైపూర్‌కు చెందిన మంగీలాల్ బివాల్ ఈ ప్రశ్నపత్రాన్ని సంపాదించినట్లు దర్యాప్తులో తేలింది.
గడిచిన 24 గంటల్లో సీబీఐ అధికారులు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దాడులు జరిపి లీకేజీతో సంబంధమున్న ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. నిజానికి 2024 నీట్ పరీక్ష సమయంలోనూ ఇలాంటి లీకేజీ కలకలం రేపింది. అప్పట్లో పరీక్షకు ముందురోజు రాత్రి జార్ఖండ్‌లోని హజారీబాగ్ సెంటర్ నుంచి ప్రశ్నపత్రం లీకవగా, 144 మంది విద్యార్థులు ఒక గెస్ట్ హౌస్‌లో రాత్రికి రాత్రే జవాబులను ప్రాక్టీసు చేసినట్లు సీబీఐ గుర్తించి 45 మందిని అరెస్ట్ చేసింది. ఆ వివాదం కారణంగానే అప్పట్లో ఎన్‌టీఏ (NTA) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్‌పై ప్రభుత్వం వేటు వేసింది.
రాజకీయం వర్సెస్ ఎన్‌టీఏ.. కాంగ్రెస్ విమర్శల విసుర్లు
గత మూడేళ్లుగా వరుసగా జరుగుతున్న లీకేజీలపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. 2024, 2025లలో కూడా నీట్ లీకైందని, దీనిపై సమగ్ర విచారణ జరపాలని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్ దోతాస్ర డిమాండ్ చేశారు. నిందితుడు దినేశ్ బివాల్ బీజేపీ నేత అయినందునే కేంద్రం ఈ స్కాంను తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయితే, 2025లో నీట్ లీక్ కాలేదని ఎన్‌టీఏ వర్గాలు బుకాయిస్తున్నప్పటికీ, తాజా ఆధారాలు దానికి భిన్నంగా ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. మోదీ పాలనలో ఇప్పటివరకు 148 పరీక్షల కుంభకోణాలు జరిగాయని మండిపడ్డారు.
నీట్ రద్దుతో విద్యార్థుల బలవన్మరణాలు.. రాహుల్ గాంధీ భరోసా
మే 3న జరిగిన 2026 నీట్ పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు కావడం, తిరిగి జూన్ 21కి వాయిదా పడటంతో విద్యార్థులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. రాజస్థాన్ సికార్‌లో 650కి పైగా మార్కులు వస్తాయని ఆశించిన ప్రదీప్ మేఘ్వాల్ అనే విద్యార్థి పరీక్ష రద్దు వార్త తట్టుకోలేక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌కు చెందిన 20 ఏళ్ల విద్యార్థిని కూడా ఇదే ఆందోళనతో ప్రాణాలు తీసుకుంది. ఈ ఘోరాలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. "ఇవి ఆత్మహత్యలు కావు, ప్రభుత్వ వ్యవస్థలు చేసిన హత్యలు. బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టం, ఇది నా వాగ్దానం" అంటూ విద్యార్థుల కుటుంబాలకు ధైర్యం చెప్పారు.
Follow Us