/rtv/media/media_files/2026/03/24/modi-and-trump-2026-03-24-20-00-13.jpg)
పశ్చిమ ఆసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు, యుద్ధం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా ప్రపంచ దేశాలకు చమురు సరఫరా చేసే హార్ముజ్ జలసంధి సురక్షితంగా ఉండాలని, నౌకల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకూడదని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్వయంగా వెల్లడించారు.
యుద్ధంపై కీలక ప్రకటన
మరోవైపు భారత పార్లమెంటులో కూడా ప్రధాని మోదీ ఈ యుద్ధంపై కీలక ప్రకటన చేశారు. యుద్ధం మొదలైనప్పటి నుండి తాను ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ అటు అమెరికా, గల్ఫ్ దేశాల నేతలతో నిరంతరం టచ్‌లో ఉన్నానని చెప్పారు. "మేము దౌత్యం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నమ్ముతాము. యుద్ధం జరుగుతున్నా మన దేశ నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడటమే మా మొదటి ప్రాధాన్యత" అని మోదీ స్పష్టం చేశారు. అలాగే గల్ఫ్ దేశాల్లో ఉంటున్న లక్షలాది మంది భారతీయుల భద్రత గురించి కూడా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది.
అమెరికా-ఇరాన్ మధ్య గొడవను తగ్గించడానికి పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ మరియు ఈజిప్ట్ దేశాలు మధ్యవర్తులుగా పనిచేస్తున్నట్లు సమాచారం. ట్రంప్ కూడా ఇరాన్‌తో చర్చలకు మొగ్గు చూపుతూ, దాడుల గడువును మరో ఐదు రోజులు పొడిగించారు. అయితే ఇరాన్ మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తోంది. అమెరికా నుండి ప్రతిపాదనలు అందాయని కొందరు అధికారులు అంటుంటే, మరికొందరు మాత్రం అసలు అధికారికంగా చర్చలే జరగలేదని చెబుతున్నారు.
ఈ భీకర యుద్ధం వల్ల ఇప్పటికే భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇరాన్‌లో 1,500 మందికి పైగా, లెబనాన్‌లో 1,000 మందికి పైగా చనిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విధ్వంసం ఆగి శాంతి నెలకొనాలంటే చర్చలే ఏకైక మార్గమని భారత్ బలంగా వినిపిస్తోంది. హార్ముజ్ జలసంధి అనేది అంతర్జాతీయ మార్గం కాబట్టి, అక్కడ నౌకల ప్రయాణానికి ఎవరి అనుమతి అక్కర్లేదని భారత షిప్పింగ్ శాఖ స్పష్టం చేసింది.
Follow Us