Gujarat : భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నా.. నాకు చావడానికి అనుమతివ్వండి :  భర్త ఫిర్యాదు!

గుజరాత్‌లో ఒక వింతైన ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య వేధింపులు తట్టుకోలేక, తన ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక భర్త.. తనకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ అధికారులను ఆశ్రయించాడు.

New Update
husband

గుజరాత్‌లో ఒక వింతైన ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్య వేధింపులు తట్టుకోలేక, తన ఫిర్యాదులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఒక భర్త.. తనకు కారుణ్య మరణం ప్రసాదించాలంటూ అధికారులను ఆశ్రయించాడు. గుజరాత్‌లోని సూరత్ నగరానికి చెందిన కిరిత్ పటేల్ అనే వ్యక్తి, ఈ మేరకు సూరత్ జిల్లా కలెక్టర్‌కు ఒక లిఖితపూర్వక దరఖాస్తును సమర్పించాడు. సుదీర్ఘ కోర్టు గొడవలు, మానసిక వేదనల వల్ల తనకు చావు తప్ప మరో మార్గం కనిపించడం లేదని ఆ అర్జీలో పేర్కొన్నాడు.

కిరిత్ పటేల్ ఆరోపణల ప్రకారం.. ఇంట్లో చిన్నపాటి గొడవలు జరిగినప్పుడల్లా ఆయన భార్య మహిళా రక్షణ చట్టాలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు కేసులు పెడుతోంది. కావాలనే గొడవలు సృష్టించి, ఆ వెంటనే పోలీసులకు లేదా మహిళా హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి తనను ఇరికించేదని ఆయన వాపోయాడు. అయితే ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిరూపణ కావాల్సి ఉంది.

అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే.. కిరిత్ పటేల్‌కు ఇదివరకు జరిగిన పెళ్లి ద్వారా ఒక కుమారుడు ఉన్నాడు. ఆ బాబును చంపడానికి తన భార్య ప్రయత్నించిందని పటేల్ ఆరోపించాడు. దీనిపై తాను పోలీసులను ఆశ్రయించినా కనీసం ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ఆయన అధికారులను పదే పదే కోరుతున్నాడు.

ఇద్దరికి మూడో పెళ్లి

వీరిద్దరి పెళ్లిళ్ల చరిత్ర ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కిరిత్ పటేల్‌కు, అలాగే అతని భార్యకు కూడా ఇది మూడో పెళ్లి కావడం గమనార్హం. వీరి వివాహం 2024 నవంబర్ 14న జరిగింది. పెళ్లయినప్పటి నుంచి తన భార్య, అత్త, మరియు ఆమె బంధువులు కలిసి డబ్బుల కోసం తనను తీవ్రంగా వేధిస్తున్నారని పటేల్ తెలిపాడు. తన భార్య డబ్బుల కోసం పెళ్లిళ్లు చేసుకుని మోసం చేసే వధువు అని ఆయన ఆరోపించాడు. గతంలో చేసుకున్న ఇద్దరు భర్తలను కూడా ఇలాగే కోర్టు కేసులు, భారీగా డబ్బుల డిమాండ్లతో వేధించి వదిలేసిందని, ఇప్పుడు తనను కూడా అదే తరహాలో భరణం,  గృహహింస కేసులతో వేధిస్తోందని పటేల్ ఆరోపించాడు.

కుటుంబ కలహాలు, భార్యల వేధింపులు ఎదుర్కొనే పురుషులకు చట్టపరంగా ఎలాంటి రక్షణ లభించడం లేదని కిరిత్ పటేల్ తన దరఖాస్తులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కేవలం హామీలే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన చెందాడు. అందుకే సూరత్ కలెక్టర్ కార్యాలయంలో కారుణ్య మరణం కోసం దరఖాస్తు ఇచ్చానని, ఈ నరకం అనుభవించడం కంటే చావడమే మేలని ఆయన పేర్కొన్నాడు. 

Advertisment
తాజా కథనాలు