Mamata Banerjee :మమత బెనర్జీ సంచలన నిర్ణయం...కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో, జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఒక సంచలన పరిణామం తెరపైకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

New Update
FotoJet - 2026-06-10T191942.661

TMC merges with Congress

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో, జాతీయ స్థాయిలో ప్రస్తుతం ఒక సంచలన పరిణామం తెరపైకి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయనే వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్రమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టీఎంసీ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఢిల్లీలో మకాం వేసి, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వరుసగా భేటీ కావడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత టీఎంసీలో అంతర్గత విభేదాలు, తిరుగుబాట్లు తీవ్రరూపం దాల్చాయి. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత ఆప్తులుగా ఉన్నవారు సైతం ఇప్పుడు తృణమూల్‌కు గుడ్‌బై చెబుతున్నారు. ఎన్నికల అనంతర పరిస్థితులు, బీజేపీ నుంచి పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు, నాయకులపై దాడులు, అంతర్గత తిరుగుబాట్లు వెరసి మమతా బెనర్జీకి పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ తీవ్రమైన సంక్షోభం నుంచి పార్టీని గట్టెక్కించే మార్గాలపై చర్చించేందుకే ఆమె ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ భేటీల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ.. మమతా బెనర్జీ ముందు ఒక కీలకమైన ప్రతిపాదనను ఉంచినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను బలోపేతం చేయాలంటే టీఎంసీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమే సరైన మార్గమని సోనియా సూచించారు. అయితే, ఈ ప్రతిపాదనపై మమతా బెనర్జీ తక్షణమే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. పార్టీని విలీనం చేస్తే భవిష్యత్తులో నాయకత్వ బాధ్యతలు ఎలా ఉంటాయనే దానిపై కొన్ని సందేహాలు వ్యక్తం చేసిన మమత, ఆలోచించుకోవడానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని కొంత సమయం కోరినట్లు విశ్వసనీయ సమాచారం.

ఈ విలీన ప్రక్రియను సుగమం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక ఆకర్షణీయమైన కార్యాచరణ ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీని ప్రకారం, విలీనానికి అంగీకరిస్తే మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని ఇవ్వడానికి సోనియా గాంధీ హామీ ఇచ్చారు. అలాగే, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి కాంగ్రెస్ పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు అంగీకారం కుదిరింది. ఇదే తరుణంలో అభిషేక్ బెనర్జీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో గంటన్నరకు పైగా ఏకాంతంగా జరిపిన చర్చలు సైతం చాలా ఫలవంతంగా, నిర్మాణాత్మకంగా సాగినట్లు వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు, టీఎంసీలో అంతర్గత సంక్షోభం రోజురోజుకూ ముదురుతోందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. బుధవారమే టీఎంసీ రాజ్యసభ సభ్యురాలు సుష్మితా దేవ్ “రెండు పడవలపై ప్రయాణం చేయలేను” అంటూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతకుముందే మరో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ కూడా పార్టీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ తప్పుకున్నారు. దీనికి తోడు, సుమారు 20 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీలు పార్లమెంట్‌లో తమకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని కోరడం కలకలం రేపుతోంది. బెంగాల్ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తిరుగుబాటు వర్గ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ ప్రకటించడం పార్టీలో తిరుగుబాటును స్పష్టం చేస్తోంది.

అయితే, కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం కాబోతోందంటూ జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు ప్రస్తుతానికి తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ భేటీలు కేవలం ‘ఇండియా’ కూటమిని బలోపేతం చేయడానికి ,2029 లోక్‌సభ ఎన్నికల కోసం ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి మాత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ప్రతిపక్షాల మధ్య సమన్వయాన్ని సంస్థాగత విలీనంగా భావించకూడదని టీఎంసీ నేతలు చెబుతున్నప్పటికీ.. మారుతున్న రాజకీయ సమీకరణాలు, అంతర్గత సంక్షోభాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్-టీఎంసీల బంధం ఏ మలుపు తిరుగుతుందనేది ఇప్పుడు భారత రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Advertisment
తాజా కథనాలు